తమిళనాడు సీఎం తెలుగువారే!

ABN , First Publish Date - 2021-05-09T09:02:45+05:30 IST

తమిళనాడు ఎన్నికల్లో డీఎంకేని విజయపథంలో నడిపి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఎంకే స్టాలిన్‌ కుటుంబ మూలాలు మన రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలోవే

తమిళనాడు సీఎం తెలుగువారే!

స్టాలిన్‌ పూర్వీకులది ప్రకాశం జిల్లానే

స్వయంగా చెప్పిన దివంగత కరుణానిధి

జీవనోపాధి కోసం తంజావూరుకు వలస

నాటి జ్ఞాపకాలు నెమరువేసుకుంటున్న ప్రకాశం జిల్లా పెళ్లూరు గ్రామస్థులు


ఒంగోలు(కల్చరల్‌), మే 8: తమిళనాడు ఎన్నికల్లో డీఎంకేని విజయపథంలో నడిపి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఎంకే స్టాలిన్‌ కుటుంబ మూలాలు మన రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలోవే. ఆయన తండ్రి కరుణానిధి పూర్వీకులు మంచి సంగీత విద్వాంసులు. వీరిది విజయనగరం జిల్లా అయినప్పటికీ అక్కడి నుంచి జీవనోపాధి కోసం ఒంగోలు ప్రాంతానికి వచ్చారు. పెళ్లూరు సంస్థానాన్ని పాలించిన వెంకటగిరి మహారాజా ఆస్థానంలో వాయిద్య కళాకారులుగా కీర్తిగడించారు. ఒంగోలు శివారు పెళ్లూరు గ్రామంలో ఉన్న శివాలయంలో వీరు స్వామివారి సేవల్లో మంగళవాయిద్యాలను మోగించేవారు. పెళ్లూరు ప్రాంతం మొత్తం వెంకటగిరి రాజాగారి ఏలుబడిలో ఉండటంతో కరుణానిధి పూర్వీకులు నివసించటానికి దగ్గరలోని చెరువుకొమ్ముపాలెం గ్రామంలో వీరికి నివాసస్థలాలు కేటాయించినట్లు చరిత్ర చెబుతోంది. నాయీబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కరుణానిధి పూర్వీకులు మొత్తం ఐదు కుటుంబాల వారు ఈ విధంగా ఈ ప్రాంతానికి వచ్చి, రాజా వారి ఆస్థానంలో పనిచేసేవారు. వీరికి దాదాపు 150 ఎకరాల భూమిని మాన్యంగా కేటాయించినట్లు గ్రామస్థులు తెలిపారు. దీంతో వీరు ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ, దేవస్థానంలో ఆస్థాన విద్వాంసులుగా చాలాకాలం పనిచేశారు. అనంతర కాలంలో ఈ ప్రాంతంలో తీవ్రమైన కరువు కాటకాలు రావటం, పంటలు సరిగా పండకపోవడంతో వారి జీవనం కష్టమైంది. దీంతో కరుణానిధి పూర్వీకులు ఇక్కడి భూములను విక్రయించి, తమిళనాడులోని తంజావూరు ప్రాంతానికి వలస వెళ్లినట్లు గ్రామంలోని వృద్ధులు పేర్కొన్నారు. దాదాపు 300 సంవత్సరాల కిందటి వరకు కూడా వారు ఈ ప్రాంతంలోనే ఉన్నారు. ఇప్పటికీ కరుణానిధి ముత్తాతల బంధువర్గానికి చెందిన వంశీకుల కుటుంబాలు ఇక్కడ నివాసం ఉన్నారు. వారిలో అనేకమంది నాదస్వర విద్వాంసులుగా, డోలు వాయిద్య కళాకారులుగా కొనసాగుతున్నారు.


అభిమానం చూపే కరుణానిధి

కరుణానిధి సైతం తన తాతముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన నాదస్వరం నేర్చుకుని ఎంతో గొప్పగా వాయించేవారు. అంతేకాకుండా ఆయన గొప్ప రచయిత. 1960లో ఏలూరులో జరిగిన తెలుగు డిటెక్టివ్‌ నవలా రచయితల సంఘం సమావేశానికి చెన్నై నుంచి కరుణానిధి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన డిటెక్టివ్‌ నవలా రచయిత జలంధర్‌ బాలకృష్ణ ఆయనను కలిసినప్పుడు, ఆనందంతో తమ ప్రాంతం గురించి అడిగారు. తమ పూర్వీకులది ప్రకాశం జిల్లా చెరువుకొమ్ముపాలెం అని, జీవనోపాధి కోసం తంజావూరు వలస వెళ్లారని ఆయనే స్వయంగా చెప్పినట్టు స్థానికులు తెలిపారు. కరుణానిధి జీవించి ఉన్న సమయంలో పలుసార్లు త్యాగరాజ ఆరాధనోత్సవాల సందర్భంగా ఇక్కడి నాదస్వర కళాకారులు తంజావురుకు వెళ్లినప్పుడు కొంతమంది ఆయనను ప్రత్యేకంగా కలిశారు. అప్పుడు ఆయన ఎంతో ఆప్యాయంగా పలకరించేవారని, ఈ ప్రాంతం గురించి అడిగేవారని, ఆయనకు తెలుగువారంటే ఎంతో ఇష్టమని చెప్పడం విశేషం. ఈ విధంగా కరుణానిధి కుమారుడు, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ప్రకాశం జిల్లాతో అనుబంధం ఉందని ఇక్కడి వారు చెబుతున్నారు. తమిళనాడు సీఎం తమ వాడు కావటం ఎంతో ఆనందంగా ఉందని చెర్వుకొమ్ముపాలెం గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. అదేవిధంగా ఇక్కడి గ్రామస్థులు, ముఖ్యంగా నాయీబ్రాహ్మణ కుటుంబాల వారు ఆయన చిత్రపటానికి పుష్పాభిషేకం చేసి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. 


స్టాలిన్‌ పూర్వీకులది మా ఊరే!

డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం స్టాలిన్‌ పూర్వీకులది మా ఊరే. వారు ఆనాడు వెంకటగిరి రాజా ఇచ్చిన పొలాలు సాగు చేసుకుంటూ, ఆస్థాన విద్వాంసులుగా ఉండేవారని స్వయంగా కరుణానిధి చెప్పటంతో తెలిసింది. మా తాతలు మాత్రం ఊరిలోనే ఉండిపోగా, కరుణానిధి తాతలు తంజావూరు వలసవెళ్లారు. అందరం సంప్రదాయంగా వస్తున్న నాదస్వర కళలో ఉంటూ వ్యవసాయం చేస్తున్నాం. మా గ్రామ మూలాలు కలిగిన స్టాలిన్‌ తమిళనాడు సీఎం కావడం మా అందరికీ ఎంతో సంతోషం. 

-పెళ్లూరి వెంకటేశ్వర్లు, చెర్వుకొమ్ముపాలెం

Updated Date - 2021-05-09T09:02:45+05:30 IST