టేకు వనంపై గొడ్డలి వేటు

ABN , First Publish Date - 2022-05-28T06:50:51+05:30 IST

అటవీ శాఖ సీలేరు రేంజ్‌ పరిధిలోకి దబ్బకోట టేకు ప్లాంటేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు వందకుపైగా టేకు చెట్లు నరికివేశారు.

టేకు వనంపై గొడ్డలి వేటు
దబ్బకోట ప్లాంటేషన్‌లో నరికివేసిన టేకు చెట్లు

దబ్బకోట ప్లాంటేషన్‌లో వందకుపైగా చెట్లు నరికివేత

అటవీ శాఖ సిబ్బంది రాకతో దుండగులు పరారీ

రోలుగుంటకు చెందిన ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు 


సీలేరు, మే 27: అటవీ శాఖ సీలేరు రేంజ్‌ పరిధిలోకి దబ్బకోట టేకు ప్లాంటేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు వందకుపైగా టేకు చెట్లు నరికివేశారు. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించి అటవీ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. చెట్లు నరికివేతకు కారకులుగా అనుమానిస్తూ ధారకొండ పంచాయతీ రోలుగుంట గ్రామానికి ఇద్దరిపై సీలేరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు రేంజ్‌ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. 

అటవీ శాఖ సీలేరు రేంజ్‌ ధారకొండ సెక్షన్‌కు చెందిన దబ్బకోటలో సుమారు 40 ఏళ్ల క్రితం 13 హెక్టార్లలో టేకు మొక్కలు నాటారు. తరువాత ఈ ప్లాంటేషన్‌ చుట్టూ వున్న భూమిని స్థానిక గిరిజనులు ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో టేకు ప్లాంటేషన్‌లో చెట్లను దఫదఫాలుగా నరికేస్తూ అటవీ భూమిని కూడా ఆక్రమించుకుంటూ వస్తున్నారు. దీంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్లాంటేషన్‌లో ఖాళీవున్న ప్రదేశంలో రోజ్‌ఉడ్‌, ఏగిస, తదితర జాతుల చెట్లు పెంచడానికి గత ప్రణాళిక రూపొందించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక గిరిజనులు... ప్రస్తుతం (అప్పట్లో) పంటలు వున్నందున మొక్కలు నాటవద్దని, వచ్చే ఏడాది వరకు గడువు ఇవ్వాలని కోరారు. ఇందుకు అటవీ శాఖ అధికారులు అంగీకరించారు. ఈ ఏడాది అటవీ భూమిలో మొక్కలు నాటడానికి ఇటీవల పనులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్లాంటేషన్‌లోకి ప్రవేశించి టేకు చెట్లను నరివేయడం మొదలుపెట్టారు. దబ్బకోట అటవీశాఖ బేస్‌క్యాంప్‌కు చెందిన కృష్ణ అనే వ్యక్తి గ్రహించి స్థానికులను వెంటబెట్టుకుని ప్లాంటేషన్‌ వద్దకు చేరుకున్నాడు. దీంతో చెట్లు నరుకుతున్న వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. అతను ఈ విషయాన్ని సీలేరు రేంజ్‌ అధికారి కె.శ్రీనివాసరావుకు తెలియపరిచారు. శుక్రవారం ఉదయం ఆయన సిబ్బందితో వచ్చి టేకు ప్లాంటేషన్‌ను పరిశీలించారు. సుమారు 100 టేకు చెట్లను నరికేసినట్టు గురించారు. వాటికి నంబర్లు వేసి, కొలతలు తీశారు. ధారకొండ ఫారెస్టు సెక్షన్‌ ఆఫీసర్‌ చంద్రశేఖర్‌ దబ్బకోట వెళ్లి గ్రామస్థులను విచారించారు. అనంతరం రేంజ్‌ అధికారి శ్రీనివాసరావు స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ, టేకు చెట్ల నరికివేతపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామన్నారు. దీనికి సంబంధించి ధారకొండ పంచాయతీ రోలుగుంట గ్రామానికి చెందిన చిన్నబ్బాయి, పురుషోత్తమ్‌పై సీలేరు ఎస్‌ఐ రవికుమార్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. 


Updated Date - 2022-05-28T06:50:51+05:30 IST