ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శిని కస్టడీలోకి తీసుకోండి

ABN , First Publish Date - 2021-07-25T08:00:36+05:30 IST

ఓ కేసుకు సంబంధించిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో.. కోర్టు షరతులకు అంగీకరించని ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి కేవీవీ సత్యనారాయణను కస్టడీలోకి తీసుకుని, మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచాలని హైకోర్టు సింగిల్‌ జడ్జి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు

ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శిని కస్టడీలోకి తీసుకోండి

సత్యనారాయణను మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచండి

కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో సింగిల్‌ జడ్జి ఆదేశం

వెనువెంటనే ధర్మాసనానికి అప్పీల్‌ చేసిన ప్రభుత్వం

27 వరకు సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల సస్పెండ్‌


అమరావతి, జూలై 24(ఆంధ్రజ్యోతి): ఓ కేసుకు సంబంధించిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో.. కోర్టు షరతులకు అంగీకరించని ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి కేవీవీ సత్యనారాయణను కస్టడీలోకి తీసుకుని, మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచాలని హైకోర్టు సింగిల్‌ జడ్జి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సదరు కేసుకు సంబంధించి ఈ నెల 15న కేవీవీ సత్యనారాయణ కోర్టుకు స్వయంగా హాజరు కావాల్సి ఉంది. అయితే.. ఆయన హాజరు కాలేదు. దీంతో కోర్టు ఆయనపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఈ క్రమంలో శనివారం ఈ కేసు మరోసారి విచారణకు రాగా.. సత్యనారాయణ స్వయంగా హాజరై.. ఎన్‌బీడబ్ల్యూను వెనక్కి తీసుకోవాలని అభ్యర్థిస్తూ అనుబంధ పిటిషన్‌ వేశారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌.. ఎన్‌బీడెబ్ల్యూను రీకాల్‌ చేయాలంటే న్యాయస్థానం విధించిన షరతుకు కట్టుబడి, రూ.50 వేల సొంత నగదును ఏపీ న్యాయవాదులు, గుమాస్తాల సంక్షేమ నిధికి చెల్లించాలని ఆదేశించారు. అయితే... ఈ షరతుకు కేవీవీ సత్యనారాయణ అంగీకరించలేదు. దీంతో అనుబంధ పిటిషన్‌ను కొట్టివేయడంతో పాటు తక్షణమే ఆయనను కస్టడీలోకి తీసుకోవాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. ఇదిలావుంటే, ఈ ఉత్తర్వులపై ప్రభుత్వం వెంటనే ధర్మాసనం ముందు అప్పీల్‌ చేసింది. అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) శ్రీరాం దాఖలు చేసిన అప్పీల్‌పై జస్టిస్‌ సి.ప్రవీణ్‌ కుమార్‌, జస్టిస్‌ బి. కృష్ణమోహన్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేసి.. సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలను ఈ నెల 27 వరకు సస్పెండ్‌ చేసింది. 


ఇదీ.. విషయం!

కృష్ణాజిల్లా, కలిదిండి మండలం, భాస్కరరావు పేటకు చెందిన పంచాయితీ కార్యదర్శి జి.శ్రీమన్నారాయణ తన ఉద్యోగాన్ని 1997 నుంచి క్రమబద్ధీకరించకుండా 2005 నుంచి పరిగణనలోకి తీసుకోవడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారించిన కోర్టు 1997 నుంచి క్రమబద్ధీకరించాలని ఆదేశించింది. అయితే, ఆ తీర్పు అమలు చేయకపోవడంతో ఆయన కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ క్రమంలో హైకోర్టు.. పంచాయితీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్‌ గిరిజా శంకర్‌, డీపీవో సాయిబాబు, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి కేవీవీ సత్యనారాయణను నేరుగా కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఆ రోజు విచారణకు సత్యనారాయణ హాజరుకాలేదు. దీంతో న్యాయమూర్తి ఎన్‌బీడబ్ల్యూ జారీ చేశారు. 

Updated Date - 2021-07-25T08:00:36+05:30 IST