మళ్ళీ తాలిబాన్‌

ABN , First Publish Date - 2021-08-17T06:28:07+05:30 IST

ఆ దృశ్యాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతున్నది. తాలిబాన్ల వశమైన దేశం నుంచి ఎలాగైనా దాటిపోవాలన్న ప్రయత్నంలో విమానాశ్రయంలో వందలమంది ప్రాణాలకు తెగించారు...

మళ్ళీ తాలిబాన్‌

ఆ దృశ్యాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతున్నది. తాలిబాన్ల వశమైన దేశం నుంచి ఎలాగైనా దాటిపోవాలన్న ప్రయత్నంలో విమానాశ్రయంలో వందలమంది ప్రాణాలకు తెగించారు. బస్సో, రైలో ఎక్కుతున్నట్టుగా విమానాల్లోకి చొరబడే ప్రయత్నం చేయడం, వారిని నిలువరించే పేరిట అమెరికా భద్రతాబలగాలు కాల్పులు జరపడం, కొందరు మరణించడం బాధాకరం. విమానాన్ని పట్టుకొని వేలాడుతున్న ఇద్దరు అది గాల్లోకి లేచిన కొద్ది క్షణాల్లోనే కిందకు జారిపడిపోతున్న విడియో ఒకటి విస్తృతంగా ప్రచారమవుతున్నది. విమానం ఇంజన్లమీద కూచున్నవారు కొందరు, దాని వెంటపరుగులు తీస్తున్నవారు మరికొందరు. అఫ్ఘాన్‌ దుస్థి‌తిని అద్దంపట్టే అనేక దృశ్యాలను మిగతా ప్రపంచం నేడు చూస్తున్నది. అమెరికా అర్థంతరంగా వదిలిపోయిన ఫలితం ఇది.


దేశాధ్యక్షుడే పారిపోతే ప్రజలు మాత్రం చేయగలిగేదేముంది? మిగతా అగ్రదేశాలు, ఐక్యరాజ్యసమితి వంటివి ఇంతటి సంక్షోభకాలంలోనూ విన్నపాలకే పరిమితం. అధికారమార్పిడి, తాత్కాలిక ప్రభుత్వం వంటి మాటలకు కూడా చోటు దక్కలేదు. తాలిబాన్‌ పెద్దలంతా ఖాళీగా ఉన్న అధ్యక్షభవనంలోకి ప్రవేశించి, కుర్చీలను ఆక్రమించుకోవడంతో యుద్ధం పరిపూర్ణమైంది, అధికారమార్పిడి జరిగిపోయింది. ఇరవైయేళ్ళక్రితం అమెరికా సైనికులు అఫ్ఘానిస్థాన్‌లోకి చొరబడి, తాలిబాన్‌ను గద్దెదించిన దృశ్యాలు ప్రపంచం ఇంకా మరిచిపోకముందే, అమెరికా తన లక్ష్యాన్ని పూర్తిగా నెరవేర్చకుండా వెనక్కుమరలిపోయింది. తన తప్పటడగులతో అఫ్ఘాన్‌ ప్రజలను నట్టేటముంచింది. అంతర్జాతీయస్థాయి చర్చల్లో తాలిబాన్‌ను భాగస్వామిని చేసి దానికి అఖండమైన విలువా గౌరవాలను సమకూర్చిన అమెరికా, అఫ్ఘాన్‌ ప్రజా ప్రభుత్వానికి మాత్రం తగినంత ప్రాధాన్యం ఇవ్వలేదు. తాలిబాన్‌ తీరులో ఏ మార్పూ రాలేదనీ, అది ఇరవైయేళ్ళనాటికంటే ఆర్థికంగా, భౌతికంగా మరింత బలంగా ఉన్నదని దాని వరుస విజయాలు రుజువుచేశాయి. 


తాలిబాన్‌ పునరాగమనంతో అఫ్ఘాన్‌లో మారిన పరిస్థితుల ప్రభావాన్ని రాబోయే రోజుల్లో మనం ప్రత్యక్షంగా అనుభవించవలసి రావచ్చు. అఫ్ఘాన్‌ చదరంగంలో పాకిస్థాన్‌ తెలివిగా ఎత్తులు వేసి, వ్యవహారాలను చక్కదిద్దే పని అమెరికా తనకే వదిలిపెట్టేట్టుగా చేసుకుంది. 


