పొలాలు తీసుకుని పరిహారం ఇవ్వరా?

ABN , First Publish Date - 2021-12-03T05:42:34+05:30 IST

తమ పంట పొలాలు తీసుకొని పరిహారం ఇవ్వకుండా వేధిస్తున్నారని పిన్నాపురం గ్రామస్థులు ఆరోపించారు.

పొలాలు తీసుకుని పరిహారం ఇవ్వరా?
పనులను అడ్డుకుంటున్న గ్రామస్థులు

  1. సోలార్‌ పనులను అడ్డగించిన గ్రామస్థులు
  2. ఉపాధి చూపించాలని డిమాండ్‌ 


పాణ్యం, డిసెంబరు 2: తమ పంట పొలాలు తీసుకొని పరిహారం ఇవ్వకుండా వేధిస్తున్నారని పిన్నాపురం గ్రామస్థులు ఆరోపించారు. ఈ మేరకు గురువారం గ్రీన్‌కో చేపట్టిన పనులను అడ్డుకున్నారు. పిన్నాపురం గ్రామ పరిసరాల్లో గ్రీన్‌కో ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ  సోలార్‌ నిర్మాణ పనులు చేపట్టడానికి  రెండేళ్ల క్రితం రైతుల నుంచి వ్యవసాయ భూములు కొన్నది. ఎకరాకు రూ.25వేలు నష్టపరిహారం ఇవ్వాల్సిన సంస్థ ఇంత వరకు ఇవ్వలేదని సోలార్‌ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.     పనుల్లోతమకు ఉపాధి చూపకుండా స్థానికేతరులను తీసుకోవడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లు కావస్తున్నా ఓర్వకల్లు మండలం గుమ్మితం తండా నుంచి గ్రామానికి వచ్చే తాగునీటి పైపులైనును గ్రీన్‌కో అధికారులు ధ్వంసం చేశారన్నారు. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను తమ ఆధీనంలో ఉంచుకొని ఇష్టానుసారంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారన్నారు. గ్రీన్‌కో పనుల్లో భాగంగా చేపట్టే బ్లాస్టింగ్‌తో ఇళ్లు పగుళ్లు ఏర్పడుతున్నాయన్నారు. ఇంటింటికి ఉద్యోగం అంటూ ఆశ చూపి ఇప్పటికీ ఇవ్వలేదని అన్నారు. అందువల్ల తమకు పరిహారం ఇచ్చాకే పనులు ప్రారంభించాలని గ్రామస్థులు తేల్చి చెప్పారు.  


నెలలోగా సమస్యలను పరిష్కరిస్తాం 

 నెలరోజుల్లో సమస్యలను పరిష్కరిస్తాం. ట్రాక్ట్టర్లకు ఇవ్వాల్సిన రూ.6లక్షల బాడుగల నిఽధులు అందజేస్తాం. పొలాల పరిహారం ఇవ్వడానికి కృషి చేస్తాం. బ్లాస్టింగ్‌ పనులతో ఇబ్బంది లేకుండా పనులు చేపడతాం.  

- కిరణ్‌కుమార్‌రెడ్డి, మేనేజరు, గ్రీన్‌ కో సంస్థ



Updated Date - 2021-12-03T05:42:34+05:30 IST