Abn logo
Aug 4 2021 @ 01:34AM

ఎమ్మెల్యే పెద్దారెడ్డి ప్లాన్ ఇదేనా..!

అధికార పెత్తనం.. యంత్రాంగం సలాం..!

మున్సిపల్‌ చైర్మన్, ఎమ్మెల్యేల మధ్య రాజకీయ వైరం

పోటాపోటీగా అధికార సమీక్షలు

ఇబ్బందిపడుతున్న ఉద్యోగులు

మున్సిపాల్టీపై పట్టు కోసం ఎమ్మెల్యే యత్నం

అధికారులను కట్టడి చేయడం వ్యూహంలో భాగమేనా..?

చైర్మన్ నిరసనపైనా స్పందించని ఉన్నతాధికారులు


అనంతపురం(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొందరు అధికారులు అధికార పార్టీ నాయకులు ఏం ఆదేశించినా తలూపుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అది రెవెన్యూ అయినా పోలీసు శాఖలోనైనా అధికార పార్టీ నేతల హుకుంకు సలాం చేస్తున్నారన్న విమర్శలున్నాయి. మొన్నటికి మొన్న ఓ రైతు విద్యుత్ కోతలపై ఓ లైన్‌మెన్‌తో ఫోనలో మాట్లాడిన సంభాషణ ఆధారంగా అతడిపై కేసును నమోదు చేశారంటే ఆ పోలీసులపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ఏ మేరకు ఉన్నాయన్నది తేటతెల్లమవుతోంది. తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మీసం మెలేసి మాట్లాడిన తీరును తప్పుబడుతూ ఆయనపైనా కేసు నమోదు చేశారు. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అదే చైర్మన్‌పై ఎన్ని మాటలు మాట్లాడినా కేసు నమోదు చేయలేని పరిస్థితిలో పోలీసులు ఉన్నారంటే జిల్లాలో అధికార పార్టీ నేతలు ఏమి చెప్పినా జీ హుజూర్‌ అంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


తాజాగా గత రెండ్రోజులుగా తాడిపత్రి కేంద్రంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే అక్కడి అధికారులు అధికార పార్టీ నేతలకు ఎంతలా వంత పాడుతున్నారో అర్థమవుతుంది. మున్సిపల్‌ చైర్మన్ హోదాలో జేసీ ప్రభాకర్‌రెడ్డి సోమవారం మున్సిపల్‌ కార్యాలయంలో పట్టణాభివృద్ధి, ఇతర అంశాలపై సమావేశం ఉంటుందని, ఆ సమావేశానికి మున్సిపల్‌ అధికారులందరూ హాజరుకావాలని మున్సిపల్‌ అధికారులకు సమాచారం పంపారు. అనుకున్నట్లుగానే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఉదయం 11 గంటలకు మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లారు. ఆయన అక్కడకు వెళ్లినప్పటికీ కమిషనర్‌తో పాటు ముఖ్యమైన అధికారులందరూ కార్యాలయంలో లేకపోవడంతో కిందిస్థాయి సిబ్బందితో ఆరా తీశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆదేశాల మేరకు అధికారుందరూ అక్కడికి వెళ్లారని చెప్పడంతో జేసీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారులు వచ్చేంత వరకూ కార్యాలయంలో నుంచి కదిలేది లేదంటూ అక్కడే కూర్చొని నిరసనకు దిగారు.


చైర్మన్ కార్యాలయంలోనే తిష్ట వేసి అధికారుల తీరును తప్పుబడుతూ నిరసన వ్యక్తం చేస్తున్నానని అధికారులకు సమాచారం ఇచ్చినా ఒక్క అధికారి కూడా అక్కడికి వచ్చి తొంగిచూసిన పాపానపోలేదు. సాయంత్రం 5 గంటలైనా ఎవరూ అటువైపు రాలేదు. దీంతో ఆయన తన పార్టీ కౌన్సిలర్లతో కలిసి ఆ రాత్రికి అక్కడే నిద్రపోవడం, ఉదయం అక్కడే స్నానం చేసి తన నిరసన కొనసాగించారు. చివరికి మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో కమిషనర్‌ పోలీసు బందోబస్తుతో కార్యాలయానికి రావడం, ఆ తరువాత చైర్మన్‌తో మాట్లాడటం, సమావేశం ఏర్పాటు చేసుకోవడం వరుసగా జరిగి పోవడంతో 24 గంటల తరువాత జేసీపీఆర్‌ నిరసనకు తెరపడిన విషయం తెలిసిందే. 


