కాబూల్: ఇద్దరు జర్నలిస్టుల బాధాకరమైన చిత్రాలు చూసిన తర్వాత అఫ్ఘానిస్తాన్‌పై ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తమవుతున్న ఆందోళనకు మరింత బలం చేకూరుతోంది. అఫ్ఘాన్‌లో మానవహక్కులు, పత్రికా స్వేచ్ఛగా ఇప్పటికే ఉన్న సవాళ్లకు తోడు మరిన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కరుడుగట్టిన ఇస్లామిక్ సంస్థగా పేరున్న తాలిబన్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడి గంటలు గడవకముందే అరాచకం ప్రారంభమైంది. పశ్చిమ కాబూల్‌లోని కార్ట్ ఏ చార్ ప్రాంతంలో బుధవారం మహిళలు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని రిపోర్టర్ నేమత్ నఖ్దీ, వీడియో ఎడిటర్ తాకి దర్యాదీ అనే ఇద్దరు జర్నలిస్టులు కవర్ చేశారు. ఇది తాలిబన్‌ను ఆగ్రహానికి గురి చేసింది. అంతే, ఇద్దరు జర్నలిస్ట్‌లను పట్టుకుని కిరాతకంగా కొట్టారు. గాయాలు, రక్తపు ధారలతో ఇద్దరు జర్నలిస్టుల శరీరం నిండిపోయింది. సహాయంతో కూడా నడవలేని స్థితిలో ఉన్న ఆ జర్నలిస్ట్‌లను చూసి నెటిజెన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.