ఆవపెట్టిన పులిహోర

ABN , First Publish Date - 2022-08-20T05:38:54+05:30 IST

పులిహోర అనగానే అది తమిళుల వంటకం అనీ, పులియోదరై అనే అరవపదమే దీనికి మూలం అనీ తమిళులు ప్రపంచాన్నంతటినీ నమ్మించారు. నలమహారాజు ఏ కాలం నాటివాడో తెలియదు. ఆయన గురించి సంస్కృత భారతంలో

ఆవపెట్టిన పులిహోర

పులిహోర అనగానే అది తమిళుల వంటకం అనీ, పులియోదరై అనే అరవపదమే దీనికి మూలం అనీ తమిళులు ప్రపంచాన్నంతటినీ నమ్మించారు. నలమహారాజు ఏ కాలం నాటివాడో తెలియదు. ఆయన గురించి సంస్కృత భారతంలో కూడా ఉంది కాబట్టి 2000 ఏళ్ల కన్నా పూర్వుడే! నలుడు రాసిన పాకదర్పణం గ్రంథం గురించి చరక సుశ్రుత సంహితలకు 10వ శతాబ్దంనాటి వ్యాఖ్యాతలు ప్రస్తావించటాన్ని బట్టి ఈ రచన వెయ్యేళ్లకన్నా పూర్వమే గ్రంథస్థం అయిందని భావించాలి. ఈ పుస్తకంలో నలుడు వివిధ పులిహోరల తయారీ గురించి చెప్పాడు. ఉత్తరాదివారికి కూడా వెయ్యేళ్ల క్రితమే చింతపండు పులిహోర, నిమ్మరసం పులిహోర, ఆవపెట్టిన పులిహోర తెలుసన్నమాట.


‘చించాఫల రసయుక్త శాల్యన్న పాకం‘ పేరుతో ఈ వంటకాన్ని పిలిచాడు. చింతపండు రసం కలిపిన అన్నం అని దీని భావం. చింతపండు లేదా నిమ్మ, దబ్బ, నారింజ లాంటి పుల్లని రసాలు, వరిబియ్యం దొరికే ప్రదేశాలలో జీవించే వారందరికీ పులిహోర వందల సంవత్సరాలుగా తెలుసు. బహుశా తొలినాటి వంటకాల్లో ఒకటి కావటంవల్లనే దీన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. పండుగ రోజు పులిహోర తప్పకుండా వండుతారు. పులిహోర వండారంటే ఆ ఇంట పండుగే! దసరా, సంక్రాంతి, రోజుల్లోనూ శ్రీరామ నవమి పండుగ రోజుల్లోనూ పులిహోర నైవేద్యం పెట్టి అందరికీ పంచుతారు. పులిహోర అఖిలబారత వంటకం. దాన్ని తమిళుల హక్కుగా మార్చవలసిన అవసరం లేదు. 


తమిళులకూ మనకూ పులిహోర చేసే విధానంలో కొంత తేడా ఉంది. ఉగాది పచ్చడి లాగానే, తెలుగువారు పులిహోరను తీపి, పులుపు, ఉప్పు, కారం వగరూ, చేదూ ఇలా ఆరు రుచుల సమ్మేళనంగా తయారు చేసుకొంటారు. ఇది నలుడు చెప్పిన విధానం ‘సర్షపోద్భవ కల్కేన మిలదన్నం జంబీరామ్లం యధాయోగ్యం నిక్షిప్తే ద్రామఠాదిభిః’ అంటూ నలుడు నిమ్మ రసం లేదా చింతపండు రసంతో కూడిన పులిహోర చేసుకునేటప్పుడు... అన్నంలో మొదటగా ఆవాలను మెత్తగా నూరి పేస్టులా చేసి కలపాలన్నాడు. ఆవ పిండిని పులిహోరలో కలపటం వలన వైద్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. చింతపండు రసానికి బెల్లం, పటికబెల్లం, ఆవపిండి, మెంతిపిండి విరుగుళ్లుగా ఉంటాయి. అంటే, చింతపండు కలిగించే దోషాలను ఇవి నివారిస్తాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. రామఠం అంటే ఇంగువ. పులిహోర తాలింపులో ఇంగువని తప్పని సరిగా చేర్చాలన్నాడు నలుడు. బెల్లం, ఆవపిండి, మెంతిపిండి కొద్దికొద్దిగా చేరిస్తే చాలు, పులిహోరకి ఆరు రుచులూ కలుగుతాయి. ఇది ఆరోగ్యకరమైన వంటకం. 


