ఇండియన్ కాన్సులేట్లలో తాలిబన్ల తనిఖీలు!

ABN , First Publish Date - 2021-08-20T20:27:56+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌లోని కాందహార్, హెరాత్‌లలో ఉన్న ఇండియన్ కాన్సులేట్లలో తాలిబన్లు

ఇండియన్ కాన్సులేట్లలో తాలిబన్ల తనిఖీలు!

కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్‌లోని కాందహార్, హెరాత్‌లలో ఉన్న ఇండియన్ కాన్సులేట్లలో తాలిబన్లు తనిఖీలు చేసి, కొన్ని పత్రాలను పట్టుకెళ్ళారు. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తాలిబన్లు పత్రాలతోపాటు వాహనాలను కూడా తీసుకెళ్ళిపోయినట్లు తెలిపాయి. 


తాలిబన్లు కాందహార్, హెరాత్‌లలోని ఇండియన్ కాన్సులేట్లలోకి దౌర్జన్యంగా ప్రవేశించినట్లు ఆ కార్యాలయాల వద్ద ఉన్న భద్రతాధికారులు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కొన్ని పత్రాలను, వాహనాలను తాలిబన్లు పట్టుకెళ్ళిపోయినట్లు తెలిపాయి. 


ఆఫ్ఘనిస్థాన్‌‌లో కాందహార్, హెరాత్, మజారే షరీఫ్, జలాలాబాద్‌లలో ఇండియన్ కాన్సులేట్ కార్యాలయాలు ఉన్నాయి. రాజధాని నగరం కాబూల్‌ను తాలిబన్లు ఆగస్టు 15న స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ దేశంలోని కాన్సులేట్ కార్యాలయాలను భారత ప్రభుత్వం మూసేసింది. ఈ కార్యాలయాల్లో పని చేస్తున్న దౌత్యవేత్తలు, సిబ్బందిని భారత ప్రభుత్వం స్వదేశానికి రప్పిస్తోంది. భారత వాయు సేన విమానం సీ-17లో 120 మంది మంగళవారం తిరిగి వచ్చారు. మిగిలినవారిని కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. 


Updated Date - 2021-08-20T20:27:56+05:30 IST