Abn logo
Oct 28 2021 @ 23:12PM

తడి, పొడి తడబడి..!

బుచ్చిరెడ్డిపాళెంలో పంపిణీ చేసి మూడు రకాల డస్ట్‌బిన్లు (ఫైల్‌)

పూర్తిస్థాయిలో అమలుకాని ‘క్లాప్‌’

ఇంతవరకు ఇళ్లకు చేరని డస్ట్‌బిన్లు

పథకం ఆరంభంలోనే బాలారిష్టాలు


క్లీన ఆంధ్రప్రదేశ (క్లాప్‌) అన్నారు.. ప్రతి ఇంటి నుంచి వేరు చేసిన తడి, పొడి చెత్తను సేకరించడమే లక్ష్యమన్నారు. ప్రమాదకర ఎలకా్ట్రనిక్‌ వ్యర్థాలను కూడా వేరుగా సేకరించి రీసైక్లింగ్‌ చేసి సంపద సృష్టిస్తామని ప్రగల్బాలు పలికారు. ఇందుకోసం ప్రతి ఇంటికీ డబ్బాలు (డ్‌స్టబిన్లు) అందజేస్తాం. ప్రత్యేకంగా చెత్త వాహనాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రజలు కూడా సహకరించి చెత్త పన్ను చెల్లించాలని ఆదేశించారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే అనుకున్న లక్ష్యమే క్షేత్రస్థాయిలోకి వచ్చే సరికి గాడి తప్పుతోంది. నెల్లూరు కార్పొరేషనతోపాటు జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఇళ్లకు డబ్బాలు పూర్తిస్థాయిలో అందించలేదు. డబ్బాలు ఇవ్వకుండా తడి, పొడి, ఇతర వ్యర్థాలను వేర్వేరుగా ఉంచాలని చెబితే ఎలా సాధ్యమవుతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నా అధికారుల నుంచి సమాధానం లేదు. మరోవైపు ఈ పథకంలో భాగంగా చాలా వరకు వీధి చివరన ఉండే చెత్త డబ్బాలను తొలగించారు. దీంతో ఇటు చెత్త డబ్బాలు లేక, అటు ఎప్పుడు చెత్త సేకరణ వాహనాలు వస్తాయో తెలియక ప్రజలు ‘చెత్త’ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే చెత్త పన్ను వసూళ్లలో మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ దూకుడుగా వెళుతుండటం గమనార్హం. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ‘క్లాప్‌’ అమలు తీరును ఆంధ్రజ్యోతి బృందం పరిశీలించింది.

గూడూరు : మున్సిపాలిటీలో తడి, పొడిచెత్తను వేర్వేరుగా సేకరించే పథకం సక్రమంగా అమలు కావడంలేదు.  మున్సిపల్‌ పరిధిలో 84 వేల గృహాలు ఉండగా, తడి, పొడిచెత్తను సేకరించేందుకు 20వేల గృహాలకు డస్ట్‌బిన్లు (చెత్తబుట్టలు) అందజేశారు. త్వరలోనే మిగిలిన గృహాలకు డబ్బాలను అందజేసి పథకాన్ని పూర్తిస్థాయిలో అమలుపరిచేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. 

వెంకటగిరి : మున్సిపాలిటీ పరిధిలో డస్ట్‌బిన్ల పంపిణీ పూర్తిస్థాయిలో జరగలేదు. పట్టణంలోని 15వేల ఇళ్లకు గాను ఇప్పటివరకు 75 శాతం డస్ట్‌బిన్లు పంపిణీ చేశారు. ఈ నెలాఖరుకు 100 శాతం పంపిణీ పూర్తి చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. పట్టణ పరిధిలోని 6, 7 వార్డుల్లో పైలెట్‌ ప్రాజక్టు కింద తడి,పొడి చెత్త సేకరణ డోర్‌టూడోర్‌  నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.  

సూళ్లూరుపేట : తడి, పొడిచెత్తను వేరుగా సేకరించి చెత్తనుంచి సంపద తయారుచేయాల్సి ఉన్నా.. సూళ్లూరుపేట మున్సిపాలిటీలో ఆ ఊసేలేదు. 55వేలకు పైగా జనాభా, 12,891 గృహాలు ఉన్న మున్సిపాలిటీలో రోజుకు 16 నుంచి 18 టన్నుల చెత్తను సేకరిస్తుంటారు. మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన 8 ట్రాక్టర్లు చెత్తను జాతీయ రహదారిపక్కన కాళంగినది గట్టుపైకి తరలించి కుప్పగా వేస్తున్నాయి. అప్పుడప్పుడు ఈ చెత్తకుప్పను తగలబెడుతుండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. చెత్తనుంచి సంపద సేకరించాల్సిన మున్సిపాలిటీ చిత్తశుద్ధిలేక చెత్తను నది పక్కన వేస్తుండటంతో నదీజలాలు సైతం కలుషితమైపోతున్నాయి.

