సెకండ్‌ వేవ్‌పై అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-04-17T05:20:21+05:30 IST

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు అధికా రులంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు ఆదేశించారు.

సెకండ్‌ వేవ్‌పై అప్రమత్తంగా ఉండాలి
కొవిడ్‌పై మహిళా సమాఖ్య సభ్యులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు

ఏలూరు సిటీ, ఏప్రిల్‌ 16: కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు అధికా రులంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు ఆదేశించారు. కలెక్టరేట్‌లో వైద్య అధికారులతో శుక్రవారం సమీక్షించారు. అనంతరం వాక్సినేషన్‌ మానిటరింగ్‌, గైడనింగ్‌ ప్రత్యేకాధికారి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయలక్ష్మితో కలిసి సమావేశం నిర్వహించారు. కొవిడ్‌ బాధితులను హోం ఐసోలేషన్‌లో ఉంచి ఎప్పటి కప్పుడు ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ వైద్యం అందించాలన్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే కొవిడ్‌ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలన్నారు. కొవిడ్‌ ఆస్పత్రులలో రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వైద్యంతో పాటు మెనూ ప్రకారం భోజనాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆక్సిజన్లు, రోగులకు బెడ్ల కొరత లేకుండా చూడాలని 104 కాల్‌ సెంటర్‌లో 24/7 గంటలు డాక్టర్లు ఉండే విధంగా డ్యూటీలు వేయాలని, 108 వాహనాలు కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లు, ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రైవేటు ఆస్పత్రులలో ఎవరైనా అధిక మొ త్తంలో డబ్బులు వసూలు చేస్తే 1902కు ఫోన్‌ ద్వారా తెలపాలన్నారు. జిల్లాలో హెల్త్‌ కేర్‌ వర్కర్లు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు నూటికి నూరుశాతం వాక్సినేషన్‌ చేయిం చుకోవాలని ఆదేశించారు. ఎస్పీ కె.నారాయణ నాయక్‌, జేసీ నంబూరి తేజ్‌ భరత్‌, డీఎంహెచ్‌వో సునంద, డీసీహెచ్‌ఎస్‌ ఏవీఆర్‌ మోహనరావు, డీపీవో రమేష్‌బాబు, ఏలూరు కేంద్ర ఆస్పత్రికి చెందిన అధికారులు పాల్గొన్నారు. 


కాల్‌ సెంటర్‌ను పరిశీలించిన ప్రత్యేకాధికారి

కలెక్టరేట్‌లో కాల్‌ సెంటర్‌ను కొవిడ్‌ ప్రత్యేకాధికారి జి.జయలక్ష్యి పరిశీలించారు. కలెక్టరేట్‌లోని డ్వామా కార్యాలయంలో ఏర్పాటు చేసిన 104 కాల్‌ సంటర్‌లో ఏ విధంగా కాల్స్‌ వస్తున్నాయి, వాటిని ఏ విధంగా రిజిస్టరు చేస్తున్నారు, ఏ విధంగా పరిష్కరిస్తున్నారు తదితర వివరాలను ఆమె సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.


కొవ్వూరు డివిజన్‌లో 57 వేల మందికి వ్యాక్సిన్‌ : ఆర్డీవో


కొవ్వూరు, ఏప్రిల్‌ 16 : కొవ్వూరు రెవిన్యూ డివిజన్‌లో  57,700 మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసినట్లు ఆర్డీవో డి.లక్ష్మారెడ్డి తెలిపారు. టీకా ఉత్సవ్‌లో భా గంగా డివిజన్‌లోని 13 మండలాల్లో 95 కేంద్రాల ద్వారా 45 ఏళ్ల వయసు పైబడిన 13,700 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చామన్నారు. ప్రస్తుతం వ్యాక్సిన్‌ రావలిసి ఉందన్నారు. వ్యాక్సిన్‌ వచ్చిన తరువాత ఆయా గ్రామాల్లో వలంటీర్లు ద్వారా సమాచారం అందిస్తామన్నారు. ప్రజలలో కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌పై అపో హాలు వద్దన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయని ప్రతిఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలన్నారు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్‌ బాధితులకు వైద్య సేవలందిస్తారన్నారు. కొవిడ్‌ లక్షణాలు గమనిస్తే అశ్రద్ధ చేయకుండా వైద్య పరీక్షలు చేయించుకుని చికిత్స పొందాలన్నారు.


ప్రజలను అప్రమత్తం చేయాలి

కరోనా రెండో దశ వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున గ్రామాలలో ప్రజలను అప్రమత్తం చేయాలని వెలుగు ఏపీఎం ఈడూరి మహాలక్ష్మి అన్నారు. మం డల సమాఖ్య కార్యాలయంలో మహిళా సమాఖ్య అధ్యక్షులు, అసిస్టెంట్‌లకు శుక్రవారం కొవిడ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఏపీఎం మహాలక్ష్మి మాట్లాడుతూ ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలన్నారు. మాస్క్‌ ధరించడం, సామాజిక దూరం పాటించడం, శానిటైజర్లు వినియోగించడంపై గ్రామ సమాఖ్యలోని డ్వాక్రా గ్రూపులకు అవగాహన కల్పించాలన్నారు. హెల్త్‌ సూపర్‌వైజర్‌ శ్రీనివాస్‌, వెలుగు సీసీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


కరోనా వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూపు

జీలుగుమిల్లి: కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులో లేక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం జీలుగుమిల్లి పీహెచ్‌సీకి వచ్చిన వారు వ్యాక్సిన్‌ లేకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. ఉత్సవ్‌ నిర్వహించిన సమ యంలో సైతం పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ నిల్వలు నిండుకున్నాయి. రెండు రోజుల క్రితం పీహెచ్‌సీకి వ్యాక్సిన్‌ రావడంతో మరికొందరికి టీకాలు వేశారు. అనంతరం పీహెచ్‌సీకి వెళ్లిన వారు వెనుదిరగాల్సి వస్తోంది. ఈ విషయమై సీహెచ్‌వో జె.విల్సన్‌బాబును అడగ్గా శుక్రవారం సాయంత్రం లోపు  జిల్లా కేంద్రం నుంచి వ్యాక్సిన్‌ రావాల్సి ఉందన్నారు.


నల్లజర్ల మండలంలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌

నల్లజర్ల : మండలంలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఆవపాడు, పోతవరం గ్రామాల్లో రెండు కరోనా కేసులు నమోదైనట్లు సీహెచ్‌వో చంద్రశేఖర్‌ రాజు శుక్రవారం తెలిపారు. ప్రతి రోజు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉందన్నారు. ఇప్పటి వరకు 2వేలు మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు ఆయన వివరించారు.

Updated Date - 2021-04-17T05:20:21+05:30 IST