కశ్మీరుపై మాట మార్చిన తాలిబన్లు... ముస్లింల కోసం మాట్లాడే హక్కు ఉందంటున్న అగ్ర నేత...

ABN , First Publish Date - 2021-09-03T19:14:31+05:30 IST

తాలిబన్ల అసలు రూపం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ప్రపంచంలోని

కశ్మీరుపై మాట మార్చిన తాలిబన్లు... ముస్లింల కోసం మాట్లాడే హక్కు ఉందంటున్న అగ్ర నేత...

కాబూల్ : తాలిబన్ల అసలు రూపం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ప్రపంచంలోని ముస్లింలందరి కోసం మాట్లాడే హక్కు తమకు ఉందని చెబుతోంది. కశ్మీరు ద్వైపాక్షిక అంశమని చెప్పిన కొద్ది రోజుల్లోనే మాట మార్చి, తాము ముస్లింలమని, భారత దేశంలోని కశ్మీరు సహా ఇతర దేశాల్లోని ముస్లింల కోసం గళాన్ని వినిపించే హక్కు తమకు ఉందని చెప్పింది. 


ఆఫ్ఘనిస్థాన్ ఆగస్టు 15న తాలిబన్ల వశమైనప్పటి నుంచి ఆ గడ్డను భారత దేశంపై ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు వాడుకుంటారన్న ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. కాబూల్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత తాలిబన్లు మాట్లాడుతూ కశ్మీరు ద్వైపాక్షిక, అంతర్గత అంశమని చెప్పారు. తాజాగా ఓ ఉర్దూ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాలిబన్ అధికార ప్రతినిధి సుహెయిల్ షహీన్ మాట్లాడుతూ, భారత దేశంలోని కశ్మీరు సహా ఇతర దేశాల్లోని ముస్లింల కోసం గళమెత్తే హక్కు ముస్లింలుగా తమకు ఉందన్నారు. ‘‘ముస్లింలు మీ సొంత ప్రజలు, మీ సొంత పౌరులు. మీ చట్టాల ప్రకారం సమాన హక్కులు పొందేందుకు వారు అర్హులు’’ అని చెబుతామన్నారు. అయితే ఇతర దేశాలపై ఆయుధాలను ప్రయోగించే విధానం తమకు లేదన్నారు. 


ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడబోతుండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గురువారం మీడియాతో మాట్లాడుతూ, మన దేశంపై ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు ఆఫ్ఘన్ గడ్డను ఉపయోగించుకోకుండా చూడటంపైనే దృష్టి సారించినట్లు తెలిపారు. తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించడం గురించి ఇప్పుడే మాట్లాడటం త్వరపడటం అవుతుందన్నారు. 


Updated Date - 2021-09-03T19:14:31+05:30 IST