తాలిబన్లు ఇళ్ల నుంచి మహిళలను ఎత్తుకెళ్తున్నారు.. ఆఫ్ఘాన్ విద్యార్థుల ఆందోళన

ABN , First Publish Date - 2021-08-17T14:42:17+05:30 IST

20 ఏళ్లుగా జరుగుతున్న ఆఫ్ఘాన్ అంతర్యుద్ధానికి తాలిబన్లు తమ విజయంతో తెరదించారు. ఆ దేశ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ.. నాలుగు కార్లు, ఒక హెలికాప్టర్లో డబ్బులు కుక్కుకొని పరారైనట్లు వార్తలు వస్తున్న తరుణంలో కుటుంబాలకు దూరంగా ఉంటున్న ఆఫ్ఘాన్ పౌరులు ఆందోళన చెందుతున్నారు.

తాలిబన్లు ఇళ్ల నుంచి మహిళలను ఎత్తుకెళ్తున్నారు.. ఆఫ్ఘాన్ విద్యార్థుల ఆందోళన

న్యూఢిల్లీ: 20 ఏళ్లుగా జరుగుతున్న ఆఫ్ఘాన్ అంతర్యుద్ధానికి తాలిబన్లు తమ విజయంతో తెరదించారు. ఆ దేశ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ.. నాలుగు కార్లు, ఒక హెలికాప్టర్లో డబ్బులు కుక్కుకొని పరారైనట్లు వార్తలు వస్తున్న తరుణంలో కుటుంబాలకు దూరంగా ఉంటున్న ఆఫ్ఘాన్ పౌరులు ఆందోళన చెందుతున్నారు. తమ కుటుంబాలకు ఏమవుతుందో? మళ్లీ అసలు వాళ్లను చూస్తామా? అని భయపడుతున్నారు. ఆఫ్ఘాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. కాబూల్ నుంచి తన కుటుంబాన్ని బయటకు తీసుకురాలేక అతను చాలా టెన్షన్ పడుతున్నట్లు మాజీ క్రికెటర్, సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ చెప్పిన సంగతి తెలిసిందే.


ఇలా ఆఫ్ఘానిస్తాన్‌ దేశం మొత్తం తాలిబన్ వశమైన సమయంలో.. భారత్‌లో ఉన్న కొందరు ఆఫ్ఘాన్ యువత ఆందోళన చెందుతున్నారు. గత నాలుగేళ్లుగా చండీగఢ్‌లో ఉంటున్న పర్వానా హుస్సేని (24) అనే యువతి.. తన కుటుంబం గురించి ఆందోళన వ్యక్తం చేసింది. ఆఫ్ఘానిస్తాన్‌లోని బామ్యాన్ పట్టణంలో ఆమె కుటుంబం ఉందట. మూడు రోజుల క్రితం ఈ పట్టణం తాలిబన్లు స్వాధీనంలోకి వెళ్లింది. అప్పటి నుంచి ఇంటికి కనీసం ఫోన్లు కూడా కలవడం లేదని హుస్సేని అంటోంది. తాలిబన్లు ఇళ్లలో దూరి మహిళలను ఎత్తుకెళ్తున్నారని ఆమె ఆరోపించారు. ‘‘నెక్స్ట్ ఏం చేస్తారో తెలియడం లేదు. ఇకపై నాలాంటి అమ్మాయిలు ఇళ్ల నుంచి బయటకు రాలేదు. తాలిబన్లు షరియా చట్టాలు అమలు చేయాలని చాలా పట్టుదలగా ఉన్నారు. అమెరికా, ఐక్యరాజ్యసమితి, భారత్ ఈ విషయం కలుగజేసుకొని మా దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నా’’ అని ఆమె చెప్పారు. ఇలా ఒక్క హుస్సేనీనే కాదు. ఆఫ్ఘానిస్తాన్‌ నుంచి వచ్చి భారత్‌లో ఉంటున్న పలువురు విద్యార్థులు తమ ఇంటి వద్ద పరిస్థితులపై ఆందోళన కనబరుస్తున్నారు.

Updated Date - 2021-08-17T14:42:17+05:30 IST