Abn logo
Sep 7 2021 @ 00:25AM

కశ్మీర్‌కు తాలిబన్ల ముప్పు

ఫ్ఘానిస్తాన్ ఆర్థిక వ్యవస్థ గత ఇరవై సంవత్సరాలుగా అమెరికా డాలర్ నిధులపైనే పూర్తిగా ఆధారపడింది. అఫ్ఘాన్ ప్రభుత్వం ఖర్చు చేసిన ధనంలో 75 శాతం విదేశీ ప్రభుత్వాలు, సంస్థల నుంచి సమకూరిందే. ఇప్పుడు కాబూల్‌లో తాలిబన్లు అధికారాన్ని కైవసం చేసుకోవడంతో విదేశీ ఆర్థిక సహాయం నిలిచిపోయింది. ఈ పరిస్థితుల్లో అఫ్ఘాన్ ప్రభుత్వం దివాలా తీయడం ఖాయం. అంతేకాదు, ఆర్థిక సంక్షోభంలోకి అఫ్ఘాన్ జారిపోనున్నదని నిశ్చితంగా చెప్పవచ్చు. 


అఫ్ఘానిస్తాన్‌కు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు లేవు. ఒక సంభావ్య వనరు నల్ల మందు. ప్రపంచవ్యాప్తంగా విక్రయమవుతున్న నల్ల మందులో 80 శాతం అఫ్ఘాన్ నుంచి సరఫరా అవుతున్నది. నల్లమందు వ్యాపారం నుంచి అఫ్ఘాన్ ఏటా 30 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్టు ఒక అంచనా. రెండో సంభావ్య ఆదాయ వనరు విదేశీ వాణిజ్యం. అఫ్ఘాన్ ఎగుమతులు, దిగుమతులలో అగ్రగాములుగా ఉన్న నాలుగు దేశాలలో భారత్ ఒకటి. ఈ ఎగుమతులను నిలిపివేస్తే ఆ దేశానికి చెందిన పండ్ల, సుగంధ ద్రవ్యాల ఎగుమతిదారులకు తీవ్ర సమస్యలు ఏర్పడతాయి. మూడో సంభావ్య ఆదాయ వనరు ఖనిజ సంపద. అయితే ఇది ఆర్థికంగా ఆచరణాత్మకమైనది కాదు. ఇప్పుడు అఫ్ఘాన్ అన్ని వైపుల నుంచి ముట్టడిలో ఉంది. విదేశీ సహాయం నిలిచిపోయింది. నల్లమందు వ్యాపారం తగ్గిపోయింది. భారత్‌తో వాణిజ్యాన్ని నిలిపివేశారు. ఖనిజ సంపదను వినియోగించుకోవడంపై అనిశ్చితి తొలగిపోలేదు. ఈ పరిస్థితుల్లో ద్రవ్యోల్బణం పెరిగిపోయే అవకాశముంది. పెట్టుబడులు నిష్క్రమించడం కూడా ఖాయం. రానున్న నెలల్లో అఫ్ఘాన్ ప్రజల ఆర్థిక దురవస్థలు మరింత తీవ్రమవనున్నాయి. 


ఆర్థిక పరిస్థితులు ఎంతగా విషమించినా తాలిబన్లు తమ విధానాల నుంచి తగ్గే ప్రసక్తి గానీ, అఫ్ఘాన్ ప్రజలు కృంగిపోయ్యే అవకాశంగానీ ఎంత మాత్రం లేవు. ఎటువంటి ఇక్కట్లనైనా మొండిగా ఎదుర్కోవడమే వారికి తెలుసు. సిరియా, ఉత్తర కొరియా, ఇరాన్, వెనిజులాలను చూడండి. ఆకలి మంటలు చెలరేగుతున్నా ఆ దేశాల ప్రజలు తమ ప్రభుత్వాలు అనుసరిస్తోన్న అమెరికా వ్యతిరేక విధానాలకు సంపూర్ణ మద్దతునిస్తున్నారు. తాలిబన్లు ప్రగాఢ మతాభినివేశపరులు. అమెరికా ప్రభుత్వ విదేశాంగ విధాన పరిశోధనా సంస్థ రూపొందించిన ‘అఫ్ఘాన్ తిరుగుబాటుదారులు: ప్రేరణలు, లక్ష్యాలు, సమన్వయం, పునరేకీకరణ ప్రక్రియ’ అనే అధ్యయన పత్రం ఇలా పేర్కొంది: ‘తాలిబన్లు ఏ విధంగాను అసాధారణ వ్యక్తులు కారు. అయితే ఒక లక్ష్య ప్రేరేపితులు. ఆ లక్ష్యానికి వారు నిబద్ధులు. ఆ లక్ష్య సాధనకు వారు ఎన్ని సంవత్సరాలు అయినా, చివరకు దశాబ్దాలు సైతం అకుంఠిత దీక్షతో పోరాడతారు. సైద్ధాంతిక మూఢ విశ్వాసులు కారు. కొంతమంది కార్యకర్తలు, నాయకులను హతమార్చినంత మాత్రాన తాలిబన్ బలహీనపడదు. తమ జీవన శైలిని ధ్వంసం చేస్తున్న, తమ విలువలు, విశ్వాసాలపై దాడిచేస్తున్న వారిపై తుదకంటా పోరాడాలనే సంకల్పం తాలిబన్లలో సుదృఢంగా ఉంది’. ఇటువంటి సంకల్పం ఉన్న వారు ఆర్థిక అవస్థలను చాలా ఓర్పుగా ఎదుర్కొంటారు. అఫ్ఘాన్ ప్రజల చరిత్రను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. తాలిబన్ల ఉత్థానం భౌగోళిక రాజకీయాలలో కొత్త పరిణామం. ఈ సందర్భంలో భారత్ వ్యూహం ఎలా ఉండాలన్న విషయమై మన దృష్టిని సారిద్దాం. 


