తమిళనాడు : శ్రీలంక పడవలో పట్టుబడిన పాకిస్థాన్ మాదక ద్రవ్యాలు

ABN , First Publish Date - 2020-11-25T16:21:30+05:30 IST

తమిళనాడులోని తూత్తుకుడిలో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి.

తమిళనాడు : శ్రీలంక పడవలో పట్టుబడిన పాకిస్థాన్ మాదక ద్రవ్యాలు

చెన్నై : తమిళనాడులోని తూత్తుకుడిలో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఈ నెల 17న ప్రారంభమైన సోదాల్లో శ్రీలంక పడవలో 100 కేజీల హెరాయిన్‌ సహా ఇతర మాదక ద్రవ్యాలను ఇండియన్ కోస్ట్ గార్డ్ స్వాధీనం చేసుకుంది. సుదీర్ఘమైన, నిలకడతో కూడిన కృషి అనంతరం చర్య తీసుకోదగిన నిఘా సమాచారం ఆధారంగా ఈ సోదాలను నిర్వహించారు. తూత్తుకుడికి దక్షిణ ప్రాంతంలో ఈ సోదాలు జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 


కరాచీ నుంచి వచ్చిన పాకిస్థానీ నాటు పడవలోని మాదక ద్రవ్యాలను శ్రీలంక నౌకలోకి ఎక్కించినట్లు అధికారులు గుర్తించారు. ఈ మాదక ద్రవ్యాలు శ్రీలంక నుంచి పాశ్చాత్య దేశాలకు, ఆస్ట్రేలియాకు రవాణా అవుతున్నట్లు గుర్తించారు. పాకిస్థాన్ జీహాద్‌ను మాత్రమే కాకుండా మాదక ద్రవ్యాలను కూడా ఎగుమతి చేస్తోందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఈ నిధులను ఉగ్రవాదానికి ఉపయోగిస్తోందని ఆరోపించారు. 


శ్రీలంక పడవలో 100 కేజీల హెరాయిన్, 20 చిన్న పెట్టెల్లోని సింథటిక్ డ్రగ్స్, 9ఎంఎం పిస్తోళ్లు 5, ఒక తురయ సెట్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇవన్నీ ఓ ఖాళీ ఫ్యూయర్ ట్యాంక్‌లో దొరికినట్లు తెలిపారు. ఈ పడవలోని ఆరుగురు సిబ్బందిని ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. వీరిని ప్రశ్నిస్తుండగా శ్రీలంక నావికా దళం నుంచి కూడా ఓ సందేశం వచ్చినట్లు చెప్పారు. 



 

Updated Date - 2020-11-25T16:21:30+05:30 IST