చేజారిన మున్సిపాల్టీపై పట్టు కోసమేనా..! 

తాడిపత్రి మున్సిపాల్టీపై వైసీపీ జెండా ఎగురేస్తామని పలు సందర్భాల్లో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. ఇదే క్రమంలో ఆయన కుమారుడు మున్సిపల్‌ చైర్మన్ పీఠంపై కూర్చోనున్నారని ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆ ఎన్నికల్లో అనూహ్య పరిణామాల నేపథ్యంలో మున్సిపాల్టీని టీడీపీ చేజిక్కించుకుంది. మున్సిపల్‌ చైౖర్మన్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎన్నికైన విషయం తెలిసిందే. మున్సిపాల్టీ చేజారడంతో ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు అప్పట్లో ప్రచారం సాగింది. రాష్ట్రంలో ఒకే మున్సిపాల్టీ టీడీపీకి దక్కడం, అందులోనూ జేసీ కోటకు బీటలు వారాయనే క్రమంలో తాడిపత్రి మున్సిపాల్టీపై పట్టు నిలుపుకోవడంతో  జేసీపీఆర్‌కి ప్రశంసలు వెల్లువెత్తాయి. వైసీపీకి ఇది జీర్ణించుకోలేని పరిణామంగా మారింది. ఏ విధంగానైనా చేజారిన మున్సిపాల్టీపై పట్టు సాధించేందుకు ఎమ్మెల్యే ఆది నుంచి తహతహలాడుతున్నట్లు తెలుస్తోంది.


మున్సిపల్‌ చైర్మన్‌ను ఇరుకున పెట్టే విధంగా వ్యవహరించాలనే వ్యూహానికి ఆయన పావులు కదిపేందుకు సిద్ధపడినట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం. మున్సిపాల్టీపై పట్టు కోల్పోతే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆ ప్రభావం చవిచూడాల్సి వస్తోందన్న అభిప్రాయం నేపథ్యంలోనే అధికారులను తన గుప్పిట్లో పెట్టుకోవాలన్న ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే... జేసీ ప్రభాకర్‌రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశానికి అధికారులెవరూ వెళ్లకుండా... అదే సమయంలో సమావేశం ఏర్పాటు చేసి వారందరిని అక్కడికి మళ్లించారనే విమర్శలు లేకపోలేదు. అధికారులు మున్సిపల్‌ చైర్మన్ సమావేశానికి గైర్హాజరు కావడంపై రాజకీయ వర్గాలే కాదు... సామాన్య ప్రజలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 


ఉన్నతాధికారులు స్పందించకపోవడంలో ఆంతర్యమేంటో...?

మున్సిపల్‌ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం ఉంటుందని, అధికారులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని ముందస్తు సమాచారం ఇచ్చినా ఏ ఒక్క అధికారి ఆ సమావేశానికి హాజరుకాలేదు. దీంతో అధికారుల తీరును నిరసిస్తూ చైర్మన్ జేసీపీఆర్‌ కార్యాలయంలోనే నిరసనకు దిగారు. ఇదే విషయాన్ని ఆయన మున్సిపల్‌ ఆర్డీతో పాటు ఆర్డీఓకు సమాచారం అందించారు. అయితే ఏ ఒక్క ఉన్నతాధికారి ఆయన నిరసనపై స్పందించకపోవడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. ఉన్నతాధికారులు సైతం స్పందించలేదంటే వారిపైనా, అధికార పార్టీ ముఖ్య నేతల ఒత్తిళ్లు ఉన్నాయేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


