Tamilnadu అవతరణ వేడుకలు నవంబర్ 1న కాదు...

ABN , First Publish Date - 2021-11-01T20:50:51+05:30 IST

తమిళనాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ 1న జరపాలన్న గత ప్రభుత్వ నిర్ణయంతో డీఎంకే ప్రభుత్వం..

Tamilnadu అవతరణ వేడుకలు నవంబర్ 1న కాదు...

చెన్నై: తమిళనాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ 1న జరపాలన్న గత ప్రభుత్వ నిర్ణయంతో డీఎంకే ప్రభుత్వం విభేదించింది. జూలై 18న రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉంటుందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. సీఎం ప్రకటనను అన్నాడీఎంకే వెంటనే ఖండించింది. రాజకీయ కక్షతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు విమర్శించింది. వివిధ రంగాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పురస్కరించుకుని రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1న జరపాలని నిర్ణయించినట్టు 2019లో అప్పటి ముఖ్యమంత్రి కె.పళనిస్వామి ప్రకటించారు.


కాగా, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారంనాడు మాట్లాడుతూ, దేశంలోని రాష్ట్రాలను 1956 నవంబర్ 1న భాషాప్రతిపదికన గుర్తించారని, దాంతో మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ వెళ్లిపోవడం జరిగిందని చెప్పారు. అయితే, 'బోర్డర్ స్ట్రగుల్'గా‌ మాత్రమే నవంబర్ 1వ తేదీని గుర్తించాలని వివిధ రాజకీయ పార్టీలు, తమిళ మేథావులు, కార్యకర్తలు, అసోసియేషన్లు పట్టుబట్టాయని అన్నారు. అందువల్ల నవంబర్ 1వ తేదీని తమిళనాడు అవతరణ దినోత్సవం జరపడం సరికాదని ఆయన పేర్కొన్నారు. డీఎంకే వెటరన్, దివంగత ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురై నాయకత్వంలో అసెంబ్లీ లెజిస్లేషన్ జరిగి ప్రస్తుతం ఉన్న పేరును ప్రకటించిన చేసిన రోజునే తమిళనాడు అవతరణ దినోత్సవం జరపాలని ఆయా వర్గాలు సూచించాయని చెప్పారు. అందరి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని జూలై 18న రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపాలని నిర్ణయించామని, ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు త్వరలోనే జారీ చేస్తామని చెప్పారు. తమిళనాడు తల్లిగా తమిళనాడును సంబోధించిన రోజే రాష్ట్రావతరణ దినోత్సవమని పేర్కొన్నారు. "బోర్డర్ స్ట్రగుల్''లో పాల్గొన్న వారి గౌరవార్ధం 100 మందికి నవంబర్ 1న రూ.లక్ష చొప్పున అందజేస్తామని చెప్పారు.

Updated Date - 2021-11-01T20:50:51+05:30 IST