పలుకు పదిలం!

ABN , First Publish Date - 2020-12-26T07:07:36+05:30 IST

గెలిచినా, ఓడినా ఒకే రకంగా ఉండాలంటారు, అది ఒక ఆదర్శం. సామాన్యులకు దాన్ని పాటించడం కష్టం. విజయం ఉత్సాహాన్ని ఇస్తుంది, అది సహజం...

పలుకు పదిలం!

గెలిచినా, ఓడినా ఒకే రకంగా ఉండాలంటారు, అది ఒక ఆదర్శం. సామాన్యులకు దాన్ని పాటించడం కష్టం. విజయం ఉత్సాహాన్ని ఇస్తుంది, అది సహజం. కావలసినంత ప్రేరణను తీసుకుని, దాని సాయంతో ముందుకు వెళ్లడం వివేకవంతుల లక్షణం. తమ విజయం కానీ, తమ వారి విజయం కానీ, మనసును అదుపు తప్పనివ్వకూడదు, నోరు జారనివ్వకూడదు. ముఖ్యంగా రాజకీయాలలో ఉన్నవారికి నోరు మంచిదయితే, ఊరు మంచిదవుతుంది. నాయకులు, పార్టీలు పరస్పరం నిందించుకుంటుంటే ప్రజలు వినోదిస్తున్నట్టు కనిపిస్తుంది కానీ, వారు మౌనంగా అంచనా వేస్తుంటారు. సంస్కారాలు ఎక్కడ అదుపు తప్పుతున్నాయో, ఎవరి మాటల్లో ఏ భావాలు తొణికిసలాడుతున్నాయో గమనించి, సమయం వచ్చినప్పుడు తమ తీర్పులు చెబుతుంటారు. 


కరీంనగర్ ఎన్నికల ప్రచార సభలో కెసిఆర్ మాట తూలడం వల్ల, అక్కడ ఆయన పార్టీకి ప్రతికూల ఫలితం వచ్చిందంటారు. ఆయనది చమత్కార శైలి. తన గురించిన ఆభిజాత్యం, తన జనాదరణ గురించిన గర్వం కూడా ఆయన మాటల్లో పలుకుతాయి కానీ, మొత్తం మీద చతురతను కూడా ఆచితూచి ప్రయోగించే వ్యక్తే. కఠినంగానో, కటువుగానో, మొరటుగానో మాట్లాడిన సందర్భాలు కూడా, ఉద్దేశ్యపూర్వకంగా అట్లా మాట్లాడాలనుకుని మాట్లాడినవే తప్ప ప్రమాదవశాత్తూ తూలినవి కాదు. కానీ, కరీంనగర్‌లో మాత్రం ఆ లెక్క తప్పింది, హిందూగాళ్లు, బొందూగాళ్లు- అని అనేశారు. ప్రత్యర్థి పార్టీని అంటున్నానని తాను అనుకున్నారు కానీ, ప్రజలు మాత్రం తమనే అంటున్నారని భావించారు. కలిగిన నష్టం స్థానికమయినదే కావచ్చును కానీ, అదొక పరంపరకు దారితీసింది.


అధికారం అహంకారాన్ని తెచ్చినప్పుడు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారని ఉత్తరాది మంత్రులు, నాయకులు చేసే వ్యాఖ్యలను చూస్తే అర్థమవుతుంది. కొన్ని రకాల వ్యాఖ్యలు సంస్కారం, ఔచిత్యం వంటి ప్రమాణాలకు అనుగుణంగా లేవని తెలిసినప్పటికీ, మరేదో ప్రయోజనం ఉంటుందన్న ఉద్దేశ్యంతోనే ఆ వ్యాఖ్యాతలు అట్లా మాట్టాడతారు. ఒక మాట, సంచలనానికి, కలవరానికి, దాని శ్రోతలలో లేదా ప్రేక్షకులలో విభజనకు కారణమవుతుంది. చర్చ చిలికి చిలికి గాలివాన అయి, ఉద్రిక్తతకు దారితీస్తుంది. నిరంతర ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉండడంలో ప్రయోజనాలున్నవారు ఉంటారు. తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం వచ్చిన వెంటనే అక్కడ గెలిచిన పార్టీకి చెందిన రాష్ట్ర నేతలు- సహజంగానే తమ తరువాతి గురి అయిన గ్రేటర్ హైదరాబాద్ పురపాలక సంస్థ ఎన్నికల గురించి మాట్లాడారు. హైదరాబాద్‌లో పౌరసమస్యలు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వం మీద అసంతృప్తీ ఉన్నది. అంతవరకే తమ వాగ్భూషణాలను బిజెపి నేతలు పరిమితం చేసుకుని ఉంటే, ఆరోగ్యకరంగా ఉండేది. కానీ, పాతబస్తీ, కొత్త బస్తీ విభజన, సర్జికల్ స్ట్రయిక్ ప్రస్తావన వంటివన్నీ రంగం మీదకు వచ్చాయి. ఆ అంశాలు తెచ్చినందువల్లనే ఇప్పుడు వచ్చినన్ని స్థానాలు లభించాయో, లేక మేయర్ పీఠం అందనంత దూరంలోనే విజయం ఆగిపోయిందో కచ్చితంగా చెప్పలేము. కానీ, రాష్ట్రంలో అధికారానికి రావాలనుకుంటున్న పార్టీ, కాస్త గంభీరంగా, సాత్వికంగా ఉంటే బాగుండును అన్న ఆకాంక్ష, కొద్దిమందిలో అయినా ఉన్నది. 


