ఇతర దేశాలకు తాలిబన్ల భరోసా

ABN , First Publish Date - 2022-07-07T01:27:37+05:30 IST

ఇతర దేశాలపై దాడి చేయడానికి తమ భూభాగాన్ని ఉపయోగించుకునే

ఇతర దేశాలకు తాలిబన్ల భరోసా

కాబూల్ : ఇతర దేశాలపై దాడి చేయడానికి తమ భూభాగాన్ని ఉపయోగించుకునే అవకాశాన్ని ఎవరికీ ఇవ్వబోమని ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan) తాలిబన్ సుప్రీం లీడర్ హెబతుల్లా అఖుండ్‌జాదా (Hebatullah Akhundzada) బుధవారం చెప్పారు. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దని ఇతర దేశాలను కోరారు. ఈద్-ఉల్-అజా (Eid-ul-Azha)కు ముందు ఆయన ఈ సందేశాన్ని ఇచ్చారు. 


ఆఫ్ఘనిస్థాన్‌లో విదేశీ ఉగ్రవాదులు తిష్ఠ వేసుకుని ఉన్నారని ఐక్య రాజ్య సమితి నివేదికలు వెల్లడించిన నేపథ్యంలో ఆయన ఈ సందేశం ఇచ్చారు. అల్‌ఖైదా, పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థల ఉగ్రవాదులు వేలాది మంది ఆఫ్ఘన్‌లో ఉన్నట్లు ఐరాస నివేదికలు చెప్తున్నాయి. 


ఈ నేపథ్యంలో అఖుండ్‌జాదా ఇచ్చిన సందేశంలో, పొరుగు దేశాలకు, ఈ ప్రాంతంలోని దేశాలకు, యావత్తు ప్రపంచానికి భరోసా ఇచ్చారు. ఇతర దేశాల భద్రతకు ముప్పు తలపెట్టడానికి తమ గడ్డను ఉపయోగించుకోవడానికి ఎవరినీ అనుమతించబోమని చెప్పారు. అదే విధంగా తమ అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాలు జోక్యం చేసుకోరాదని చెప్పారు. యావత్తు ప్రపంచంతోనూ తాము బలమైన దౌత్య, ఆర్థిక, రాజకీయ సంబంధాలను కోరుకుంటున్నామని చెప్పారు. అమెరికాతో కూడా తాము ఇదే విధంగా వ్యవహరించాలని కోరుకుంటున్నామన్నారు. దీనివల్ల అందరికీ ప్రయోజనం కలుగుతుందన్నారు. 


ఆఫ్ఘనిస్థాన్‌తో భారత దేశ దౌత్య సంబంధాలను గత నెలలో పునరుద్ధరించారు. గత ఏడాది ఆగస్టులో తాలిబన్లు ఆ దేశాన్ని వశం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మన దేశ అధికారులందరినీ స్వదేశానికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 


Updated Date - 2022-07-07T01:27:37+05:30 IST