కాబుల్: అఫ్ఘానిస్తాన్‌లోని తాలిబన్ల తాత్కాలిక ప్రభుత్వం నిధుల లేమితో తల్లడిల్లిపోతోంది. అఫ్ఘనిస్తాన్కు అన్ని దేశాలు తమ ఆర్థికసాయాన్ని నిలిపివేయడంతో ప్రభుత్వాన్ని నడిపించడం తాలిబన్లకు కష్టతరంగా మారింది. ఈ నేపధ్యంలో వారు తమ దేశంలోని పురాతన నిధులను వెలికితీసి, దేశంలో నెలకొన్న ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కాలని ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే వారు బ్యాక్ట్రియన్ గోల్డ్ నిధిపై దృష్టి సారించారు. ఎంతో విలువైన ఈ బంగారు వస్తువుల ఖజనా... బ్యాక్ట్రియన్ గోల్డ్ ఎక్కడ ఉందనే దానిపై అన్వేషణ ప్రారంభించామని తాలిబన్ సమాచార, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మీడియాకు తెలిపింది. 40 ఏళ్ల క్రితం జ్వాజియన్ ప్రావిన్స్ పరిధిలోని షేర్బర్ఘన్ ప్రాంతంలో ఈ నిధి వెలుగుచూసింది. అప్పట్లో 20 వేలకు పైగా పురాతన వస్తువులు తవ్వకాల్లో బయల్పడ్డాయి. వీటిలో బంగారు ఆభరణాలతోపాటు, నాణేలు, గుర్రం, ఎనుగు బొమ్మలు ఉన్నాయి. భారత్‌లో తయారైన అపురూప కళాఖండాలు కూడా వీటిలో ఉన్నట్టు సమాచారం. ఈ నిధి క్రీస్తుపూర్వం ఒకటవ శతాబ్ధంనాటికి చెందినదని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నిధిని వివిధ దేశాల్లో ప్రదర్శించిన కారణంగా అప్ఘానిస్తాన్‌కు 2006 నుంచి 2020 మధ్యకాలంలో సుమారు 4.5 మిలియన్ డాలర్ల ఆదాయం సమకూరింది. ఇప్పుడు ఇటువంటి నిధి తమ దేశంలో ఎక్కడైనా ఉందేమోనని తాలిబన్ తాత్కాలిక ప్రభుత్వం వెదుకులాట సాగిస్తోంది.