ఇప్పుడు అఫ్ఘానిస్థాన్‌ విషయంలో వ్యూహాత్మకంగా పాకిస్థాన్‌దే పైచేయి. అఫ్ఘాన్‌ ప్రభుత్వానికి ఏదో బలం ఉన్నట్టుగా, తాలిబాన్‌తో నేరుగా మాటామంతికి ఏ దశలోనూ ప్రయత్నించలేదు మనం. ఇప్పుడు పాకిస్థాన్‌ గుప్పిట్లోకిపోయిన అఫ్ఘానిస్థాన్‌నుంచి మౌనంగా నిష్క్రమించవలసిందే. పాకిస్థాన్‌ చెప్పినట్లుగా చైనా, రష్యా తదితర దేశాలు నడుచుకుంటాయి. దశాబ్దంన్నరకు పైగా అక్కడ మనం నిలబెట్టుకున్న ఉనికినీ, పెంచుకున్న ప్రాధాన్యాన్నీ, చేసిన అభివృద్ధినీ సమూలంగా నాశనం చేసే పని మొదలవుతుంది. తాలిబాన్‌కు వ్యతిరేకంగా నిలిచిన ఫలితంగా ఇతరదేశాలూ ఖండాలతో మనలను అనుసంధానించే పలు ప్రాజెక్టులు నిలిచిపోతాయి. అఫ్ఘాన్‌ ప్రభుత్వ సాయంతో పాకిస్థాన్‌ను కాస్తంత అదుపులో ఉంచగలిగే అవకాశమూ పోయినట్టే. అమెరికా అండతో కశ్మీర్‌లో రెండేళ్లక్రితం చేసిన ఓ సాహసం, సత్ఫలితాలను ఇస్తోందని ప్రభుత్వం గర్వంగా చెప్పుకుంటున్న స్థితిలో తాలిబాన్‌ పునరాగమనం జిహాదీ శక్తులకు ఊతం ఇవ్వవచ్చు. అఫ్ఘానిస్థాన్‌ తాలిబాన్‌ వశమవుతుందని అనుకున్నప్పటికీ, ఇలా శరవేగంతో అది పూర్తవుతుందని ఎవరూ ఊహించలేదు. అమెరికా నేర్పిన యుద్ధరీతులూ ఇచ్చిన సైనిక శిక్షణలూ ఎక్కడకు పోయాయో తెలియదు కానీ, ప్రతీచోటా అఫ్ఘాన్‌సైనికులు తాలిబాన్ల శరణుజొచ్చారు, అత్యాధునిక ఆయుధాలు అప్పగించి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ పరిస్థితులు అమెరికా ఊహించనివేమీ కావు. తాము తప్పుకుంటే తాలిబాన్లు విపరీతమైన వేగంతో దేశంలోని అనేక భూభాగాలను వశం చేసుకుంటారనీ, సన్నద్ధంగా ఉండాలనీ అమెరికా విదేశాంగమంత్రి మేనెలలో అఫ్ఘాన్‌ అధ్యక్షుడికి రాసిన లేఖలోనే వ్యాఖ్యానించారు. ఇకపై తాలిబాన్‌నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సింది అఫ్ఘాన్‌ ప్రభుత్వమేనని అమెరికా అధ్యక్షుడు కూడా అన్యాపదేశంగా పలుమార్లు వ్యాఖ్యానించారు. అమెరికా నిఘావర్గాలు కూడా తొంభైరోజుల్లోనే తాలిబాన్ దేశాన్ని హస్తగతం చేసుకుంటుందని నివేదిక ఇచ్చాయి. నిజానికి అంతకాలం కూడా పట్టలేదు. అన్ని తెలిసి దేశాన్ని అవే మూకల చేతుల్లో పెట్టి అమెరికా నిష్క్రమించిన ఫలితాన్ని యావత్‌ ప్రపంచం ఇకపై చూడబోతున్నది.

Updated Date - 2021-08-17T06:28:07+05:30 IST