Abn logo
Sep 22 2021 @ 00:57AM

పార్కింగ్‌ బేలను సద్వినియోగం చేయండి

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. పక్కన అపాటా ప్రతినిధులు

విమాన సంస్థలకు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సూచన

విశాఖపట్నం, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం విమానాశ్రయంలో కొత్తగా నిర్మించిన ఐదు పార్కింగ్‌ బేలను సద్వినియోగం చేయాలని విమానాశ్రయం సలహా కమిటీ అధ్యక్షుడు,  ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కోరారు. ఏపీ విమాన ప్రయాణికుల సంఘం(అపాటా), ఏపీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ప్రతినిధులతో కలిసి ఆయన విమానాశ్రయంలో మంగళవారం సాయంత్రం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ విజయవాడ, తిరుపతితోపాటు ఇతర నగరాలకు కూడా సర్వీసులను పునరుద్ధరించాలని కోరారు. కార్గో విమాన సర్వీసులు పెంచడానికి తగిన ప్రయత్నం జరగాలన్నారు. దుబాయ్‌, థాయ్‌ల్యాండ్‌లకు అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని ఆయా సంస్థల ప్రతినిధులను కోరారు. ఈ సందర్భంగా అపాటా ప్రతినిధులు నరేశ్‌కుమార్‌, రాజ్‌కుమార్‌, డీఎస్‌ వర్మ, ఏపీ చాంబర్‌ ప్రతినిధులు పైడా కృష్ణప్రసాద్‌, సాంబశివరావు తదితరులు విమానాల సంఖ్య పెంపు, కార్గో విమాన సర్వీసుల అవసరాన్ని వివరించారు. ప్రధాన విమాన సంస్థలు ఎయిర్‌ ఆసియా, స్పైస్‌ జెట్‌ వంటివి రాత్రికి ఇక్కడే పార్కింగ్‌ చేసుకొని, తెల్లవారుజామున సర్వీసులు ప్రారంభించేలా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. దీనిపై విమానాశ్రయం డైరెక్టర్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ, విమానాశ్రయంలో పీక్‌ టైమ్‌లో 30 శాతం రద్దీ పెరిగిందని, ఇంకా మరిన్ని సర్వీసులు పెంచడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.  ఈ సమావేశంలో ఏపీ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ ప్రతినిధి విజయకుమార్‌, ఎయిర్‌ ఆసియా, స్పైస్‌జెట్‌ ఏపీ, తెలంగాణ ప్రతినిధులు పాల్గొన్నారు.