ఇలా జాగ్రత్త పడదాం!

ABN , First Publish Date - 2020-06-09T16:16:25+05:30 IST

కరోనా నుంచి రక్షణ పొందాలంటే వ్యాధినిరోధకశక్తి, స్వీయశుభ్రత పెంచుకోవాలి. రోగ నిరోధకశక్తిని తగ్గించే ఆహారానికి దూరంగా ఉండాలి. శానిటైజర్లు, డిజ్‌ ఇన్‌ఫెక్టెంట్ల వాడకమూ అలవాటు చేసుకోవాలి. వాటి వాడకంలో తగు జాగ్రత్తలూ పాటించాలి.

ఇలా జాగ్రత్త పడదాం!

ఆంధ్రజ్యోతి (09-06-2020): వైరస్‌ సోకకుండా శానిటైజర్‌ వాడడం అవసరమే! అలాగే ఇంటి శుభ్రత కోసం డిజ్‌ ఇన్‌ఫెక్టెంట్లు కూడా అవసరమే! అయితే వాటిని అతిగా వాడితే కష్టం. అతిగా వాడడం మూలంగా తలెత్తే ఇబ్బందులనూ గమనిస్తూ ఉండాలి. తగిన జాగ్రత్తలూ పాటించాలి. కరోనా నుంచి రక్షణ పొందాలంటే వ్యాధినిరోధకశక్తి, స్వీయశుభ్రత పెంచుకోవాలి. రోగ నిరోధకశక్తిని తగ్గించే ఆహారానికి దూరంగా ఉండాలి. శానిటైజర్లు, డిజ్‌ ఇన్‌ఫెక్టెంట్ల వాడకమూ అలవాటు చేసుకోవాలి. వాటి వాడకంలో తగు జాగ్రత్తలూ పాటించాలి. కరోనా కట్టడికి ఇలాంటి మెలకువలు అనుసరించడం అత్యవసరం!


ఆచితూచి వాడదాం...

మహిళల్లో తీవ్రత ఎక్కువ: మహిళల చర్మం మృదువుగా, సున్నితంగా ఉండడం మూలంగా తరచుగా శానిటైజర్‌ వాడినప్పుడు, చర్మం కందిపోయి, దద్దుర్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇవి తగ్గడానికి కనీసం ఐదు నుంచి ఏడు రోజుల సమయం పడుతుంది. చేతుల మంట ఇంకొంత ఎక్కువ కాలం కూడా కొనసాగవచ్చు. పిల్లల చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసినప్పుడు  చర్మం గరుకుగా కూడా మారుతుంది. ఇలాంటప్పుడు పిల్లల చేతులను సబ్బుతో కడగడం మేలు.


రసాయనాలతో ఇక్కట్లు: శానిటైజర్‌లో ఆల్కహాల్‌తో పాటు క్లోరోహెక్సీడీన్‌, క్లోరోగ్జైలినాల్‌, ట్రైక్లోసాన్‌ మొదలైన రసాయనాలు ఉంటాయి. ఇవి చర్మపు సహజ నూనెలను హరిస్తాయి. దాంతో చర్మం సహజమైన తేమ తగ్గిపోయి, పగుళ్లు ఏర్పడతాయి. ఈ పగుళ్ల ద్వారా బ్యాక్టీరియా తేలికగా చర్మంలోకి చేరుతుంది. ఆల్కహాల్‌లో ఉండే ఐసోప్రొపైల్‌, ఇథనాల్‌, ఎన్‌ - ప్రొపనాల్‌ రసాయనాలు చేతుల్లోని చర్మ కణాలకు హాని చేసి, చర్మాన్ని పొడిబారుస్తాయి. ఇలా జరిగినప్పుడు డెర్మటైటిస్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. శానిటైజర్ల తయారీలో ఉపయోగించే రసాయన పరిమళాలు కొందరికి ఎలర్జీలు కలిగిస్తాయి. సున్నితమైన చర్మం కలిగిన వారికి దురద, మంట, మరికొందరిలో హార్మోన్‌ అసమతౌల్యాన్నీ కలిగిస్తాయి.


యాంటీ బయాటిక్‌ రెసిస్టెన్స్‌: శానిటైజర్లలో ఉండే ట్రైక్లోసాన్‌ అనే రసాయనం యాంటీ బయాటిక్‌ రెసిస్టెన్స్‌ బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదపడుతుంది. శానిటైజర్లను తరచుగా వాడితే, బ్యాక్టీరియా, ఇతరత్రా వ్యాధికారక సూక్ష్మక్రిములు యాంటీబయాటిక్స్‌ను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుకుంటాయి. దాంతో తేలికగా ఇన్‌ఫెక్షన్లకు గురయ్యే అవకాశాలూ పెరుగుతాయి.


ముఖం, మోచేతులు వద్దు: కొంతమంది అరచేతులతో పాటు ముఖం, మోచేతులను కూడా శానిటైజర్‌తో శుభ్రపరుస్తూ ఉంటారు. శానిటైజర్‌లో 60 నుంచి 70 శాతం ఆల్కహాల్‌ ఉంటుంది. కాబట్టి దాంతో చేతులు మాత్రమే శుభ్రం చేసుకోవాలి. అలాగే శానిటైజర్‌ను పరిమితంగానే వాడాలి. అరచేతుల మీద మినహా ముఖం, మోచేతుల మీద శానిటైజర్‌ను స్ర్పే చేసుకోకూడదు.


వీటికి ‘నో’ చెబుదాం!

శీతల పానీయాలకు సెలవు!

