Abn logo
Sep 15 2021 @ 04:02AM

తాలిబాన్ల కాసుల వేట?

  • గత ప్రభుత్వ పెద్దల ఇళ్లలో సోదాలు
  • అమ్రుల్లా సాలేహ్‌ ఇంట్లో రూ.47 కోట్లు లభ్యం


కాబూల్‌/న్యూఢిల్లీ, సెప్టెంబరు 14: అఫ్ఘాన్‌ను హస్తగతం చేసుకుని, ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ప్రకటించిన తాలిబాన్లు ఇప్పుడు కాసుల వేటలో పడ్డారు. అంతర్జాతీయ సమాజం అందించే సాయంతో పాటు సొంత వనరులను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో గత ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో పనిచేసి, ఇప్పుడు విదేశాలకు వలస వెళ్లిన పెద్దలు, అధికారుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. గత వారం వరకు పంజ్‌షీర్‌ తిరుగుబాటుదారుల వెన్నంటి ఉన్న మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ ఇంటిని కూడా తాలిబాన్లు కొల్లగొట్టారు. పంజ్‌షీర్‌లోని సలేహ్‌ ఇంట్లో రూ.47 కోట్ల విలువైన అమెరికా డాలర్లు, 18 బంగారు బిస్కట్లు లభించినట్లు తెలిపారు. మరోవైపు 2022 ద్వితీయార్థానికి అఫ్ఘాన్‌ పౌరుల్లో 97ు మంది పేదరికంలో మగ్గిపోతారని ఐరాస అంచనా వేసింది. చేయూతనివ్వాలన్న ఐరాస చీఫ్‌ ఆంటోనియో గుటెరస్‌ పిలుపునకు పలు దేశాలు స్పందించడంతో రూ.7,500 కోట్ల నిధులు అఫ్ఘాన్‌కు అందనున్నాయి. ప్రపంచ బ్యాంకు కూడా తాలిబాన్ల తాత్కాలిక ప్రభుత్వానికి రూ.2,795 కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరిం చింది. అమెరికా ఫ్రీజ్‌ చేసిన తమ దేశ సెంట్రల్‌ బ్యాంకు నిధులు(సుమారు రూ.69,883 కోట్లు) విడుదల చేయాలని అఫ్ఘానిస్థాన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇన్వె్‌స్టమెంట్స్‌(ఏసీసీఐ) డిమాండ్‌ చేసింది. ప్రభుత్వోద్యోగులకూ జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని గుర్తుచేసింది.


నాటి ఖైదీలే నేటి జైలు అధికారులు

ఒకప్పుడు అఫ్ఘాన్‌ జైళ్లలో ఖైదీలుగా ఉన్న తాలిబాన్లు ఇప్పుడు అవే జైళ్లకు చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. అఫ్ఘాన్‌లోనే అతిపెద్దదైన కాబూల్‌ శివార్లలోని పుల్‌-ఇ-చర్కీ జైలు అధికారిగా ఓ తాలిబాన్‌ కమాండర్‌ నియమితుడయ్యాడు. మరోవైపు అఫ్ఘాన్‌ వ్యవహారాల్లో చైనా-పాకిస్థాన్‌ చొరవతో పొరుగుదేశాల్లో ఆందోళన నెలకొంది. అఫ్ఘాన్‌పై చైనా-పాక్‌ వర్సెస్‌ భారత్‌-ఇరాన్‌-రష్యా అన్నట్లుగా పరిస్థితులు మారాయి. రష్యా ఇప్పటికే అఫ్ఘాన్‌ సరిహద్దుల్లోకి యుద్ధట్యాంకులను తరలిస్తుండగా.. షియా ప్రాబల్య దేశమైన ఇరాన్‌ కూడా సరిహద్దులపై నిఘా పెంచింది. భారత్‌ కూడా కశ్మీర్‌లో ఉగ్రవాదం పెరుగుతుందని ఆందోళన చెందుతోంది. 


దమ్ముంటే తాలిబాన్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి: ఒవైసీ

కేంద్ర ప్రభుత్వానికి ధైర్యం ఉంటే తాలిబాన్‌ను చట్టవ్యతిరేక కార్యకలా పాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ సవాల్‌ విసిరారు. తాలిబాన్‌ ఆవిర్భావం చైనా, పాకిస్థాన్‌లకు ప్రయోజనకరంగా ఉంటుందని, భారత్‌కు కాదని తాను 2013 నుంచి చెబుతున్నానన్నారు. బీజేపీకి మాత్రం ముస్లింలు అంతా తాలిబాన్లుగా కనిపిస్తారని చెప్పారు.