ఇంటర్నెట్ డెస్క్: ఒక్క ఐడియాతో జీవితం మారిపోవచ్చని అంటుంటారు. రాజస్థాన్‌కు(Rajasthan) చెందిన భవరామ్ జీవితం చూస్తే ఇది నిజమనిపించకమానదు. జాలోర్(Jalore) జిల్లా పల్దీ గ్రామానికి చెందిన భవరామ్ కేవలం ఎనిమిదో తరగతి వరకే చదువుకున్నాడు. ఒకప్పుడు అతడు కూలి పనులకు వెళ్లి పొట్టపోసుకునేవాడు. ఓ రోజు యూట్యూబ్ చూస్తుండగా కంటపడిన వీడియో(Youtube Video) అతడి జీవితాన్నే మార్చేసింది. ఆ తరువాత అతడు లక్షల్లో సంపాదించడం ప్రారంభించాడు. అతడి సక్సెస్ స్టోరీ ఏంటంటే..
ఒకప్పుడు కూలీ పనులకు వెళ్లిన తాను డబ్బులు సరిపోక ఇబ్బంది పడేవాడినని భవరామ్ చెప్పుకొచ్చాడు. ‘‘చాలా సార్లు ఈ పని మానేయాలని నాకు అనిపించేది. కానీ..పని మానేస్తే పూట గడవడం ఎలాగో అని ఆందోళన చెందే వాడిని. ఇలాంటి పరిస్థితుల్లో ఓ రోజు యూట్యూబ్‌లో వీడియో చూస్తుండగా.. బొప్పాయి పళ్లకు సంబంధించి వీడియో ఒకటి నా కంట పడింది.’’ అని భవరామ్ చెప్పుకొచ్చాడు. తైవాన్‌కు చెందిన రెడ్ లేడీ రకం బొప్పాయి పళ్ల(Taiwanese redlady variety) సాగు గురించి ఆ వీడియోలో ఉంది. అధిక రాబడులను ఇచ్చే బొప్పాయి రకాల్లో ఇదీ ఒకటి. తక్కువ ఖర్చుతోనే మంచి లాభాలు కళ్లచూడొచ్చు. దీంతో.. భవరామ్ రంగంలోకి దిగిపోయాడు. గుజరాత్‌లో కూడా ఈ రకం పళ్లు ఉంటాయని తెలియడం అతడికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది.
గతేడాది జూన్ నెలలో 2.5 ఎకరాల్లో అతడు రెడ్‌లేడీ బొప్పాయి పళ్ల సాగు మొదలెట్టాడు. ఒక్కో మొక్క రూ. 25 చొప్పున 2500 మొక్కలకు ఆర్డరిచ్చాడు. నీటి వినియోగం తగ్గించుకునేందుకు డ్రిప్ విధానాన్ని ఫాలో అయ్యాడు. సేంద్రీయ ఎరువులనే ఎక్కువగా వినియోగించాడు. అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో ఆరు నెలలకే పంట చేతికొచ్చింది. ఆ ఏడాది అతడు కళ్లు చెదిరేంతటి లాభాలు ఆర్జించాడు. ఇప్పటివరకూ తాను కోటి రూపాలయ విలువైన పళ్లను అమ్మినట్టు భవరామ్ మీడియాకు తెలిపారు. ఇక మార్కెట్‌లో ధర తక్కువగా ఉన్న సమయాల్లో తానే స్వయంగా పళ్లు అమ్ముకునే వాడినని అతడు చెప్పుకొచ్చాడు. రెడ్‌లేడీ బొప్పాయి రుచి ప్రజలకు నచ్చడంతో రోజుకు 5 క్వింటాళ్ల వరకూ పళ్లు అమ్మేవాడినని తెలిపాడు. కేవలం 25 రూపాయలు ఖరీదు చేసే మొక్క తనను ఊహించని విధంగా సంపన్నుడిని చేసిందంటూ మురిసిపోయాడు . ఇక భవరామ్ సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకున్న రైతులు కూడా ఈ మార్గాన్నే ఎంచుకున్నారు. అతడి సలహాలు సూచనలు అనుసరిస్తూ ముందుకెళుతున్నారు.
ఇవి కూడా చదవండి