నూటికి నూరు శాతం సహజసిద్ధమైన పండ్లరసం పేరుతో అమ్ముడయ్యే ప్రతి శీతలపానీయంలోనూ అవసరం లేనన్ని క్యాలరీలు ఉంటాయి. ఇలాంటి తీపి శీతలపానీయాలలో పీచు ఉండదు. దాంతో వీటిని తాగినా ఆకలి తీరిన భావన కలగదు. పైగా వీటితో శరీర బరువు పెరుగుతుంది. వ్యాధినిరోధకశక్తి బలహీనపడడం మూలంగా స్థూలకాయం వచ్చే అవకాశాలు ఉన్నట్టు పలు పరిశోధనల్లో రుజువైంది. కాబట్టి శీతల పానీయాలకు దూరంగా ఉండాలి.


కాఫీ, కెఫీన్‌ కలిసిన పానీయాలు!

కాఫీ కడుపులో పడనిదే రోజు మొదలుపెట్టలేని అలవాటు మనలో ఎక్కువ మందికి ఉంటుంది. అయితే రోజుకు రెండు పూటలు, రెండు సార్లు కాఫీ తాగడానికే పరిమితం అయితే ఫరవాలేదు. ఆ రెండుసార్లకు మధ్యలో తరచుగా కాఫీ కప్పులు ఖాళీ చేసే అలవాటు ఉంటే మానుకోవాలి. ఎక్కువ కెఫీన్‌తో కార్టిసాల్‌ అనే హార్మోన్‌ స్రావం పెరుగుతుంది. ఇది రోగనిరోధకశక్తి ప్రతిస్పందన మీద ప్రభావం చూపిస్తుంది. కాఫీతో నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. తత్ఫలితంగా వ్యాధినిరోధకశక్తి సన్నగిల్లే ప్రమాదం ఉంది.. కాబట్టి కాఫీ వాడకం తగ్గించడం మేలు.


చాక్లెట్లతో ఇక్కట్లు!

అప్పుడప్పుడూ చాక్లెట్ల మీదకు మనసు మళ్లడం సహజం. అయితే తీపి తినాలనే ఆశతో చక్కెరతో నిండిన కేకులు, పేస్ట్రీలు, క్యాండీ, జెల్లీలు లాంటివి తినడం ఆరోగ్యకరం కాదు. ఇలాంటి తీపి వస్తువులన్నీ అప్పటికే శరీరంలో అంతర్గతంగా ఉన్న వాపులు, నొప్పులను రెట్టింపు చేస్తాయి. ఫలితంగా శరీరంలో పెరిగే ఇన్‌ఫ్లమేటరీ మార్కర్లతో వ్యాధినిరోధకశక్తి ఒడుదొడుకులకు లోనవుతుంది. కాబట్టి తీపి తినాలనిపిస్తే చాక్లెట్లకు బదులుగా పండ్ల ముక్కలను ఎంచుకోవాలి.


వేపుళ్లతో వెయ్యి చేట్లు!

ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, చికెన్‌ వింగ్స్‌ - నూనెలో ముంచి వేగించిన ఇలాంటి పదార్థాలన్నీ రుచిగా ఉంటాయి. వీటిలో ఉండే అధిక ఉప్పు శరీరంలో నీరు నిల్వ ఉండిపోయేలా చేసి, రక్తపోటు పెరిగేలా చేస్తుంది. ఇవి రెండూ వ్యాధినిరోధకశక్తిని కుంటుపరిచేవే! ఈ పదార్థాల్లోని చెడు కొవ్వులు, జిడ్డు పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను చంపి, వ్యాధినిరోధశక్తి తగ్గేలా చేస్తాయి. ఇలాంటి వేపుడు పదార్థాలు మధుమేహం, గుండె జబ్బులకూ దారితీస్తాయి. కాబట్టి వీటిని తినడం మానాలి.



డిజ్‌ ఇన్‌ఫెక్టెంట్లతో జాగ్రత్త!

చర్మం, కంటి సమస్యలు: డిజ్‌ ఇన్‌ఫెక్టెంట్లు నేరుగా కళ్లు, చర్మానికి తగిలితే కళ్లు, చర్మం ఎర్రబడతాయి. 


కాలేయం: కొన్ని డిజ్‌ ఇన్‌ఫెక్టెంట్లలో ఇథనోలమైన్‌ అనే రసాయనం ఉంటుంది. ఈ రసాయనం మూత్రపిండాలు, కాలేయాలకు హాని కలిగిస్తుంది.


శ్వాసకోశ సమస్యలు: వీటిని పీల్చడం మూలంగా దగ్గు, శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి.


కేంద్ర నాడీ వ్యవస్థ: అతిగా డిజ్‌ ఇన్‌ఫెక్టెంట్లను పీల్చడం మూలంగా తలనొప్పి, తలతిరుగుడు, వాంతులు లాంటి సమస్యలు తలెత్తుతాయి.


గుండె: కొన్నింటిలో బ్యూటేన్‌ అనే రసాయనం ఉంటుంది. మండే గుణం కలిగిన ఈ రసాయనం అధిక మోతాదులో శరీరంలోకి చేరితే గుండె సంబంధ సమస్యలు తలెత్తుతాయి.


ఉపరితలాలను శుభ్రపరిచే డిజ్‌ ఇన్‌ఫెక్టెంట్లను వీలైనంత పొదుపుగా వాడాలి. వాటిని వాడే సమయంలో తలుపులు, కిటికీలు తెరచి ఉంచాలి. వాటి వాయువులు పీల్చే వీలు లేకుండా ముఖానికి మాస్క్‌ వేసుకోవాలి. కళ్లకు గాగుల్స్‌, చేతులకు గ్లౌజులు ధరించాలి.


-డాక్టర్‌ స్వప్న ప్రియ

డెర్మటాలజిస్ట్‌, హైదరాబాద్‌

Updated Date - 2020-06-09T16:16:25+05:30 IST