తన రూపాన్ని ఎగతాళి చేశాడని క్లాస్‌మేట్‌ హత్య

ABN , First Publish Date - 2022-05-18T03:30:04+05:30 IST

కల్లకురిచి : పిల్లల మానసిక ప్రవర్తన పట్ల ఆలోచింపజేస్తున్న ఓ ఘటన కలవరానికి గురిచేస్తోంది. భౌతిక రూపాన్ని ఎగతాళి చేస్తూ ఏడిపిస్తున్నాడని తన క్లాస్‌మేట్‌నే హత్య చేసిన ఘటన తమిళనాడులోని

తన రూపాన్ని ఎగతాళి చేశాడని క్లాస్‌మేట్‌ హత్య

కల్లకురిచి, తమిళనాడు : పిల్లల మానసిక ప్రవర్తన పట్ల ఆలోచింపజేస్తున్న ఓ ఘటన కలవరానికి గురిచేస్తోంది. భౌతిక రూపాన్ని ఎగతాళి చేస్తూ ఏడిపిస్తున్నాడనే కారణంతో ఓ విద్యార్థి తన క్లాస్‌మేట్‌నే హత్య చేశాడు. క్లాస్ 12 చదువుతున్న నిందిత విద్యార్థిని ‘ఆడపిల్ల’ అని బాధిత విద్యార్థి(మృతుడు) పిలిచేవాడు. అలా పిలవొద్దని, దయచేసి ఆపాలని కోరినా వినలేదు. ఆహార్యం, రూపాన్ని అవమానించేలా బాధిత విద్యార్థి మాట్లాడేవాడని తెలిసిందని పోలీసులు వెల్లడించారు. పార్టీ ఇస్తానని ఆహ్వానించి.. ఓ కొడవలి, ఓ కత్తిని ఉపయోగించి హత్య చేశాడని వివరించారు. స్కూల్ ఉన్న ప్రాంతంలో హైవేపై హత్య జరిగిందని చెప్పారు. నిందిత విద్యార్థిపై హత్య కేసు నమోదు చేసి.. మైనర్ కావడంతో అబ్జర్వేషన్ హోంకు పంపించామని చెప్పారు. దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. ఈ ఘటన తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలో శనివారం వెలుగుచూసింది. 


ఈ ఘటనపై తమిళనాడు స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ మెంబర్ డాక్టర్ శరణ్య స్పందించారు. భౌతిక రూపాన్ని ఎగతాళి చేయడంతో విద్యార్థిలో కోపం, ఒత్తిడి పెరిగి ‘డిస్‌మోర్ఫిక్’ అనే మానసిక రుగ్మతకు దారితీసిందని చెప్పారు. పదేపదే తన భౌతిక రూపం గురించి ఆలోచించడం ఈ రుగ్మత లక్షణమన్నారు. క్రమక్రమంగా అది తీవ్ర కోపం లేదా ఒత్తిడిగా మారిపోయాయని వెల్లడించారు. కాగా తమిళనాడులో విద్యార్థుల ప్రవర్తనలో మార్పును తెలియజేస్తున్న పలు ఘటనలు ఇటివల వెలుగుచూస్తున్నాయి. తరగతి గదుల్లో టీచర్లను టార్గెట్ చేయడం, ధూమపానం, మద్యపానానికి సంబంధించిన ఘటనలు బయటపడుతున్నాయి. కరోనా నేపథ్యంలో దాదాపు రెండేళ్లపాటు విద్యార్థులు సామాజిక ప్రవర్తనకు దూరంగా ఉండడం పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని నిపుణులు చెబుతున్నారు.

Updated Date - 2022-05-18T03:30:04+05:30 IST