13 నుంచి ఉపాధి పనులు

ABN , First Publish Date - 2020-04-10T11:55:56+05:30 IST

జిల్లాలో మళ్లీ ఉపాధి పనులు చేపట్టేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. కరోనా వైరస్‌ వ్యాప్తి

13 నుంచి ఉపాధి పనులు

కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోండి

11 రకాల పనులకే అనుమతి

కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌


విజయనగరం (ఆంధ్రజ్యోతి), ఏప్రిల్‌ 9: జిల్లాలో మళ్లీ ఉపాధి పనులు చేపట్టేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వాలు సూచించిన జాగ్రత్తలు పాటిస్తూ... పనులు చేపట్టేందుకు వీలుగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 13 నుంచి పనులు ప్రారంభించాలని కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ అనుమతినిచ్చారు. ఈ మేరకు గురువారం జిల్లాలోని అధికారులు, ఏపీఓలు, క్షేత్ర స్థాయి సిబ్బందితో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేతనదారులు కచ్చితంగా నిబంధనలు పాటించేలా చూడాలని ఆదేశించారు. చెరువు పనుల్లో కనీస దూరం పాటించడం సాధ్యం కాదని...అందుకే వాటిని నిలిపి వేస్తున్నట్లు తెలిపారు.


ఆ పనులు జూన్‌ నెలలో ప్రారంభమవుతాయని చెప్పారు. కరోనా వైరస్‌ను నిరోధించే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవడానికి వీలు ఉండే 11 రకాల పనులకు మాత్రమే అనుమతిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ నెల 13 నుంచి జిల్లా వ్యాప్తంగా ఉపాధి పనులు మొదలవుతాయని తెలిపారు. కరోనాపై వేతనదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. కనీసం 2 మీటర్లు దూరం పాటించేలా క్షేత్ర స్థాయి సిబ్బంది, ఏపీఓలు చర్యలు తీసుకోవాలని సూచించారు. భౌతిక దూరం పాటించకుండా పనులు చేసినట్లు తెలిస్తే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్‌ హెచ్చరించారు. 


వ్యాధిగ్రస్తులు వద్దు

దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారు, జలుబు, దగ్గు, జ్వరం ఉన్నవారిని పనుల్లో చేర్చుకోవద్దని అధికారులకు కలెక్టర్‌ సూచించారు. ఇవి కరోనా లక్షణాలుగా గుర్తించాలన్నారు. వైద్య సిబ్బందికి తెలియజేసి... ఇలాంటి వారినిపరీక్షలకు పంపించాలని ఆదేశించారు.


11 రకాల పనులే..

ప్రస్తుతం 11 రకాల పనులకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు అదికారులు, సిబ్బందికి కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ తెలిపారు. వీటిలో ట్రెంచ్‌లు తవ్వడం, ఫార్మ్‌పాండ్‌లు, చానల్‌ పనులు, బౌండరీ ట్రెంచ్‌లు, చెక్‌డ్యాంలు, పైప్‌ కల్వర్టులు,    భూమి చదును పనులు వంటివి మాత్రమే చేపట్టాలని సూచించారు.


రూ 77 కోట్లు విడుదల..

ఉపాధి పనులకు సంబంధించి మార్చి నెలఖారు వరకు చెల్లించాల్సిన వేతన బాకాయిలకు రూ.77.58 కోట్లు  విడుదల చేసినట్టు కలెక్టర్‌ తెలిపారు. రోజువారీ వేతనం రూ.211 నుంచి రూ.237కు పెంచినట్టు వెల్లడించారు. వేసవిలో ప్రభుత్వం ఇచ్చే భత్యం ఏప్రిల్‌, మే నేలల్లో 30 శాతం, జూన్‌లో అదనంగా 30 శాతం చెల్లించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడి అయితా నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-10T11:55:56+05:30 IST