కాబూల్‌లో హిందూ, సిక్కులను అడ్డుకున్న తాలిబన్లు

ABN , First Publish Date - 2021-08-26T23:16:24+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్ నుంచి తరలిపోవడానికి ప్రయత్నించిన సుమారు

కాబూల్‌లో హిందూ, సిక్కులను అడ్డుకున్న తాలిబన్లు

న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్థాన్ నుంచి తరలిపోవడానికి ప్రయత్నించిన సుమారు 140 మంది ఆఫ్ఘన్ హిందువులు, సిక్కులు, ఇతరులను తాలిబన్లు అడ్డుకున్నారు. కాబూల్ విమానాశ్రయానికి వెళ్ళకుండా వీరిని నిరోధించారు. ఇండియన్ వరల్డ్ ఫోరం ప్రెసిడెంట్ పునీత్ సింగ్ ఈ వివరాలను గురువారం మీడియాకు తెలిపారు. 


ఆఫ్ఘనిస్థాన్ నుంచి ప్రజలను తరలించే ప్రక్రియను పునీత్ సింగ్ సమన్వయపరుస్తున్నారు. భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత వాయు సేనతో కలిసి ఈ కార్యక్రమం సజావుగా జరగడానికి కృషి చేస్తున్నారు. 


ఆఫ్ఘన్‌లోని భారతీయులను తీసుకొచ్చేందుకు కాబూల్ విమానాశ్రయంలో బుధవారం నుంచి భారత వాయు సేన విమానం వేచి ఉంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే గురువారం ఉదయానికి హిందోన్ ఎయిర్‌బేస్‌కు ఈ విమానం వచ్చి ఉండేది. సుమారు 140 మంది హిందువులు, సిక్కులు, ఇతరులు కాబూల్ విమానాశ్రయానికి వెళ్ళేందుకు ప్రయత్నించగా, వారిని తాలిబన్లు బుధవారం రాత్రి తిప్పి పంపించేశారని పునీత్ చెప్పారు. 


ఇదిలావుండగా, ఆఫ్ఘన్ జాతీయులు దేశం విడిచి వెళ్ళవద్దని తాలిబన్లు కోరుతున్నారు. రాబోయే రోజుల్లో ఇస్లామిక్ ఎమిరేట్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. తమతో కలిసి పని చేయాలని కోరుతున్నారు. 


సాయుధ ఉగ్రవాదుల పహారా, వివిధ దేశాల విమానాలకు అనుమతులు లభించడంలో ఆలస్యం, ల్యాండింగ్ పర్మిషన్ల జాప్యం, విమానాశ్రయం సమీపంలో కాల్పులు వంటివి కాబూల్ విమానాశ్రయం నుంచి ప్రజలను తరలించేందుకు అడ్డంకులుగా మారాయని తెలుస్తోంది.


Updated Date - 2021-08-26T23:16:24+05:30 IST