తాలిబన్, పాకిస్థాన్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల గురించి మరి ప్రత్యేకంగా ప్రస్తావించనవసరం లేదు. ఆ ద్వయం విషయంలో మనం ఒక సంయుక్త వ్యూహాన్ని రూపొందించుకోవాలి. తాలిబన్లు సున్నీ ముస్లింలు. అప్ఘాన్ జనాభాలో షియా ముస్లింలు 20 శాతం మేరకు ఉంటారు. అధిక సంఖ్యాకులైన సున్నీల ఆధిపత్యంలో షియాలు నానా అవస్థలు పడుతున్నారు. ఇరాన్ సంపూర్ణంగా షియా ముస్లిం దేశం. షియాలను వేధించే తాలిబన్లతో ఇరాన్ సఖ్యత నెరపడం ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగే పనికాదు. ఇక చైనా విషయానికి వస్తే రెండు పరస్పర విరుద్ధ లక్ష్యాలను ఆ దేశం ఎదుర్కొంటోంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ కింద భారీ రుణాలు సమకూర్చడం ద్వారా అప్ఘాన్‌ను తన అధీన రాజ్యంగా చేసుకోవడం బీజింగ్ లక్ష్యాలలో ఒకటి. తాలిబన్ల సైద్ధాంతిక ప్రభావం జింజియాంగ్ ప్రాంత ప్రజలపై పడకుండా నిరోధించడం మరో లక్ష్యం. ఆ రాష్ట్రంలోని ఇస్లామిక్ మిలిటెంట్లు చాలాకాలంగా బీజింగ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. వారికి తాలిబన్ల మద్దతు లభిస్తే పరిస్థితులు మరింతగా విషమిస్తాయని బీజింగ్ భయపడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో తాలిబన్లతో సన్నిహిత సంబంధాలు నెరపేందుకు చైనా సుముఖంగా ఉండే అవకాశం లేదు. 


మరి భారత్ విషయమేమిటి? కశ్మీర్ వివాదంలో తాలిబన్లు చూపుతున్న శ్రద్ధ భారత్‌కు సమస్యలు సృష్టిస్తోంది. కశ్మీర్‌కు మిలిటెంట్లను పంపుతోన్న పాకిస్థానీ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలతో తాలిబన్లకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. భారత్ నుంచి కశ్మీర్‌ను విముక్తం చేయడం తాలిబన్‌కు ఒక పవిత్ర లక్ష్యం. ఈ దృష్ట్యా తాలిబన్లతో సాధారణ సంబంధాలు నెలకొల్పుకోవడం న్యూఢిల్లీకి అంత తేలిక కాదు తాలిబన్లు అధికారానికి వచ్చీరాగానే భారత్‌తో వాణిజ్యాన్ని నిలిపివేయాలని ఆదేశించడమే ఇందుకు ఒక నిదర్శనం. అమెరికా పట్ల తాలిబన్లకు ఉన్న వ్యతిరేకత భారత్ విషయంలో కూడా తప్పక వ్యక్తమవుతుంది. అఫ్ఘాన్ విషయంలో భారత్ ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి- అమెరికా పక్షాన కొనసాగడం. మనం అమెరికాను అంటి పెట్టుకుని ఉంటే తాలిబన్–పాకిస్థాన్–ఇరాన్–చైనాలు ఒక కూటమిగా ఏర్పడే అవకాశం ఎంతైనా ఉంది. ఇరాన్, చైనా రెండూ అమెరికాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయాన్ని మరి చెప్పనవసరం లేదు. రెండో మార్గం అమెరికాకు దూరమై ఇరాన్, చైనాలతో జట్టుకట్టడం. ఈ రెండు అమెరికా వ్యతిరేక దేశాలతో కలిస్తే అఫ్ఘాన్–పాక్‌లను ఒక చక్రబంధంలో ఇరికించడం సాధ్యమవుతుంది. మరి ఇరాన్, చైనాలు మనతో కలిసివస్తాయా? తోటి షియాలను కాపాడుకునేందుకు ఇరాన్ మన దేశంతో జట్టు కట్టే అవకాశముంది. చైనా విషయానికి వస్తే తాలిబన్ల మత ఛాందసవాదాన్ని ఎదుర్కోవడం ఆ దేశానికి తప్పనిసరి. అంతకంటే ముఖ్యంగా భారత్‌లో చైనాకు విస్తృత వాణిజ్య ప్రయోజనాలు ఉన్నాయి. అఫ్ఘాన్, పాకిస్థాన్‌లలో చైనాకు ఉన్న మొత్తం వాణిజ్య ప్రయోజనాల కంటే మన ఒక్క దేశంలో ఉన్న వాణిజ్య ప్రయోజనాలే చాలా ఎక్కువ. కనుక తన వ్యాపార లబ్ధికి చైనా మనతో చేతులు కలిపే అవకాశం ఎంతైనా ఉంది. అయితే ఇందుకు మనం అమెరికా స్నేహాన్ని విడిచి పెట్టాలి. అమెరికాకు దూరమయినప్పుడు మాత్రమే ఇరాన్, చైనాలకు మనం చేరువ కాగలుగుతాం.

భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేమరిన్ని...