కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. తమ పాలన గతం కంటే మెరుగ్గా ఉంటుందని ఇటీవల పలుమార్లు తాలిబన్లు నొక్కి చెప్పినప్పటికీ అదంతా బూటకమేనని మరోమారు రుజువైంది. పశ్చిమ ఆఫ్ఘనిస్థాన్‌లోని హెరాత్ నగరంలో మెయిన్ స్క్వేర్ వద్ద ‘పనిష్మెంట్’గా ఓ వ్యక్తి మృతదేహాన్ని క్రేన్‌కు వేలాడదీశారు.
తాలిబన్ల తాజా చర్య గత పాలనకు ఏమాత్రం తీసిపోయేలా లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన జరిగిన మెయిన్ స్క్వేర్ పక్కనే ఓ ఫార్మసీ నిర్వహిస్తున్న వజీర్ అహ్మద్ సిద్దిఖీ మాట్లాడుతూ.. తాలిబన్లు మొత్తం నాలుగు మృతదేహాలను తీసుకొచ్చారని, ఒక్క దానిని అక్కడే వదిలి మిగతా వాటిని నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ప్రదర్శించేందుకు తీసుకెళ్లారని తెలిపాడు.
మృతదేహాల వేలాడదీతపై హెరాత్ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ మాలావి షిర్ అహ్మద్ ముహాజిర్ మాట్లాడుతూ.. మృతదేహాలన్నింటినీ ఒకే రోజు వేలాడదీసి ప్రదర్శించామని తెలిపారు. కిడ్నాపులను తాము సహించబోమని, ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే ‘గుణపాఠం’ ఇలా ఉంటుందని చెప్పడానికే ఇలా వేలాడదీసినట్టు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.