అగ్ని-5 క్షిపణి పరీక్ష విజయవంతం

ABN , First Publish Date - 2021-10-28T08:27:13+05:30 IST

రక్షణ రంగంలో భారత్‌ మరో ఘనవిజయం సాధించింది. అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. సరిహద్దుల వద్ద చైనాతో..

అగ్ని-5 క్షిపణి పరీక్ష విజయవంతం

  • 5వేల కి.మీ.లోపు లక్ష్యాలను ఛేదించే సత్తా
  • వ్యూహాత్మక క్షిపణుల్లో మరో మైలురాయి
  • చైనాతో ఘర్షణల నేపథ్యంలో కీలక విజయం
  • పదేళ్లకుపైగా శ్రమించిన డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు

న్యూఢిల్లీ, అక్టోబరు 27: రక్షణ రంగంలో భారత్‌ మరో ఘనవిజయం సాధించింది. అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. సరిహద్దుల వద్ద చైనాతో తరచుగా ఘర్షణల నేపథ్యంలో అగ్ని-5 సక్సె్‌సకు ప్రాధాన్యం ఏర్పడింది. చైనా ఉత్తర భాగంలోని చిట్టచివరి ప్రాంతాలు సైతం అగ్ని-5 స్ట్రయిక్‌ రేంజ్‌లోకి వస్తాయి. ఈ మిసైల్‌ ఖండాంతర విధ్వంసక క్షిపణుల (ఐసీబీఎంలు) కేటగిరీలోకి వస్తుంది. 5వేల కిలోమీటర్ల పరిధిలోని ఉపరితల లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలగడం అగ్ని-5 క్షిపణి ప్రత్యేకత అని సంబంధిత అధికారులు తెలిపారు. అగ్ని సీరీ్‌సలోని 1 నుంచి 4 వరకు క్షిపణులు 700 కిలోమీటర్ల నుంచి 3,500 కిలోమీటర్ల వరకు లక్ష్యాలను మాత్రమే ఛేదించగలవు. ఈ నేపథ్యంలో అణు క్షిపణి సంపత్తిలో భారత్‌కు అగ్ని-5 మిసైల్‌ అత్యంత కీలక ఆయుధం కానుంది. ఒడిషా తీరంలోని ఏపీజే అబ్దుల్‌ కలాం ఐల్యాండ్‌ నుంచి అగ్ని-5ను పరీక్షించారు.


బుధవారం రాత్రి సుమారు 7-50 నిమిషాలకు క్షిపణి పరీక్ష జరిగింది. ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించడం ద్వారా అణు క్షిపణి రంగంలో చైనాకు భారత్‌ దీటుగా జవాబు ఇచ్చినట్టయిందని నిపుణులు భావిస్తున్నారు. డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలో దీన్ని రూపొందించారు. తొలిసారిగా 2012 ఏప్రిల్‌లో అగ్నిని పరీక్షించారు. మూడేళ్ల కిందట మరోసారి ఈ క్షిపణి పరీక్ష జరిగినట్టు సమాచారం. గత జూన్‌లో డీఆర్‌డీఓ అగ్ని ప్రైమ్‌ అనే కొత్త తరం క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. అత్యంత ఆధునిక నేవిగేషన్‌  సిస్టమ్‌, నియంత్రణ వ్యవస్థలతో ఈ క్షిపణిని రూపొందించారు.

Updated Date - 2021-10-28T08:27:13+05:30 IST