నాయుడుపేట : నాయుడుపేట మున్సిపాలిటీలో తడి, పొడిచెత్త వేరుగా సేకరించే పథకం టెండర్ల దశలో ఉంది. మున్సిపాలిటీలోని 25 వార్డుల్లో దాదాపు 65వేల జనాభా, 16 వేలు గృహాలు ఉన్నాయి. కొన్ని వార్డుల్లో మాత్రమే తడి, పొడి, రసాయన చెత్త సేకరణకు ఇంటింటికీ మూడు బుట్టలు పంపిణీ చేశారు. చెత్త సేకరణకు పట్టణంలో గృహానికి రూ.60, మురికివాడల్లో రూ.30 పన్ను ఉన్నట్లు సమాచారం ఉండటంతో అనేక ప్రాంతాల వాసులు వ్యతిరేకత తెలుపుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో రోజుకు దాదాపు 27 టన్నుల చెత్త సేకరణ జరుగుతోంది.

కావలి : మున్సిపాలిటీ పరిధిలో  40 వార్డులు ఉండగా ఇప్పటివరకు 3 వార్డుల్లోనే 1,500 కుటుంబాలకు  డస్ట్‌బిన్లు పంపిణీ చేశారు. తడి, పొడి, రసాయనిక చెత్తను వేరుచేసి ఇవ్వాలని అధికారులు కోరుతున్నా తమకు డబ్బాలు ఇస్తే పూర్తిస్థాయిలో చేస్తామని ప్రజలు చెబుతున్నారు.  చెత్త సేకరణ బండ్లతో  ఆయా ప్రాంతాలకు వలంటీర్లను పంపుతూ చెత్త వేరుచేసి తీసుకునే బాధ్యతలను అప్పగించారు. వారు ప్రజలకు అవగాహన కల్పిస్తూ డబ్బాల్లో ఇచ్చిన చెత్తను ఫొటోలు తీసి అధికారుల దృష్టికి తీసుకెళ్లుతున్నారు. అలాగే తడి, పొడి, హానికరమైన చెత్తకు సంబంధించి కరపత్రాలు ముద్రించి వాటిని ఇంటింటికి పంపిణీ చేశారు. ఆయా సచివాలయ శానిటరీ కార్యదర్శులు మైక్‌ ద్వారా ప్రచారం చేస్తున్నారు. మొత్తం మీద చెత్త వేరుచేసి తీసుకునే కార్యక్రమం ప్రారంభమైనా డబ్బాల కొరత కారణంగా పూర్తి స్థాయిలో అమలు జరగటం లేదు.

బుచ్చిరెడ్డిపాళెం : నగర పంచాయతీలో 10వేల కుటుంబాలు ఉండగా 8వేల కుటుంబాలకు డస్ట్‌బిన్లు అందజేశారు. అయితే, చెత్త సేకరణ మాత్రం జరగడం లేదు.

నెల్లూరు (సిటీ) : క్లాప్‌ ద్వారా నగరంలోని 54 డివిజన్లలో 36 డివిజన్లలోనే చెత్త సేకరణ జరుగుతోంది. డివిజనకు సుమారుగా 2,500 నివాసాలు లెక్కకట్టిన అధికారులు 90 వేల ఇళ్ల నుంచి నిత్యం వ్యర్థాలను సేకరిస్తున్నారు. మురికివాడల్లో ఇంటికి రూ.60, మురికి వాడలు కానివాటిలో ఇంటికి రూ.120 చొప్పున నెలకు యూజర్‌ చార్జీలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. తొలత 12 డివిజన్లను పైౖలెట్‌ ప్రాజెక్టుగా తీసుకుని దీనిని అమలు చేశారు. ఫలితాలు బాగుండటంతో ప్రస్తుతం 36 డివిజన్లలో ఇంటింటా చెత్తను సేకరిస్తున్నారు. దీనిపై వలంటీర్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.  సేకరించిన చెత్తను బోడిగాడితోట, దొంతాలి డంపింగ్‌ యార్డులకు తరలిస్తున్నారు. అక్కడ విడివిడిగా చెత్తను రీసైకిల్‌ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాలుష్య రహితంగా చెత్తను నిర్వీర్యం చేస్తున్నారు. నగరంలో మిగిలిన 18 డివిజన్లలోనూ ఇళ్ల నుంచి చెత్త సేకరణకు ప్రణాళిక తయారు చేస్తున్న అధికారులు ప్రభుత్వం నుంచి పూర్తిగా వాహనాలు అందిన వెంటనే మొదలుపెట్టేందుకు సిద్ధమయ్యారు.