రఘురామ ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వ వివరణ తీసుకోండి

ABN , First Publish Date - 2021-03-05T11:42:11+05:30 IST

జగన్‌ ప్రభుత్వం తనపై తప్పుడు కేసులు బనాయించి.. తన సొంత నియోజకవర్గం నరసాపురంలో పర్యటించకుండా అరెస్టు చేయడానికి కుట్ర పన్నిందంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సమర్పించిన

రఘురామ ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వ వివరణ తీసుకోండి

పక్షం రోజుల్లో నివేదిక ఇవ్వండి: స్పీకర్‌ ఆదేశం


న్యూఢిల్లీ, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): జగన్‌ ప్రభుత్వం తనపై తప్పుడు  కేసులు బనాయించి.. తన సొంత నియోజకవర్గం నరసాపురంలో పర్యటించకుండా అరెస్టు చేయడానికి  కుట్ర పన్నిందంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సమర్పించిన సభాహక్కుల ఉల్లంఘనఫిర్యాదుపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా స్పందించారు. తాను తన నియోజకవర్గంలో తిరగకుండా అడ్డుకుంటున్నారంటూ.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, మరికొందరు వ్యక్తులపై ఎంపీ ఈనెల 1న ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దానిపై రాష్ట్రప్రభుత్వం నుంచి వివరణ తీసుకుని, రానున్న పక్షం రోజుల్లోగా వాస్తవిక పరిస్థితులతో నివేదిక సమర్పించాలని సభాపతి కేంద్ర హోంశాఖను గురువారం ఆదేశించారు. తనపై పోలీసులు పెట్టిన తప్పుడు కేసుల ఎఫ్‌ఐఆర్‌ ప్రతులన్నీ రఘురామరాజు సమర్పించారు.


స్పీకర్‌ కార్యాలయం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది. ఫిర్యాదు ప్రతిని కేంద్ర హోం మంత్రి కార్యాలయంతోపాటు హోం కార్యదర్శి అజయ్‌కుమార్‌ భల్లాకు సైతం పంపింది. రాష్ట్రప్రభుత్వం పాల్పడుతున్న రాజ్యాంగ, చట్ట విరుద్ధమైన చర్యలను తరచూ ప్రశ్నిస్తున్నందుకే తనపై తప్పుడు కేసులు పెట్టారని రఘురామ తన ఫిర్యాదులో ఆరోపించారు. జగన్‌ సర్కారు అరాచకాలు, మతమార్పిళ్లు, దేవాలయాలు, విగహ్రాల విధ్వంసాలు, రాజ్యాంగ, చట్టవిరుద్ధమైన చర్యలు, అప్రజాస్వామిక పాలనపై ఇటీవల తాను ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసి ఫిర్యాదు చేయడం వల్లే త నపై రాష్ట్రప్రభుత్వం కక్ష కట్టిందన్నారు.

Updated Date - 2021-03-05T11:42:11+05:30 IST