Tadikonda: ఎమ్మెల్యే శ్రీదేవిని కాదని.. డొక్కాకు ఫుల్ పవర్స్!

ABN , First Publish Date - 2022-08-18T23:54:08+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఉన్న నియోజకవర్గం తాడికొండ. ప్రస్తుతం తాడికొండ ఎమ్మెల్యేగా ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు. వృత్తిరీత్య డాక్టర్ అయిన ఆమె...

Tadikonda: ఎమ్మెల్యే శ్రీదేవిని కాదని.. డొక్కాకు ఫుల్ పవర్స్!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati)లో ఉన్న నియోజకవర్గం తాడికొండ (Tadikonda). ప్రస్తుతం తాడికొండ ఎమ్మెల్యేగా ఉండవల్లి శ్రీదేవి (Undavalli Sridevi) ఉన్నారు. వృత్తిరీత్య డాక్టర్ అయిన ఆమె.. వైసీపీ నుంచి తొలిసారి పోటీ చేసినప్పటికీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే నియోజకవర్గంలోని ప్రతి మండలంలో స్వంత పార్టీ నేతలతో శ్రీదేవికి విభేదాలు ఉన్నాయి. చాలా సార్లు ఎమ్మెల్యే తీరును వ్యతిరేకిస్తూ వైసీపీ (Ycp) నేతలే రోడ్డెక్కడం, బహిరంగంగా మీడియాలో విమర్శలు చేయడం లాంటివి చేశారు. ఏకంగా తాడేపల్లి ప్యాలెస్‌కు ఫిర్యాదులు చేసే వరకు పరిస్థితులు వెళ్లాయి. 


దీంతో తాడికొండలో పార్టీ వ్యవహారాలు చక్కబెట్టేందుకు అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే శ్రీదేవిని పక్కన పెట్టాలని భావించినట్లు సమాచారం. ఇకపై తాడికొండ వైసీపీ వ్యవహారాలు చూడాలని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ (Mlc Dokka Manikya varaprasad)కు అధిష్టానం ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. డొక్కా గతంలో తాడికొండ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. వైఎస్ హయాంలో మంత్రిగా కూడా పని చేశారు.  ప్రస్తుతం డొక్కా.. వైసీపీలో ఎమ్మెల్సీగా ఉన్నారు. గత అనుభవం దృష్ట్యా తాడికొండ వ్యవహారాలు చూడాలని డొక్కాకు జగన్‌రెడ్డి సూచించారట. తాడికొండలో వైసీపీని తిరిగి గాడిన పెట్టాలని ఆదేశించారట. 


ఇదిలావుంటే తాడికొండలో అడుగు పెట్టేందుకు ఎమ్మెల్సీ డొక్కా అధిష్టానం దగ్గర ఓ కండిషన్ పెట్టారట. ప్రస్తుతం తాడికొండలో ఎమ్మెల్యే ఉండగా తాను నియోజకవర్గంలో తిరిగితే ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారట. ప్రజల్లోకి వెళ్లినప్పుడు గ్రామ, మండల స్థాయిల్లో అధికారులతో పనులు చేయించాల్సి ఉంటుందని.. ఇలాంటి విషయాల్లో ఓ రకమైన పవర్ ఇవ్వాలని కోరారట. పనులు చేయించలేనప్పడు ప్రజల్లో చులకన అయిపోతానని అధిష్టానం పెద్దలకు చెప్పారట. ఈ క్రమంలో ఫుల్ పవర్స్ అప్పగిస్తే నెల రోజుల్లోనే తాడికొండలో పార్టీని గాడిలో పెడతానని హామీ ఇచ్చారట. అధిష్టానం అధికారం ఇవ్వకుండా నియోజకవర్గంలో తిరగలేనని స్పష్టం చేశారట. ఇక డొక్కా షరతులతో పార్టీ పెద్దలు కూడా ఆలోచనలో పడ్డారట. వచ్చే ఎన్నికల్లో తాడికొండ నుంచి డొక్కాని వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దింపే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. తాడికొండలో వైసీపీ గెలవాలంటే ఇప్పటి నుంచి కసరత్తు చేస్తేనే ఫలితం ఉంటుందని భావిస్తున్నారట. మరి తాడికొండను డొక్కాకు అప్పగిస్తే.. ప్రస్తుత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 



Updated Date - 2022-08-18T23:54:08+05:30 IST