ప్రతిపక్ష పార్టీ చైర్మన్ కదా.. అంత సీరియ్‌స్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని భావించి ఉండొచ్చన్న అభిప్రాయమూ లేకపోలేదు. ఒక మున్సిపల్‌ చైర్మన్ ఆ మున్సిపల్‌ అధికారుల తీరును తప్పుబడుతూ నిరసన వ్యక్తం చేస్తున్న తరుణంలో ఉన్నతాధికారులు స్పందించాల్సిన ఆవశ్యకతను పలు వర్గాలు గుర్తు చేస్తుండటం గమనార్హం. ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన మున్సిపల్‌ అధికారులు సాయంత్రం వరకూ కార్యాలయానికి రాకపోవడం చూస్తే... ఉద్దేశపూర్వకంగానే సహాయ నిరాకరణ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన సమావేశం గంటో రెండు గంటలుండవచ్చు. ఆ సమావేశం పూర్తవగానే... తిరిగి కార్యాలయానికి వచ్చి ఉంటే వివాదం ఇందాక వచ్చేది కాదన్న అభిప్రాయం పలు వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. అధికారులను కార్యాలయానికి వెళ్లకుండా బలవంతంగా అధికార పార్టీ నేతలే అడ్డుకున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. 


పట్టు వదలని జేసీపీఆర్‌ 

అధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన తరువాతనే ఇక్కడి నుంచి కదిలేదని జేసీపీఆర్‌ భీష్మించుకుని కూర్చున్న విషయం తెలిసిందే. పట్టణాభివృద్ధి, ఇతరత్రా అంశాలపై కమిషనర్‌, ఇతర అధికారులతో కలిసి చర్చించేంత వరకూ కదలనంటూ జేసీపీఆర్‌ సోమవారం ఉదయం 11 గంటల నుంచి కార్యాలయం ఆవరణలోనే తిష్టవేశారు. రాత్రి అక్కడే భోజనం చేశారు. అక్కడే నిద్రపోయారు. ఉదయం అక్కడే స్నానం చేశారు. చివరికి కమిషనర్‌ 11 గంటల సమయంలో పోలీసు భద్రతతో అక్కడికి చేరుకొని జేసీపీఆర్‌తో చర్చించి ఆ తరువాత సమావేశం నిర్వహించారు. దీంతో జేసీపీఆర్‌ అనుకున్నది సాధించారనే అభిప్రాయం సర్వత్రా చాటింది.


ఆడకత్తెరలో పోకచెక్కలా అధికారుల పరిస్థితి...

ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డిల మధ్య రాజకీయ ఆధిపత్య పోరుతో అధికారుల పరిస్థితి అటు నుయ్యి.... ఇటు గొయ్యి అన్న చందంగా మారింది. ప్రొటోకాల్‌ ప్రకారం మున్సిపాల్టీ అధికారులు చైర్మన్‌ను ఫాలో కావాల్సిన అవసరముంది. అయితే ఇక్కడ చైౖర్మన్ ప్రతిపక్ష టీడీపీకి చెందిన నాయకుడు కావడం, ఎమ్మెల్యే అధికార పార్టీకి చెందిన వారు కావడంతో... ఆడకత్తెరలో పోకచెక్కలా అధికారుల పరిస్థితి తయారైంది. అధికార పార్టీ నేతల ఆదేశాలు పాటించకపోతే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలోనన్న అభద్రతాభావంలో అధికారులున్నారు. ప్రొటోకాల్‌ మేరకు చైర్మన్ ఆదేశాలను పాటించినా ఇబ్బందులు తప్పవనే అభిప్రాయంలో ఉన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న అధికారులకు ఉన్నతాధికారుల నుంచి భరోసా కొరవడిందన్న అభిప్రాయం ఆ వర్గాల నుంచి వినిపిస్తోండటం గమనార్హం. అధికారులు కార్యాలయానికి రాకపోవటంపై జేసీ ప్రభాకర్‌ రెడ్డి వారిపై పోలీస్‌స్టేషనలో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు, పోలీసులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.