మహిళల ప్రయాణాలపై తాలిబన్ల ఆంక్షలు

ABN , First Publish Date - 2021-12-27T01:34:45+05:30 IST

సన్నిహిత పురుష బంధువు తోడుగా ఉంటేనే మహిళలు రోడ్డు

మహిళల ప్రయాణాలపై తాలిబన్ల ఆంక్షలు

కాబూల్ : సన్నిహిత పురుష బంధువు తోడుగా ఉంటేనే మహిళలు రోడ్డు మార్గంలో సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసేందుకు అనుమతిస్తామని ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ అధికారులు ప్రకటించారు. సదాచారాన్ని ప్రోత్సహించడం, అనాచారాలను నిరోధించడం కోసం ఏర్పాటైన మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన చేసింది. అయితే ఈ ఆంక్షలను హక్కుల కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. 


తాలిబన్లు ఆగస్టు 15న ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే మహిళల్లో చాలా మందికి తిరిగి ఉద్యోగాలు ఇవ్వలేదు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివే చాలా మంది బాలికలను చదువుకు దూరం చేశారు. మరోవైపు తాలిబన్లు తాము మితవాద ప్రభుత్వాన్ని నడుపుతున్నామని అంతర్జాతీయంగా గుర్తింపు పొందడానికి ప్రయత్నిస్తున్నారు. 


సదాచారాన్ని ప్రోత్సహించడం, అనాచారాలను నిరోధించడం కోసం ఏర్పాటైన మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సడెక్ అకిఫ్ ముహజిర్ ఆదివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, సన్నిహిత కుటుంబ సభ్యుడు తోడుగా లేనట్లయితే, మహిళలను రోడ్డు మార్గంలో 45 మైళ్ళు (72 కిలోమీటర్లు) కన్నా ఎక్కువ దూరం ప్రయాణించడానికి అనుమతించరాదని ట్రావెల్ ఏజెన్సీలకు చెప్పారు. వాహనాలలో సంగీతాన్ని వినిపించరాదని కూడా చెప్పారు. 


ఇటీవల ఈ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాల్లో, మహిళలు నటించే నాటకాలు, సోప్ ఒపేరాలను ప్రసారం చేయరాదని టెలివిజన్ చానళ్ళను ఆదేశించారు. టీవీ జర్నలిస్టులు ప్రజెంటేషన్ ఇచ్చేటపుడు హెడ్‌స్కార్ఫ్ ధరించాలని ఆదేశించారు.


Updated Date - 2021-12-27T01:34:45+05:30 IST