ఇప్పుడు తాజాగా, బిజెపి తెలంగాణ అధ్యక్షులు, పాతబస్తీని పదిహేను నిముషాల్లో ప్రక్షాళన చేయడం గురించి మాట్లాడారు. నిజాయితీ కలిగిన పోలీసు అధికారులకు స్వేచ్ఛ ఇచ్చి, పాతబస్తీలో వదిలిపెట్టడం, వారు అసాంఘిక శక్తులను మాత్రమే వేటాడి పట్టుకోవడం- వంటి జాగ్రత్తలన్నీ ఆ వ్యాఖ్యలో ఉన్నాయి కానీ, హైదరాబాద్‌లో పాతబస్తీని ఒక ప్రతికూల చిహ్నంగా స్థిరపరిచే ప్రయత్నం కూడా ధ్వనిస్తుంది. అశాంతి, అసాంఘికత, అరాచకం ఎక్కడ ఉన్నా, దాన్ని ప్రక్షాళన చేయవలసిందే, ఒక్క పాతబస్తీ మాత్రమే ఎందుకు? పరిశుద్ధమైన పరిసరాలు, ప్రశాంత వాతావరణం ఒక్క పాతబస్తీకి మాత్రమే ఎందుకు? ఎందుకు అంత బుజ్జగింపు? హైదరాబాద్‌లో కానీ, దేశంలో మరెక్కడైనా కానీ, విదేశీయులు అక్రమంగా నివసిస్తుంటే, శరణార్థులు పౌరులుగా ప్రతిపత్తి పొందుతుంటే, చర్య తీసుకోవలసిన బాధ్యత, అధికారం కేంద్రానిది. ఒక నగరపాలక సంస్థ ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన, సర్జికల్ స్ట్రయిక్స్ చేయలేరు, రాష్ట్రప్రభుత్వం సాధించినా చేయలేరు. కేంద్రం మాత్రమే చేయగలదు. కాబట్టి, ప్రజల మనసుల్లో భయాందోళనలను, విభజన భావాలను ప్రవేశపెట్టే నాయకులు, హైదరాబాద్‌పై కానీ, విదేశీయుల ప్రభావం ఉందనుకునే మరే ప్రాంతంలో కానీ తగిన సైనికచర్య జరపమని కేంద్రప్రభుత్వాన్ని కోరవచ్చును కదా? ఎందుకు ఆ పనిచేయరు? 


పదిహేను నిముషాల ప్రక్షాళనకు ఒక సందర్భం ఉన్నది. గతంలో మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ నాయకుడు అక్బరుద్దీన్ ఇటువంటిదే ఒక మూర్ఖపు వ్యాఖ్య చేశారు. ఒక్క పావుగంట సేపు పోలీసులను తప్పించి చూడండి, మా తడాఖా చూపిస్తామని ఆయన హెచ్చరించారు. ఆ మాటలన్నందుకు అక్బరుద్దీన్‌ను దూషించనివారు లేరు. ప్రస్తుత వ్యాఖ్యకు అదే ప్రేరణ, అదే నమూనా కూడా. ఆశ్చర్యం ఏమిటంటే, భారతీయ జనతాపార్టీ, మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్- ఈ రెండూ కలిసి ఒక అవిభాజ్య ద్వంద్వం. తాను ఎంత ఎదిగినా బిజెపి, తన ప్రత్యర్థిగా మజ్లిస్‌నే భావిస్తుంది. హిందువును బూచిగా చూపించగలిగితేనే మజ్లిస్‌కు మనుగడ. ముస్లిముల ప్రమాదాన్ని చూపిస్తేనే బిజెపికి ఆకర్షణ. అంతేనా? దేశాన్నే ఏలుతున్న పార్టీ, ఒక స్థానికమయిన పార్టీని దృష్టిలో పెట్టుకుని రాజకీయ యుద్ధం చేస్తుందా? ఆశ్చర్యమే!


ఇటీవలి విజయాలతో, తన మాటల వేడిని మరింత పెంచిన ఒక లోక్‌సభ సభ్యుడు, ఒక మహిళా నేతను ఆమె వస్త్రధారణ తీరు ఆధారంగా విమర్శించారు. ఆవేశంలో ఉన్నప్పుడే కాదు, ఉత్సాహంగా ఉన్నప్పుడు కూడా నిగ్రహంగా ఉండాలని తెలుసుకుని వ్యవహరించకపోతే, దీర్ఘకాలిక రాజకీయ జీవితం ఉన్నవారు నష్టపోతారు. మంచీ మర్యాదా ఎప్పుడు నేర్చుకుంటారు వీళ్లంతా?   

Updated Date - 2020-12-26T07:07:36+05:30 IST