తహసీల్దార్లంటే.. అంత చులకనా..!

ABN , First Publish Date - 2021-12-03T23:56:50+05:30 IST

: వైసీపీ ప్రభుత్వ హయాంలో తహసీల్దార్లు ఒక విధంగా ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతలకు సహాయకులుగా మారిపోయారు.

తహసీల్దార్లంటే..  అంత చులకనా..!

 నచ్చితే ఓకే.. లేదంటే బదిలీ వేటు

శాసనసభ్యుడు చెబితే వెనువెంటనే చర్యలు

చెప్పిన పని అక్రమమైనా చేయకపోతే నానా దుర్భాషలు

తహసీల్దార్లు అందుబాటులో ఉన్నా కొన్ని మండలాల్లో డీటీలకు బాధ్యతలు

 

తహసీల్దార్‌ అంటే ఒక మండలానికి రెవెన్యూ అధికారి మాత్రమే కాదు... కార్యనిర్వాహక మేజిస్ట్రేట్‌ కూడా..! మండల పరిధిలో ఏమైనా శాంతిభద్రతల సమస్య వస్తే అందుకు తగిన చర్యలకు ఆదేశాలు జారీ చేసేది కూడా తహసీల్దారే. అలాంటి కీలకమైన తహసీల్దార్‌ జిల్లాలో చులకనైపోయారు. ఒకప్పుడు ఎమ్మెల్యేలే తహసీల్దార్‌ కార్యాలయాలకు వెళ్లి సమస్యలు నివేదించి పరిష్కరించమని అడిగేవారు. నేడు అది రివర్స్‌ అయిపోయింది. తహసీల్దార్‌ పొద్దున లేచినప్పటి నుంచి స్థానిక ఎమ్మెల్యేకి అందుబాటులో ఉండాలి. ఆయనకు ప్రొటోకాల్‌ పాటించాలి. ఏదైనా మండలంలో పోస్టింగ్‌ కావాలంటే ఆ ఎమ్మెల్యే నుంచే లేఖ తెచ్చుకోవాలి.  


గుంటూరు, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో తహసీల్దార్లు ఒక విధంగా ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతలకు సహాయకులుగా మారిపోయారు. తమ నియోజకవర్గంలోని మండలాల్లో ఏ తహసీల్దార్‌ ఉండాలో ఎమ్మెల్యేలే నిర్ణయిస్తున్నారన్న విషయం బహిరంగ రహస్యమే. ఈ కారణంగా వారు ఏ పని చెబితే అది చేసేయాలి. లేదంటే నానా దుర్భాషలు పడాల్సి ఉంటుంది. ఏమాత్రం ఎదురు తిరిగినా సెలవు పెట్టి వెళ్లిపొమ్మని ఆదేశాలు జారీచేస్తారు. లేదంటే బదిలీ వేటు. ఇంకా వ్యక్తిగతంగా తీసుకొంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి విధుల నుంచి సస్పెన్షన్‌ చేయిస్తారు. ఈ విధంగా జిల్లాలో పలువురు తహసీల్దార్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఇటీవలకాలంలో జరిగిన ఘటనలు అందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. 

రెండునెలల క్రితం చేబ్రోలు తహసీల్దార్‌పై వైసీపీ నేతలు ఫిర్యాదు చేసిందే తడవుగా ఆగమేఘాలపై సస్పెన్షన్‌ చేశారు. ఆ తర్వాత విచారణ జరిపి నివేదికని హైకోర్టుకు నివేదించారు. కాగా అదే తహసీల్దార్‌ని ఇటీవలే కలెక్టరేట్‌లో పోస్టింగ్‌ ఇచ్చారు. పెదకూరపాడు తహసీల్దార్‌ పాత తేదీలతో పాఠశాల ప్రాంగణంలో అనధికారికంగా నిర్మించిన ఆర్‌బీకే, సచివాలయ భవనాలకు భూమిని కేటాయించలేదని నానా దుర్భాషలాడి సెలవులోకి వెళ్లేలా చేశారు. క్రోసూరు మండలంలో అయితే పూర్తిస్థాయి తహసీల్దార్‌ని విధులు నిర్వహించనీయడం లేదు. ఒక మహిళా తహసీల్దార్‌ని నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేయడంతో ఆమె కలెక్టరేట్‌కి వచ్చి కన్నీళ్లు పెట్టుకొన్నారు. ఆ మండలంలో డీటీని ఇప్పటికి మూడుసార్లు ఇన్‌ఛార్జ్‌ తహసీల్దారుగా నియమించారు. మూడునెలలకు మించి ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు ఇవ్వకూడదని సీసీఎల్‌ఏ ఆదేశాలున్నా పట్టించుకోవడం లేదు. దాచేపల్లి మండలంలో ఇలాంటి పరిస్థితే. అక్కడ పక్క మండలంలో తహసీల్దార్‌ ఉన్నప్పటికీ అతనికి ఇన్‌ఛార్జ్‌ ఇవ్వకుండా డీటీని కొన్ని నెలలుగా ఇన్‌ఛార్జ్‌ తహసీల్దార్‌ పోస్టులో కూర్చోబెట్టి కొనసాగిస్తున్నారు. ఒక తహసీల్దార్‌ని అయితే తొలుత అమరావతి నుంచి కొల్లూరుకు బదిలీ చేశారు. ఆ తర్వాత కొల్లూరు నుంచి గుంటూరు కలెక్టరేట్‌కి మార్చారు. బాపట్ల మండలంలో అయితే డీటీ ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్నారు. ఇటీవలే కారంపూడి తహసీల్దార్‌ దీర్ఘకాలిక సెలవులోకి వెళ్లిపోయారు. పెదకాకాని తహసీల్దార్‌కు 100 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న శావల్యాపురం మండలం ఇన్‌ఛార్జ్‌గా పెట్టారు. అలానే కాకుమాను తహసీల్దార్‌ని గుంటూరు పశ్చిమకి ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. ఈ విధంగా తహసీల్దార్‌లని బంతి ఆట ఆడినట్లుగా బదిలీలు చేసేస్తున్నారు. ప్రస్తుతం స్పెషల్‌ సమ్మరి రివిజన్‌ జరుగుతోంది. ఇది లేకపోయి ఉంటే మరో 15 మందిని బదిలీ చేయడానికి ఎమ్మెల్యేలు లెటర్లు ఇచ్చినట్లు సమాచారం. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో తహసీల్దార్లు గుంటూరు జిల్లాలో పోస్టింగ్‌ అంటే భయపడిపోయే పరిస్థితి ఏర్పడటం ఖాయం. 

Updated Date - 2021-12-03T23:56:50+05:30 IST