Abn logo
Sep 10 2021 @ 02:30AM

కనడానికే మహిళలు

  • కేబినెట్‌లో చోటుకు ఆశించకూడదు.. ఉద్యోగాలు వారి తలలపై భారమే
  • స్పష్టం చేసిన తాలిబాన్లు
  • నిరసనలు, ఆందోళనలపై నిషేధం

కాబూల్‌/న్యూఢిల్లీ, సెప్టెంబరు 9: మహిళల హక్కులను గౌరవిస్తామన్నారు.. నిన్నమొన్నటి దాకా ప్రభుత్వంలో చోటిస్తామన్నారు.. అంతలోనే మాట మార్చారు..! ‘‘మహిళలు ఉన్నదే ఇంట్లో కూర్చుని పిల్లల్ని కనడానికి. కేబినెట్‌లో పనిచేయడానికి కాదు. మహిళలకు ఉద్యోగాలు అంటే.. వారి తలలపై మోయలేని భారాన్ని పెట్టడమే’’ అని తాలిబాన్ల అధికార ప్రతినిధి సయాద్‌ జక్రుల్లా హాషిమి గురువారం వ్యాఖ్యానించారు. 1996-2001 మధ్యకాలంలో తాలిబాన్ల రాజ్యంలో కూడా మహిళలపై ఆంక్షలుండేవి. మగతోడు లేకుండా బయటకు రావడం నిషేధం. అలా వచ్చేప్పుడు ముఖాన్ని కప్పుకోవడం తప్పనిసరి. మహిళలు ఉద్యోగాలు చేయకూడదు. బాలికలు బడికి వెళ్లకూడదనే నిబంధనలు ఉండేవి. తాలిబాన్ల ఆపద్ధర్మ సర్కారు తాజాగా పిల్లల్ని కనేందుకే మహిళలు అని ప్రకటించడాన్ని బట్టి.. మళ్లీ రెండు దశాబ్దాల క్రితం నాటి పరిస్థితులు పునరావృతం కానున్నాయనే ఆందోళన అఫ్ఘాన్లలో కనిపిస్తోంది. కాగా, తాలిబాన్లు ఏరోజుకారోజు రెబెల్స్‌పై ప్రతీకార దాడులు తప్పవనే సంకేతాన్ని ఇస్తున్నారు. తాజాగా పంజ్‌షీర్‌ సింహంగా పేరున్న అహ్మద్‌షా మసూద్‌ సమాధిని కూల్చివేశారు. సరిగ్గా ఆయనను తాలిబాన్ల మానవబాంబు చంపి, 20 ఏళ్లు పూర్తయిన సందర్భంలో ఈ దుశ్చర్యకు పాల్పడడం గమనార్హం. ఈ ఘటనను అఫ్ఘాన్‌ పౌరులు సోషల్‌ మీడియా వేదికగా ఖండిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేస్తున్న 24 మంది జర్నలిస్టులను నిర్బంధించారు. కాబూల్‌లో ఇంటర్నెట్‌ ప్రసారాలను నిలిపివేశారు. మరోవైపు దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలను నిషేధిస్తూ తాలిబాన్ల ఆపద్ధర్మ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో కనీసం నినాదాలు చేయడం కూడా నేరమే. అనుమతులు ఉన్న ఆందోళనలు, నిరసనలు, ర్యాలీలను మాత్రమే అనుమతిస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాబూల్‌ విమానాశ్రయంలో అంతర్జాతీయ సేవలు గురువారం నుంచి పునఃప్రారంభమయ్యాయి. అఫ్ఘానిస్థాన్‌లో చిక్కుకుపోయిన అమెరికా, జర్మనీ, హంగరీ, కెనడా దేశాలకు చెందిన సుమారు 200 మంది ఖతార్‌ ఎయిర్‌వేస్‌ సహకారంతో కాబూల్‌ నుంచి దోహాకు చేరుకున్నారు.

