తాలిబన్లకు చైనా నుంచి తొలివిడత సాయం

ABN , First Publish Date - 2021-10-01T00:02:34+05:30 IST

తాలిబన్ల నేతృత్వంలోని ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వానికి చైనా మానవతావాద

తాలిబన్లకు చైనా నుంచి తొలివిడత సాయం

కాబూల్ : తాలిబన్ల నేతృత్వంలోని ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వానికి చైనా మానవతావాద సాయం అందజేసింది. దుప్పట్లు, జాకెట్లు వంటి అత్యవసర సరఫరాలు బుధవారం రాత్రి కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి. మొత్తం 31 మిలియన్ డాలర్ల విలువైన సాయంలో ఇది తొలి విడత సాయం. వీటిని ఆఫ్ఘన్ మంత్రి హక్కానీకి ఆఫ్ఘన్‌కు చైనా రాయబారి వాంగ్ అందజేశారు. చైనా మీడియా గురువారం ఈ వివరాలను తెలిపింది. 


వాంగ్ మాట్లాడుతూ, అనేక ఇబ్బందుల నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్‌కు తక్కువ కాలంలోనే అత్యవసర మానవతావాద సాయాన్ని అందజేయగలిగామని చెప్పారు. ఆఫ్ఘన్ ప్రజలకు చలి కాలంలో అత్యవసరంగా అవసరమయ్యే దుప్పట్లు, డౌన్ జాకెట్లు వంటివాటిని అందజేశామని తెలిపారు. ఆహారం తదితర మెటీరియల్స్‌ను కూడా అందజేస్తామని చెప్పారు. 


ఆఫ్ఘనిస్థాన్ శరణార్థుల వ్యవహారాల మంత్రి ఖలీల్ ఉర్ రెహమాన్ హక్కానీ మాట్లాడుతూ, మానవతావాద సాయం అందజేసిన చైనాకు ధన్యవాదాలు తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్‌కు చైనా మంచి పొరుగు దేశమని, మిత్ర దేశమని చెప్పారు. భవిష్యత్తులో కూడా తమకు చైనా సాయపడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని, జీవనోపాధి కోసం ప్రజలు చాలా కష్టాలు అనుభవిస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ సమాజం వివిధ రంగాల్లో తమకు అత్యవసరంగా సాయపడాలన్నారు. 


Updated Date - 2021-10-01T00:02:34+05:30 IST