గిరిజన మహిళల జీవితాల్లో ఉషస్సు!

ABN , First Publish Date - 2020-08-10T05:30:00+05:30 IST

సమాజం ఆమెను గడ్డిపోచ కన్నా హీనంగా చూసింది. ఆ గడ్డిపోచలనే ఆదాయ మార్గంగా మార్చి వందలాది గిరిజన మహిళల బతుకులు చక్కదిద్దారు ఒడిశా గిరిజన మహిళ ఉషారాణి నాయక్‌...

గిరిజన మహిళల జీవితాల్లో ఉషస్సు!

  • సమాజం ఆమెను గడ్డిపోచ కన్నా హీనంగా చూసింది. ఆ గడ్డిపోచలనే ఆదాయ మార్గంగా మార్చి వందలాది గిరిజన మహిళల బతుకులు చక్కదిద్దారు ఒడిశా గిరిజన మహిళ ఉషారాణి నాయక్‌. స్థానికంగా పెరిగే సబాయ్‌ (నాపియర్‌) గడ్డితో పలురకాల హస్త కళాకృతులు తయారుచేసి విక్రయించడం ద్వారా 200 మందికిపైగా గిరిజన మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. తాను చదువుకోకపోయినా పెద్ద చదువులు చదివిన మహిళలకు ఉపాధి కల్పించి మహిళా సాధికారతకు ఊతమిస్తున్నారు.


ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లా గుజల్‌దీహీ ఉషారాణి స్వగ్రామం. బాతూడీ అనే గిరిజన తెగకు చెందిన ఉషారాణి జీవితమంతా పేదరికంలోనే గడిచింది. చదువు మధ్యలోనే ఆగిపోయింది. కట్నం ఇవ్వలేని కారణంగా 22 ఏళ్లకు ఆమెకు వివాహం జరిగింది. ‘‘నా పెళ్లి నాన్నకు భారం కాకూడదని భావించి నేనే అప్పు చేసి పెళ్లి ఖర్చులు భరించాను. కానీ పెళ్లయ్యాక కూడా అవే కష్టాలు... ఖర్చులకు ఎప్పుడూ డబ్బు కోసం వెతుకులాటే. మా గ్రామంలోని చాలా కుటుంబాల్లోనూ ఇదే పరిస్థితి. ఇంటి ఖర్చులు, ఏదైనా కొనుక్కోవాలన్నా మగవాళ్లను అడగాల్సివచ్చేది. ఆడవాళ్లు కూడా సంపాదిస్తేనే గౌరవంగా, నచ్చినట్టు బతకొచ్చు అనిపించింది. ఆ ఆలోచనతోనే గ్రామంలో 2001లో స్వయం సహాయక సంఘం ప్రారంభించాను. ఆ సంఘం తరపున కోళ్లు, పుట్టగొడుగులు, మేకలు, తేనెటీగల పెంపకం చేపట్టాం. కానీ మా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అయితే అదే సమయంలో వచ్చిన ఓ ఆలోచన మా జీవితాల్లో మార్పు తెచ్చింది. స్థానికంగా పెరిగే సబాయ్‌ (నాపియర్‌) గడ్డితో గిరిజనులు రకరకాల ఉత్పత్తులు తయారుచేస్తారు. వాటిని కళాత్మకంగా తయారుచేసి పట్టణాల్లో విక్రయించాలనే ఆలోచన వచ్చింది. ముందుగా సబాయ్‌ గడ్డితో తాళ్లను తయారుచేసి అమ్మాం. నేను పదేళ్ల వయసులోనే సబాయ్‌ గడ్డితో తాడు పేనడం నేర్చుకున్నాను’’ అన్నారు ఉష.




ఆదాయ మార్గంగా సంప్రదాయ కళ!

