దొరకునా.. ఇటువంటి జల్సా

ABN , First Publish Date - 2021-09-14T03:34:00+05:30 IST

దొరకునా.. ఇటువంటి జల్సా

దొరకునా.. ఇటువంటి జల్సా

ఇన్నాళ్లు ఎడారిలో, కొండ కోనల్లో.. గుట్టల్లో జీవనం సాగించారు తాలిబన్లు. ఎప్పుడు, ఏ వైపు నుంచి దాడులు జరుగుతాయో, ఎవరి రూపంలో మృత్యువు ముంచుకొస్తుందో అన్న భయంతో కాలం వెల్లదీశారు. కానీ, ఇప్పుడు దశ తిరిగింది. కలలో కూడా ఊహించని విలాసాలు సొంతమవుతున్నాయి. ఇంద్రభవనాల్లాంటి బిల్డింగులు జల్సాలకు అడ్డాలవుతున్నాయి.  


అఫ్ఘానిస్తాన్‌ తాలిబన్ల వశమయ్యింది. ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా తాలిబన్‌ ఉగ్రవాదులు అఫ్ఘాన్‌లో చెలగాటం ఆడుతున్నారు. వాళ్లు ఆడిందే ఆట.. పాడిందే పాట అవుతోంది. ఏ విలాస భవనం కనిపిస్తే దాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. ఏ ప్రముఖుడి ఇల్లు గుర్తిస్తే ఆ ఇంటిని తమ అధీనంలోకి తెచ్చుకుంటున్నారు. ఇక, సామాన్యులు మాత్రం అర చేతిలో ప్రాణాలు పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతుకు వెల్లదీస్తున్నారు. ప్రస్తుతం అఫ్ఘానిస్తాన్‌లోనిదీ పరిస్థితి.


తాలిబన్ల స్వాధీన క్రమంలోనే ఇప్పుడో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. దానిని గమనిస్తే.. విశాలమైన గదులు, సుతిమెత్తని పరుపులు, ఇంట్లోనే స్విమ్మింగ్‌పూల్‌.. జిమ్‌, విదేశీ మద్యం సీసాలతో నిండిన బార్‌.. వీటన్నింటితో కూడి ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇంద్రభవనం లాంటి ఇల్లు ఇది. ఇప్పుడది అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ల చేతికి చిక్కింది. ఆధునిక సదుపాయాలతో ఉన్న ఆ భవనంలో ఇప్పుడు దాదాపు 150 మంది ముఠా సభ్యులు జల్సాలు చేస్తున్నారు. సర్వాంగ సుందరంగా ఉన్న ఇంటిని చూసి తాలిబన్లు ఉబ్బితబ్బిబ్బయిపోతున్నారు. ఆయుధాలతో ప్రవేశించిన తాలిబన్లు సోఫాల్లో కూర్చొని, భవనమంతా సోదాలు చేసి హడావుడి చేశారు.


తాలిబన్లు ఎంజాయ్‌ చేస్తున్న ఆ విలాసవంతమైన భవనం అఫ్ఘానిస్థాన్‌ మాజీ ఉపాధ్యక్షుడు అబ్దుల్‌ రషీద్‌ దోస్తమ్‌ది. తాలిబన్లలోని ముఖ్యమైన కమాండర్లలో ఒకడైన కారీ సలాహుద్దీన్‌ అయౌబీ తన భద్రతా సిబ్బందితో కలిసి దోస్తమ్‌ ఇంట్లో ఉంటున్నారు. ఆయన తాలిబన్‌ కొత్త ప్రభుత్వంలో ఓ శక్తిమంతమైన కమాండర్‌. ఆయన ఆధీనంలో నాలుగు ప్రావిన్స్‌లు ఉన్నాయి.  ఇన్నాళ్లూ కొండలు, లోయల్లో నివసించిన.. ముఠా సభ్యులు ఆ ఇంట్లోని హంగూ ఆర్భాటాలను చూసి ఆశ్చర్యపోతున్నారు.  


దోస్తమ్‌ తాలిబన్లకు బద్ధ శత్రువు. అబ్దుల్‌ రషీద్‌ దోస్తమ్‌ అఫ్ఘాన్‌ చరిత్రలోనే ఒక  క్రూరమైన వార్‌లార్డ్‌. గతంలో పారాట్రూపర్‌గా, కమ్యూనిస్టు కమాండర్‌గా, దేశానికి ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. అవినీతిలో భారీగా సంపాదించినట్లు దోస్తుంకు పేరుంది. 2001లో రెండు వేల మందికి పైగా తాలిబన్‌ ముఠా సభ్యులను హతమార్చినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. కంటెయినర్లలో బంధించి ఎడారిలో వదిలేయడంతో.. ఊపిరాడక వారంతా మరణించినట్లు చెబుతుంటారు. ఇటీవల తాలిబన్లు విజృంభించాక ప్రాణభయంతో దోస్తమ్‌ అఫ్ఘానిస్తాన్‌ను వదిలి ఉజ్బెకిస్థాన్‌కు పారిపోయారు. దీంతో కాబుల్‌లో సకల వసతులతో ఆయన నిర్మించుకున్న ఇంటిని తాలిబన్లు గత నెల 15వ తేదీన స్వాధీనం చేసుకున్నారు. 


