ఉక్రెయిన్ ఆర్మీకి సంచలన సూచన చేసిన పుతిన్

ABN , First Publish Date - 2022-02-26T03:08:01+05:30 IST

ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించి దాని రాజధాని కీవ్ వరకు చొచ్చుకుపోయిన రష్యా అక్కడి ఏరోడ్రోమ్‌ను

ఉక్రెయిన్ ఆర్మీకి సంచలన సూచన చేసిన పుతిన్

మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించి దాని రాజధాని కీవ్ వరకు చొచ్చుకుపోయిన రష్యా అక్కడి ఏరోడ్రోమ్‌ను సొంతం చేసుకుంది. ఉక్రెయిన్‌ను మూడు వైపుల నుంచి చుట్టిముట్టేసి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉక్రెయిన్ కనుక ఆయుధాలు విడిచిపెడితే చర్చలకు సిద్ధమని చెబుతూనే కీవ్ దిశగా దళాలను నడిపిస్తోంది.


తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. టెలివిజన్‌లో పుతిన్ మాట్లాడుతూ ఉక్రెయిన్ ఆర్మీకి కీలక సూచన చేశారు. కీవ్‌ ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని సూచించారు. అప్పుడు ఒప్పందం కుదుర్చుకోవడం మరింత సులభమవుతుందని పేర్కొన్నారు. 


రష్యా భద్రతా మండలిలో పుతిన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ దళాలకు తాను మరోమారు విజ్ఞప్తి చేస్తున్నానని, మీ పిల్లలు, భార్యలు, పెద్దలను మానవ కవచాలుగా ఉపయోగించుకోవడానికి నయా-నాజీలను అనుమతించవద్దని, అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కోరారు.


మరోవైపు, తమ కిండర్‌గార్డెన్, అనాథాశ్రమాలపై రష్యా దళాలు దాడి చేస్తున్నాయని ఉక్రెయిన్ ఆరోపించింది. రోమ్ శాసనాన్ని ఉల్లంఘించి మరీ రష్యా సేనలు యుద్ధ నేరానికి పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. వాస్తవాలను సేకరించి హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానానికి పంపుతామని పేర్కొంది.

Updated Date - 2022-02-26T03:08:01+05:30 IST