కోలుకుంటున్న స్టాలిన్‌.. ప్రధాని పరామర్శ

ABN , First Publish Date - 2022-07-16T00:50:06+05:30 IST

కరోనా బారినపడిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కోలుకుంటున్నారని ఆయనకు చికిత్స అందిస్తున్న ప్రైవేటు

కోలుకుంటున్న స్టాలిన్‌.. ప్రధాని పరామర్శ

చెన్నై: కరోనా బారినపడిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కోలుకుంటున్నారని ఆయనకు చికిత్స అందిస్తున్న ప్రైవేటు ఆసుపత్రి తెలిపింది. అయితే, మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నెల 12న స్టాలిన్ కరోనా బారినపడ్డారు. ఇంట్లోనే ఉండి చికిత్స పొందిన ఆయన.. గురువారం తీవ్ర అస్వస్థతకు గురవడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. స్టాలిన్‌తో పాటు ఆయన భార్య దుర్గ కూడా ఆసుపత్రిలోనే ఉన్నారు. స్టాలిన్‌ కుమారుడు ఉదయనిధి, కుమార్తె సెందామరై తరచూ ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటున్నారు. 


 ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం స్టాలిన్‌కు ఫోన్‌ చేసి పరామర్శించారు. ఆయన ఆరోగ్యపరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. స్టాలిన్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. స్టాలిన్‌ ఆయనకు ధన్యవాదాలు చెబుతూ.. కరోనా కారణంగా చెస్‌ ఒలంపియాడ్‌ పోటీలకు ఆహ్వానించేందుకు తాను ఢిల్లీ రాలేకపోతున్నానని, తన తరపున ఎంపీలు కనిమొళి, టీఆర్‌బాలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు వచ్చి ఆహ్వానిస్తారని తెలిపారు. తప్పకుండా ఆ పోటీల ప్రారంభోత్సవానికి రావాలని అభ్యర్థించారు.


ప్రధాని మోదీ బదులిస్తూ ... ప్రస్తుతం ఇతర కార్యక్రమాలను వదిలేసి, ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని స్టాలిన్‌కు సూచించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ కూడా స్టాలిన్‌కు ఫోన్‌ చేసి పరామర్శించినట్లు తెలిసింది. స్టాలిన్‌ త్వరగా కోలుకోవాలంటూ కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఓ సందేశం పంపారు.

Updated Date - 2022-07-16T00:50:06+05:30 IST