కానీ ఈ ప్రయాణం ఉషారాణికి అంత సలువుగా సాగలేదు. గ్రామస్థుల నుంచి అవమానాలు ఎదుర్కొన్నారు. అయితే ఏ రోజు కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. జిల్లా పారిశ్రామిక కేంద్రం (డీఐసీ)లో సబాయ్‌ గడ్డితో చాపలు, బాస్కెట్‌లు, మ్యాట్‌లు, స్టాండ్‌.. వంటి రకరకాల వస్తువులు తయారుచేయడంలో ఉషారాణి తోటి మహిళలతో కలసి శిక్షణ తీసుకున్నారు. అలా సంప్రదాయ కళకు కళాత్మక సొబగులు అద్ది గడ్డితో పనికొచ్చే వస్తువులు తయారుచేయడం ప్రారంభించారు. ‘‘డీఐసీ మమ్మల్ని కటక్‌లో ఎగ్జిబిషన్‌కు తీసుకెళ్లింది. తొలిసారి అక్కడ 20 వేల రూపాయల ఉత్పత్తులు అమ్మాం. అది మాకు ధైర్యాన్నిచ్చినా నాసిరకంగా ఉన్నాయని వెనక్కు తిరిగిచ్చారు. అది మాకు చాలా పెద్ద దెబ్బ. గ్రామంలో అందరూ మమ్మల్ని చులకనగా చూడడం ప్రారంభించారు. అప్పటికే 40 వేల రూపాయల అప్పు అయ్యింది. ఏం చేయాలో పాలుపోలేదు. అప్పుడు ‘ఒడిశా రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ మార్కెటింగ్‌ సొసైటీ’ సాయం చేసింది. అలా 2013 కల్లా అప్పులు తీర్చాం. ఆ తరువాత 25 లక్షల రూపాయల రుణం తీసుకొని మరింత నాణ్యతతో, సృజనాత్మకతను జోడించి ఉత్పత్తులను పెంచాం’’ అన్నారామె. 




పర్యావరణహితం... 

‘మయూర్‌భంజ్‌ సబాయ్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌’ పేరుతో ఉషారాణి పర్యావరణహితమైన హస్తకళా ఉత్పత్తుల తయారీ సంస్థను స్థాపించారు. సబాయ్‌ గడ్డితో 200 మందికి పైగా సాటి మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. ఇంటిపట్టునే ఉండి పనిచేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. సబాయ్‌ గడ్డితో సాయంత్రం దాకా పలు రకాల హస్తకళా ఉత్పత్తులు తయారుచేస్తున్నారు. 2019లో కంపెనీకి ఒక మర్చిపోలేని సంవత్సరం. 25 లక్షల రూపాయల విలువైన ఆర్డర్‌ వచ్చింది. అంత పెద్ద ఆర్డర్‌ రావడం అదే తొలిసారి. బాగా కష్టపడి మూడు నెలల్లోనే పూర్తిచేసి అందించారు. మయూర్‌శిల్పా.కామ్‌లో ఆన్‌లైన్‌ ద్వారా కూడా వారు తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ఇప్పుడు ఇరుగుపొరుగు గ్రామాల్లోని వెనుకబడిన, పేద మహిళలు కూడా ఈ సంఘంలో చేరి ఉపాఽధి పొందుతున్నారు. వారిలో డిగ్రీ, అంతకంటే పెద్ద చదువులు చదివిన వారు కూడా ఉన్నారు. పదిమందితో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం 200 మందికి పైగా గిరిజన మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. గతేడాది 30 లక్షల రూపాయల విలువైన ఉత్పత్తులు అమ్మి, 19 లక్షల రూపాయల లాభం గడించారు. ఇటీవలే ప్రభుత్వం వారికోసం జిల్లాకేంద్రం బారిపాదా, రాజధాని భువనేశ్వర్‌లో హస్తకళా ఉత్పత్తులు అమ్ముకోవడానికి షాపులు కేటాయించింది. భవిష్యత్తులో తనలాంటి ఎందరో మహిళలను సాధికారిత దిశగా నడిపించేందుకు ఉషారాణి పథక రచన చేస్తున్నారు.


కొడుకు కోసం బైక్‌ కొన్నా!

చుట్టుపక్కల గ్రామాల్లోనూ మరిన్ని హస్తకళా ఉత్పత్తి సంఘాలను ఉషా ప్రారంభించారు. వందల మంది మహిళలకు శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు ఆమె తన గ్రామంలో ఉంటూనే నెలకు 20 వేల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారు. ‘‘నేను సంపాదించిన సొమ్ముతో కాలేజీకి వెళ్లడానికి నా కొడుకు కోసం ఈ ఽమధ్యనే బైక్‌ కొన్నాను’’ అని ఆమె సంతోషంగా చెప్పారు. తను బాగుపడటమే కాకుండా గ్రామంలోని చాలా కుటుంబాలను పేదరికం నుంచి బయటపడేశారు. ఒకప్పుడు తిట్టిన వాళ్లే ఇప్పుడు సాయం కోసం ఉష దగ్గరకు వస్తున్నారు.


Updated Date - 2020-08-10T05:30:00+05:30 IST