టీఆర్‌ఎస్‌ నాయకులు, సీఐలపై చర్య తీసుకోండి

ABN , First Publish Date - 2021-10-20T05:02:06+05:30 IST

దళితబంధు అంశంలో ప్రజలను రెచ్చగొడుతూ బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్న టీఆర్‌ఎస్‌ నాయకులపై, అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న జమ్మికుంట, కమలాపూర్‌ పోలీసు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ప్రతినిధుల బృందం కేంద్ర ఎన్నికల పరిశీలకులను కోరింది.

టీఆర్‌ఎస్‌ నాయకులు, సీఐలపై చర్య తీసుకోండి
కేంద్ర ఎన్నికల పరిశీలకుడికి ఫిర్యాదు చేస్తున్న బీజేపీ ప్రతినిధులు

- కేంద్ర ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేసిన బీజేపీ ప్రతినిధులు 

కరీంనగర్‌, అక్టోబర్‌ 19 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): దళితబంధు అంశంలో ప్రజలను రెచ్చగొడుతూ బీజేపీపై  తప్పుడు ప్రచారం చేస్తున్న టీఆర్‌ఎస్‌ నాయకులపై, అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న జమ్మికుంట, కమలాపూర్‌ పోలీసు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ప్రతినిధుల బృందం కేంద్ర ఎన్నికల పరిశీలకులను కోరింది.  ఈ మేరకు మాజీ ఎంపీ, బీజేపీ హుజురాబాద్‌ ఉప ఎన్నికల ఇన్‌చార్జి  జితేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ ప్రతినిధుల బృందం  కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో మంగళవారం కేంద్ర ఎన్నికల పరిశీలకులను కలిసి  ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ దళిత బంధు అంశంలో ప్రజలను రెచ్చగొడుతూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను లక్ష్యంగా పెట్టుకొని  టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి, ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న జమ్మికుంట, కమలాపూర్‌ సీఐలను విధుల నుంచి తప్పించాలని కోరారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి అనేక కార్యక్రమాలు చేపడుతున్నా అధికారులు చూసీచూడనట్లు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్నారు. మంత్రి హరీష్‌రావు డైరెక్షన్‌లో విధులు నిర్వహిస్తున్న సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని కేంద్ర పరిశీలకులకు వివరించారు. ఎన్నికల విధులు సజావుగా నిర్వహించకుండా ప్రభుత్వానికి ఏజెంట్లుగా కొంత మంది అధికారులు వ్యవహరిస్తున్నారని, వారందరిపై తగిన చర్యలు తీసుకొని వెంటనే విధుల నుంచి తప్పించాలని కోరారు.  కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ చాడ సురేశ్‌రెడ్డి, మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-20T05:02:06+05:30 IST