పులుపు ఎక్కువగా ఉంటే వాత, పిత్త, కఫ దోషాలు మూడింటినీ పెంచుతుంది. చింతపండు రసం పరిమితంగానూ, పసుపు, మిరియాలు, కొత్తిమీర, కరివేప ఆకులూ, ఆవ పిండీ, మెంతి పిండీ, బెల్లం, ఇంగువ... ఇవన్నీ తగు పాళ్లలో ఉంటేనే ఆ పులిహోర దోషాలను కలిగించకుండా ఉంటుంది. ఇది ఆరు రుచుల అద్భుత ఆహార పదార్ధం. పులుపు పరిమితంగా ఉంటే ఉప్పూ కారాలు కూడా పరిమితంగా ఉంటాయి. ఎంత పుల్లగా ఉంటే అంత ఘనమైన పులిహోర అనే అభిప్రాయంలోంచి బయటకు వచ్చి, ఆరు రుచులనూ తగుపాళ్ళలో మేళవించే వంటకంగా దీన్ని ఆరోగ్యం కోసం ఉపయోగించుకోవాలి.


నలుడు ఇందులో కొద్దిగా అల్లం, వెల్లుల్లి కూడా కలుపుకోవచ్చన్నాడు. దీన్ని ఉపాహారంగా కాకుండా భోజనంతో పాటుగా వడ్డించాల్సిన వంటకంగా పేర్కొన్నాడు. దీనిలో కలిపే జీలకర్ర, మిరియాలు, అల్లం, వెల్లుల్లి, సుగంధ ద్రవ్యాలన్నీ జీర్ణశక్తిని పెంచేవిగా ఉంటాయి. చింతపండు రసం ఎసిడిటీని పెంచి వేడి చేసేదిగా ఉంటుంది. అందుకని అది తేలికగా అరిగేందుకు ఈ సుగంధ ద్రవ్యాలు తోడ్పడతాయి ఆయా ద్రవ్యాల పాళ్లు జాగ్రత్తగా చూసుకుని కలుపుకోవాలి. 


శరీరానికి బాగా వ్యాయామం ఉన్న మునుపటి తరంవారికి జీర్ణశక్తి మనకన్నా ఎక్కువగా ఉండేది. ఆ రోజుల్లో ప్రతి వంటకంలోనూ పులుపును కలిపేవారు కాదు. అందువల్ల వాళ్ల జీర్ణశక్తి పదిలంగా ఉండేది. ఉదయం పూట పెరుగన్నం అంబలి, గంజితో కడుపు నింపుకునేవాళ్లు. ఇడ్లీ అట్టు, బొంబాయిరవ్వ ఉప్మా, పూరీ, మైసూరుబజ్జీ ఇలాంటివి రోజూ తప్పనిసరిగా పొద్దున్నే తినితీరాలనే నియమం వాళ్లకుండేది కాదు. కాబట్టి పులిహోరని వాళ్లు ఇష్టంగా తినగలిగారు. అది తిన్నా అంతగా ఇబ్బంది పెట్టేది కాదు, ఇబ్బంది కలగకుండా ఉండటానికే ఆవపెట్టిన పులిహోర చేసుకునేవాళ్లు. ఇప్పటి తరానికి ఆవ పెట్టటం తెలియదు. నలుగురుకి సరిపడిన పులిహోరలో, దాని వేడి తగ్గాక, పావు చెంచా ఆవ పిండి, పావు చెంచా మెంతి పిండి కలిపితే సరిపోతుంది. ఊరిన కొద్దీ అది రుచికరంగా ఉంటుంది. తేలికగా జీర్ణం అవుతుంది. పొట్టలో విషదోషాలు పోయి, జీర్ణశక్తి బలంగా ఉండేలా తోడ్పడుతుంది.


ఆవపెట్టిన పులిహోరని పెరుగుతో కానీ... ఉల్లిముక్కలు కలిపిన రైతాతో గానీ తింటే చాలా కమ్మగా ఉంటుంది. వేడి చెయ్యకుండా కాపాడుతుంది.


గంగరాజు అరుణాదేవి

Updated Date - 2022-08-20T05:38:54+05:30 IST