తాయిలాలు.. చేయూతలు

ABN , First Publish Date - 2022-08-04T06:32:06+05:30 IST

ఎన్నికల్లో రాజకీయ పక్షాలు తాయిలాలు ప్రకటించడం, పంపిణీ చెయ్యడం వంటి అనైతిక కలాపాలపై సుప్రీంకోర్టు కేంద్రాన్ని వివరణ అడిగింది...

తాయిలాలు.. చేయూతలు

ఎన్నికల్లో రాజకీయ పక్షాలు తాయిలాలు ప్రకటించడం, పంపిణీ చెయ్యడం వంటి అనైతిక కలాపాలపై సుప్రీంకోర్టు కేంద్రాన్ని వివరణ అడిగింది. ఆ సంస్కృతికి అడ్డుకట్ట వెయ్యగలమా అని ప్రశ్నించింది. గతంలో ప్రధాని కూడా తాయిలాల సంస్కృతిపై ఆందోళన వెలిబుచ్చారు. ఎన్నికల కమిషన్ వాటిని అడ్డుకోవడం తన పరిధికి మించిన వ్యవహారమని అభిప్రాయపడింది. ఓటర్లను ఆకర్షించడానికి తాయిలాలు ప్రకటించడం అన్నది అనైతికమే కావచ్చు, కానీ ప్రకటించిన హామీలు తాయిలాల కేటగిరీకి వస్తాయో, రావో ఎవరు నిర్ణయిస్తారు?


ఇంటింటికీ కలర్ టీవీలో, గ్రైండర్లో ఇస్తామంటే అవి ప్రలోభాలని చెప్పగలం. కానీ అన్నిటినీ అదే గాటన కట్టలేం. ఆర్థిక సంఘం కూడా ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు. అందులోనూ ఈ మధ్యన సామాజిక భద్రత కోణంలో పేదవాడికి చేస్తున్న సాయాన్ని కూడా తాయిలాలంటూ వివాదాస్పదం చేస్తున్నారు. ఒక వృద్ధునికి, అనాథకు పింఛను ఇచ్చి, వారు గౌరవంగా బ్రతికే హక్కుని కాపాడడం దయాభిక్ష కార్యక్రమం కాదు బాధ్యత. అలాగే విద్య, ఆరోగ్యం అన్నవి నాణ్యంగా, చౌకగా అందరికీ అందుబాటులోకి రావాలి. వాటిని ఉచితంగానో, రాయితీలతోనో ఎంత ఎక్కువమందికి అందిస్తే అంత మంచిది. జీవనప్రమాణాలు పెంచే కార్యక్రమాలు, వాటిపై వెచ్చించే ఖర్చు పనికిరానిది కాదు.. అది విలువైన పెట్టుబడి.. తెలివైన పెట్టుబడి. పేదరికం తీవ్రత తగ్గేవరకూ ఉపాధి అవకాశాలు, నైపుణ్యత అందించే పనులు ప్రభుత్వం పేదల పక్షపాత వైఖరితోనే చేపట్టాలి. అలాంటి వాటిని ప్రోత్సహించాలి. అంతే తప్ప అన్నింటిపై వృధా పథకాలుగా ముద్ర వేయరాదు. అలాంటి విధివిధానాలు హామీ ఇచ్చే రాజకీయపక్షాలపై ముకుతాడు వేయరాదు. సమాజంలో ఆర్థిక, సామాజిక సమానత్వం వచ్చే వరకూ రాజకీయ సమానత్వానికి విలువలేదని, ప్రజాస్వామ్యానికి కూడా ముప్పేనని అంబేడ్కర్ అన్నారు.


ప్రస్తుతం జనాభాలో సగం మందికి దేశ సంపదలో కేవలం ఆరు శాతం వాటా ఉంది. సంపన్నుల్లో పైవరుసలో నున్న 10శాతం మంది చేతిలోనే దేశ సంపద 75 శాతం ఉంది. ఈ అంతరాలు పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గడం లేదు. ఇప్పుడు ఆలోచించాల్సింది సంపన్నులు కొంచెం ఎక్కువ బాధ్యతను తీసుకొనేలా చూడడం ఎలా అన్నది. అంతేకానీ అశేషంగా ఉన్న పేదలకు చేయందించి పైకిలాగే విధానాలపై అక్కసు ప్రదర్శించడం మంచిది కాదు. అభివృద్ధి అంటే కొందరికి సౌకర్యాలు పెరగడం కాదు, అందరి జీవనప్రమాణాలు పెరిగి గౌరవంగా బ్రతికే అవకాశాలు మెరుగవ్వడం.


ఉచిత హామీలపై చర్చ జరగాల్సిందే. అయితే అది అర్థవంతంగా, ఆరోగ్యకరంగా ఉండాలి. పేదలకు ఇచ్చే పింఛను హామీలే కాదు పెద్దలకు, కార్పొరేట్లకు చాటుగా ఇచ్చే పన్ను రాయితీలు కూడా తాయిలాలే. లక్షల కోట్ల రూపాయల అప్పుల్ని బ్యాంకులు మాఫీ చెయ్యడం అన్నది కార్పొరేట్ కంపెనీలకు అందుతున్న అతిపెద్ద తాయిలం. అదొక్కటీ నియంత్రిస్తే ఎలాంటి హామీలనైనా తీర్చగలిగే శక్తి ప్రభుత్వ ఖజానాకు సాధ్యమౌతుంది. ఇలాంటి తాయిలాలకే మొదట అడ్డుకట్ట పడాలి.

డా. డి.వి.జి. శంకరరావు

Updated Date - 2022-08-04T06:32:06+05:30 IST