‘డబుల్‌’ ఇళ్లు..పరిశీలన మొదలు..

ABN , First Publish Date - 2022-07-22T16:19:13+05:30 IST

మహానగరంలోని నిరుపేదలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న రెండు పడకల ఇళ్ల కేటాయింపు దిశగా అడుగులు పడుతున్నాయి. మంత్రి కేటీఆర్‌

‘డబుల్‌’ ఇళ్లు..పరిశీలన మొదలు..

నియోజకవర్గాల వారీగా దరఖాస్తులను వేరు చేస్తోన్న సిబ్బంది

తొలి దశలో ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కు వెయ్యి మంది ఎంపిక

మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో ఇళ్ల కేటాయింపు దిశగా అడుగులు 


హైదరాబాద్‌ సిటీ: మహానగరంలోని నిరుపేదలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న రెండు పడకల ఇళ్ల కేటాయింపు దిశగా అడుగులు పడుతున్నాయి. మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో అధికారులు లబ్ధిదారుల ఎంపిక కసరత్తు ప్రారంభించారు. అసెంబ్లీల వారీగా దరఖాస్తులను వేరు చేసే ప్రక్రియను జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఏడో అంతస్తులో ప్రారంభించారు. అధికారుల సమక్షంలో సిబ్బంది వివరాలను కంప్యూటర్‌లో ఎంటర్‌ చేస్తున్నారు. రెండు వారాల క్రితం జీహెచ్‌ఎంసీ, గృహ నిర్మాణ శాఖ, ఇతర విభాగాలతో సమావేశమైన కేటీఆర్‌.. లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించారు. దీంతో అధికారులు నాలుగేళ్ల క్రితం వచ్చిన దరఖాస్తుల బూజు దులిపి బయటకు తీశారు. 

6 లక్షలకుపైగా.. 

2018 అసెంబ్లీ ఎన్నికల ముందు నగరవాసులు మీ సేవా కేంద్రాలు, కలెక్టరేట్ల వద్ద బారులు తీరి దరఖాస్తులు సమర్పించారు. గ్రేటర్‌ పరిధిలోని 24 నియోజకవర్గాల నుంచి (మహేశ్వరం, పటాన్‌చెరు అసెంబ్లీల పరిధిలోని కొన్ని ప్రాంతాలు) 6 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. కలెక్టరేట్లు, మీ సేవా కేంద్రాల్లో సమర్పించిన దరఖాస్తులను ఇటీవల జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చారు. హైదరాబాద్‌ జిల్లాకు సంబంధించి 15, మేడ్చల్‌, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధుల్లోని 9 నియోజకవర్గాల వారీగా దరఖాస్తులు వేరు చేస్తున్నారు. ప్రాంతాన్నిబట్టి ఏ నియోజకవర్గం పరిధిలోకి వస్తుందన్నది గుర్తిస్తున్నారు. 60 శాతం దరఖాస్తులు వేరు చేయడం పూర్తయ్యిందని జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారొకరు తెలిపారు. శివార్లలోని బోడుప్పల్‌, పీర్జాదిగూడ, మీర్‌పేట, జల్‌పల్లి, మణికొండ, నార్సింగ్‌ మునిసిపాల్టీల పరిధుల్లోని ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను ఆయా స్థానిక సంస్థలకు పంపుతున్నట్టు జీహెచ్‌ఎంసీ వర్గాలు పేర్కొన్నాయి. 


క్షేత్రస్థాయిలో పరిశీలించి..

లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను రెవెన్యూ విభాగం చేపట్టనుంది. నియోజకవర్గాల వారీగా స్థానిక తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బంది సహకారంతో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించనున్నారు. ఇళ్లు లేని వారికి మాత్రమే ఆత్మగౌరవ గృహాలు కేటాయిస్తామని అధికారులు చెబుతున్నారు. కేటాయింపునకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు ఇంకా రానప్పటికీ.. త్వరలో వెలువడే అవకాశముందని, వాటి ఆధారంగానే ఎంపిక ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం నివాసం ఉంటోన్న ప్రాంతాలకు సమీపంలోని ఇళ్లను కేటాయించే అవకాశముందని చెబుతున్నారు. గతంలో ప్రభుత్వం నుంచి పక్కా ఇళ్లు పొందిన పలువురి ఆధార్‌ కార్డుల వివరాలు రెవెన్యూ విభాగం సేకరించినట్టు సమాచారం. 360 డిగ్రీస్‌ సర్వేలో భాగంగా గతంలో లబ్ధిపొందిన వారి జాబితా కూడా సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈ జాబితాలో ఉన్న వారు మళ్లీ దరఖాస్తు చేస్తే తిరస్కరించనున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రయోజనం లక్ష్యంగానే సర్కారు దరఖాస్తుల పరిశీలన చేపట్టిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 


దరఖాస్తు చేయని వారి పరిస్థితేంటి?

గత దరఖాస్తులను ప్రామాణికంగా తీసుకున్న పక్షంలో ఇప్పటి వరకూ దరఖాస్తు చేయని వారి పరిస్థితేంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. నగరంలో లక్షల మందికి సొంతిళ్లు లేవు. వారిలో చాలామంది సమాచారం లేక దరఖాస్తు చేయలేదు. నాలుగేళ్లలో వివాహం చేసుకొని వేరుగా ఉంటోన్న వారూ ఉన్నారు. అలాంటి వారు ఏం చేయాలన్న దానిపై అధికారులు స్పష్టమైన సమాధానం చెప్పడం లేదు. ప్రస్తుతం దరఖాస్తు చేసుకునే అవకాశం లేదని కలెక్టరేట్‌ వర్గాలు చెబుతోన్న నేపథ్యంలో గూడులేని మేమేం చేయాలని నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


60 వేల ఇళ్లు సిద్ధం

గ్రేటర్‌లో లక్ష ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 98 వేల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కాగా.. ఇప్పటి వరకు 60 వేలు పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. ఇందులో  5 వేలకుపైగా ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు. స్థల వివాదాలు, కోర్టులో కేసుల విచారణ నేపథ్యంలో రెండువేల ఇళ్ల నిర్మాణం మొదలు కాలేదు. లబ్ధిదారులకు కేటాయించిన 5 వేల ఇళ్లు పోను.. దాదాపు 55 వేల ఇళ్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. తొలి విడతగా నియోజకవర్గానికి 1000 చొప్పున కేటాయించాలని సర్కారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొదటి దశ పంపిణీ అనంతరం.. రెండో విడత మొదలు పెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. 

Updated Date - 2022-07-22T16:19:13+05:30 IST