మరోవైపు.. అఫ్ఘానిస్తాన్‌ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ ఇంట్లో తాలిబన్లు భారీగా యూఎస్ డాలర్లు స్వాధీనం చేసుకున్నారు. తాలిబన్లు స్వయంగా ఈప్రకటన చేశారు. అఫ్ఘానిస్తాన్‌లో ప్రజా ప్రభుత్వం నుంచి అధికారాన్ని తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయారు. కానీ, ఆయన ప్రభుత్వంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న అమ్రుల్లా సలేహ్ మాత్రం తనకు తాను అధ్యక్షుడిగా ప్రకటించుకుని తాలిబన్లపై పోరాటం కొనసాగిస్తానని గంభీరమైన ప్రకటన చేశారు. కానీ ఆ తర్వాత పరిస్దితి మారిపోయింది. పంజ్ షీర్‌లో ప్రతిఘటన దళాలతో కలిసి కొన్నిరోజులు పోరాటం చేశాక ఆయన కూడా దేశం విడిచి పారిపోయారు. అయితే, అమ్రుల్లా సలేహ్ వెళ్లిపోయాక ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్న తాలిబన్లకు అక్కడ భారీ ఎత్తున యూఎస్ కరెన్సీ దొరికింది. ఏకంగా 6.5 మిలియన్ యూఎస్ డాలర్ల కరెన్సీ ఈ సోదాల్లో లభ్యమైనట్లు తాజాగా తాలిబన్లు ప్రకటించుకున్నారు. యూఎస్ డాలర్ తో పోలిస్తే ఎన్నో రెట్లు తక్కువగా ఉండే ఆప్ఘన్ కరెన్సీతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. దీంతో ఇప్పుడు ఈ మొత్తాన్ని తాలిబన్లు ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.



వాస్తవానికి అమెరికా బలగాల సాయంతో ప్రభుత్వాన్ని నడిపిన అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ కూడా చివరి నిమిషంలో తాను పారిపోయే సమయంలో భారీ ఎత్తున యూఎస్ కరెన్సీతో పారిపోయినట్లు వార్తలొచ్చాయి. అయితే, తనకు హెలికాఫ్టర్ ఎక్కే సమయం కూడా లేదని ఆ తర్వాత ఆయన వివరణ ఇచ్చారు. కానీ, అక్కడే ఉండిపోయిన చాలా మంది నేతల వద్ద కూడా యూఎస్ కరెన్సీ ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని మారకం చేసుకని వారు ఎంచక్కా వాడుకుంటున్నారు. అలాంటి వారిని గుర్తించి వారి ఇళ్లపై ప్రస్తుతం తాలిబన్లు దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో భారీఎత్తున కరెన్సీ వెలుగుచూస్తోంది. దీన్ని ఆప్ఘనిస్తాన్ పునర్నిర్మాణం కోసం వాడుతామని తాలిబన్లు చెప్తున్నారు. అయితే ప్రజలు మాత్రం వీరి మాటలు అస్సలు నమ్మడం లేదు. 


అటు.. పంజ్‌షేర్‌ బలగాల నాయకుడు అహ్మద్‌ మసూద్‌ దేశం విడిచి వెళ్లారంటూ వస్తున్న వార్తలు వాస్తవం కాదని ఇరాన్‌ అధికారిక వార్తాసంస్థ 'ఫార్స్‌ న్యూస్‌' ఓ కథనంలో తెలిపింది. ఆయన అఫ్ఘాన్‌లోనే ఓ సురక్షిత ప్రదేశంలో ఉన్నారని స్పష్టం చేసింది. అక్కడి నుంచే పంజ్‌షేర్‌లోని 'నేషనల్‌ రెసిస్టెన్స్‌ ఫోర్స్‌' బలగాలతో సంబంధాలు కొనసాగిస్తున్నారని వెల్లడించింది. 


- సప్తగిరి గోపగోని, చీఫ్‌ సబ్‌ ఎడిటర్‌, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి

Updated Date - 2021-09-14T03:34:00+05:30 IST