తమిళనాడు ఎన్నికలు : పొత్తులపై కాంగ్రెస్ సమావేశం 5న

ABN , First Publish Date - 2021-03-03T22:18:03+05:30 IST

తమిళనాడు శాసన సభ ఎన్నికల్లో పొత్తులపై కాంగ్రెస్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్

తమిళనాడు ఎన్నికలు : పొత్తులపై కాంగ్రెస్ సమావేశం 5న

చెన్నై : తమిళనాడు శాసన సభ ఎన్నికల్లో పొత్తులపై కాంగ్రెస్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం శుక్రవారం జరుగుతుంది. డీఎంకేతో సీట్ల పంపకంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. డీఎంకే ఇప్పటికే ఐయూఎంఎల్‌కు మూడు సీట్లు, ఎంఎంకేకు రెండు స్థానాలు ఇచ్చి, పొత్తు కుదుర్చుకుంది. తమకు న్యాయమైన వాటా దక్కాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. 


ఏఐసీసీ తమిళనాడు ఇన్‌ఛార్జి దినేశ్ గుండూరావు బుధవారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, సీట్ల పంపకంపై గురు, శుక్రవారాల్లో సమావేశాలు జరుగుతాయన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం శుక్రవారం జరుగుతుందని చెప్పారు. శుక్రవారం నాటికి అన్ని విషయాలపై ఓ నిర్ణయం ఖరారయ్యే అవకాశం ఉందన్నారు. 


కాంగ్రెస్ ఎన్ని సీట్లలో పోటీ చేయాలనుకుంటోంది? డీఎంకేను ఎన్ని సీట్లు అడిగింది? అనే ప్రశ్నలకు గుండూరావు సమాధానం చెప్పలేదు. సీట్ల పంపకం న్యాయంగా, పరస్పర గౌరవం ఆధారంగా జరగాలన్నారు. అన్యాయమైన సీట్ల పంపకం కాంగ్రెస్‌కు కానీ, డీఎంకేకు కానీ శ్రేయస్కరం కాదన్నారు. సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నందువల్ల, ఈ విషయంలో ఎటువంటి వ్యాఖ్యలు చేయబోనని తెలిపారు. 


తమిళనాడు శాసన సభలో 234 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 118 మంది సభ్యుల మద్దతు అవసరం. ఏప్రిల్ 6న ఎన్నికలు జరుగుతాయి, ఓట్ల లెక్కింపు మే 2న జరుగుతుంది. 


Updated Date - 2021-03-03T22:18:03+05:30 IST