తాలిబాన్ల తాత్కాలిక ప్రభుత్వానికి చట్టబద్ధతలేదని, దీన్ని ప్రపంచ దేశాలు గుర్తించకూడదని అష్రఫ్‌ ఘనీ కేబినెట్‌లో పనిచేసిన కొందరు మంత్రులు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. వారి పేర్లు.. వారు ఎక్కడున్నారు? అనే వివరాలను వెల్లడించలేదు. కాగా.. అఫ్ఘాన్‌లో ఏర్పడ్డ కొత్త తాత్కాలిక సర్కారు 40 ఏళ్ల అస్థిరతకు చరమగీతం పాడుతుందని ఆశిస్తున్నట్లు జమ్మూకశ్మీర్‌లోని హురియత్‌ కాన్ఫరెన్స్‌ నేత మీర్‌ వాయిజ్‌ ఉమర్‌ ఫారూఖ్‌ గురువారం ఓ ప్రకటనలో అభిప్రాయపడ్డారు.


అఫ్ఘానిస్థాన్‌తో పొరుగుదేశాలకు ముప్పు ఉండకూడదు: బ్రిక్స్‌

అఫ్ఘానిస్థాన్‌తో పొరుగుదేశాలకు ముప్పు ఉండకూడదని, ఆ దిశలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బ్రిక్స్‌ (బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల సదస్సు ఏకగ్రీవంగా తీర్మానించింది. ఇతర దేశాలపై కుట్రలకు ఉగ్రవాద సం స్థలు అఫ్ఘాన్‌ గడ్డను ఉపయోగించుకోకుండా నిరోధించాలని పేర్కొంది. గురువారం వర్చువల్‌గా జరిగిన ఈ సదస్సుకు ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. ఉగ్రవాద వ్యతిరేక కార్యాచరణకు బ్రిక్స్‌ కృషిచేస్తోందని, 15 ఏళ్లుగా అనేక విజయాలను సాధించిందని ఈ సందర్భంగా ఆయన గు ర్తుచేశారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల గొంతుకగా బ్రిక్స్‌ నిలిచిందన్నారు. అఫ్ఘాన్‌ వల్ల పొరుగుదేశాలకు ఉగ్రవాదం, డ్రగ్స్‌ ముప్పు ఉండకూడదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అన్నారు. అంతర్జాతీయ వేదికపై బ్రిక్స్‌ కీలక శక్తిగా ఎదిగిందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, ఐక్యంగా పనిచేసి కొవిడ్‌ కట్టడికి కృషిచేశామని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమాఫోసా అన్నారు. కాగా.. వ చ్చే ఏడాది బ్రిక్స్‌కు చైనా అధ్యక్షత వహించనుంది.
అనిశ్చితికి నిదర్శనం అఫ్ఘాన్‌: రాజ్‌నాథ్‌ సింగ్‌

ప్రపంచంలో చాలా చోట్ల అనిశ్చితి కొనసాగుతోందని.. ఇందుకు తాజా నిదర్శనం అఫ్ఘానిస్థాన్‌ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. భూతలం నుంచి గగనతలంలోని లక్ష్యాన్ని ఛేదించే మధ్యశ్రేణి క్షిపణి ఎంఆర్‌ఎ్‌సఏఎంను భారత వాయుసేన(ఐఏఎ్‌ఫ)కు అందజేస్తూ గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. దక్షిణ చైనా సముద్రం, హిందూ మహాసముద్ర ప్రాంతం, ఇండో-పసిఫిక్‌, మధ్య ఆసియాల్లో అనిశ్చితి కొనసాగుతోందని గుర్తుచేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో దేశ సార్వభౌమాధికారం తమ తొలి ప్రాధాన్యమని చెప్పారు. మరో సందర్భంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి మాట్లాడుతూ.. అఫ్ఘానిస్థాన్‌లో వనరుల కల్పనకు భారత్‌ మూడు బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసిందని గుర్తుచేశారు.