Abn logo
Jul 8 2021 @ 15:50PM

తాలిబన్ల ప్రతీకారం.. అఫ్గానిస్థాన్‌లో కలకలం!

కాబూల్: అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లకు వ్యతిరేకంగా గతంలో ప్రభుత్వానికి సహకరించిన వారిపై తాలిబన్లు ప్రస్తుతం ప్రతీకార చర్యలకు దిగుతున్నట్టు మానవహక్కుల సంస్థ హ్యూమన్ రైట్స్ వాచ్ తాజాగా వెల్లడించింది. ఉత్తర అఫ్గానిస్థాన్‌లో ఉన్న ప్రభుత్వ మద్దతుదారులను తాలిబన్లు వారి ఇళ్ల నుంచి వెళ్లగొట్టి ఆస్తులను లూటీ చేశారని, ఆపై వారి ఇళ్లను తగలబెట్టారని పేర్కొంది. అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా తన సేనలను ఉపసంహరించుకుంటున్న నేపథ్యంలో తాలిబన్లు ప్రస్తుతం దేశంలోని ఉత్తర ప్రాంతాలను ఒక్కొక్కటిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కుందుజ్‌తో పాటూ ఇతర ఉత్తర ప్రాంత ప్రావిన్సులలోగల 150కిపైగా జిల్లాల్లో తాలిబన్లు ప్రతీకార దాడులకు దిగుతున్నారని హ్యూమన్ రైట్స్ వాచ్ వెల్లడించింది. అకృత్యాలకు పాల్పడకుండా తమ దళాలను తాలిబన్ నాయకత్వం నియంత్రించాలని హ్యూమన్ రైట్స్ వాచ్ ఆసియా శాఖ డైరెక్టర్ తాజాగా ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. కాగా..తమ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి చందంగా మారిపోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సహాయం కోసం ఇరు వర్గాలు ఒత్తిడి తెస్తుంటాయని వారు తెలిపారు. గతంలో తమ సహాయం పొంది కూడా అఫ్గాన్ ప్రభుత్వం ప్రస్తుతం తమను ఆదుకునేందుకు ముందుకు రాకపోవడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు.