Abn logo
Nov 1 2020 @ 00:00AM

సినిమా నన్ను ఎంతో మార్చింది!

  • ఇంద్రజాలం చేసే అందం... చూపరులను మంత్రముగ్ధుల్ని చేసే అభినయం... ఆమె గురించి ఇంతకన్నా పెద్ద వివరణ అక్కర్లేదు. టబూగా ప్రేక్షకులకు సుపరిచితురాలైన పక్కా హైదరాబాదీ తబుస్సుమ్‌ ఫాతిమా హష్మీది ముప్ఫై ఎనిమిదేళ్ళ సినీ ప్రయాణం. తన కెరీర్‌లో ఆమె రెండు జాతీయ అవార్డుల్నీ, పద్మశ్రీ పురస్కారాన్నీ  అందుకున్నారు. అంతేకాదు ఏడు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు... వాటిలో నాలుగు క్రిటిక్స్‌ అవార్డులు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఇన్ని క్రిటిక్‌ అవార్డులు సాధించిన మరో నటుడు, నటి కానీ లేరు. చాలా ఏళ్ళ  తరువాత ‘అల వైకుంఠపురములో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆమె అలరించారు. తాజాగా టబూ నటించిన ‘ఏ సూటబుల్‌ బాయ్‌’ వెబ్‌సిరీస్‌ గత వారం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ నవంబర్‌ 4న యాభయ్యో పడిలో అడుగుపెడుతున్న టబూ ఆ వెబ్‌ సిరీస్‌ గురించీ, నటిగా తన ఎంపికల గురించీ పంచుకున్న విశేషాలు...‘‘నటిని కావడం గొప్ప అనుభవం. టీనేజర్‌గా ఉన్నప్పుడే ఈ పరిశ్రమలోకి వచ్చాను. విజయాలు పలకరించాయి. పరాజయాలు ఎదురయ్యాయి. అయితే సినిమా అనేక విషయాల్లో నా దృక్పథాన్నీ, అభిప్రాయాలనూ మార్చింది. వయసూ, అనుభవం పెరుగుతున్న కొద్దీ ఆకాంక్షలు రూపుదిద్దుకున్నాయి. ఇప్పుడు ఏ పరిస్థితులనైనా నేను సులువుగా ఎదుర్కోగలుగుతున్నాను. చాలా అంశాలను మరింత స్పష్టంగా విశ్లేషించుకొనే శక్తి నాకు సినిమాల నుంచే వచ్చింది. నేను నటించే తీరు మీద దాని ప్రభావం ఉంది. 


మొదట సంకోచించాను...

నా కెరీర్‌లో సవాల్‌గా భావించిన పాత్రల్లో ‘ఎ సూటబుల్‌ బాయ్‌’లోని సైదాబాయ్‌ ఒకటి. రెండేళ్ళ కిందట ఆ వెబ్‌సిరీస్‌ కోసం నన్ను సంప్రతించినప్పుడు, అది వేశ్య పాత్ర అని మొదట కాస్త సంకోచించినా, మీరానాయర్‌ దర్శకురాలు కాబట్టి ఆలోచించాల్సి వచ్చింది. మీరాతో కలిసి పధ్నాలుగేళ్ళ కిందట ‘ది నేమ్‌సేక్‌’ సినిమాలో నటించాను. అది ఝంపా లాహిరి రాసిన పుస్తకం ఆధారంగా తీశారు. నేను పని చేసిన మొదటి పెద్ద అంతర్జాతీయ ప్రాజెక్ట్‌. సినిమా, కళలు, జీవితం... వీటన్నిటి పైనా గొప్ప అవగాహన ఉన్న దర్శకురాలు మీరానాయర్‌. అందుకే సైదాబాయిగా నటించడానికి ‘సరే’ అన్నాను.

సైదాబాయి తన ఇంటికే ఎక్కువగా పరిమితమయ్యే మహిళ. కానీ మారుతున్న సామాజిక పరిమాణాల ప్రభావం ఆమెపై ఉంటుంది. కథలోని ఇతర పాత్రల కన్నా ఆమెది చాలా భిన్నమైన ప్రపంచం. ఆమెకంటూ ఒక విలక్షణమైన జీవితం, జీవనం ఉన్నాయి. అందుకే ఆ పాత్రను బాగా అవగాహన చేసుకోవడానికి కొంత సమయం తీసుకున్నాను. నవలలూ, రచనల ఆధారంగా తీసే సినిమాల్లో నటిస్తున్నప్పుడు దర్శకులు, స్ర్కిప్ట్‌ రచయితలు చెప్పినదాన్నే అనుసరిస్తాను. ఆ పుస్తకాలు చదవను. కానీ సైదాబాయ్‌ పాత్ర నాకో సవాల్‌గా కనిపించింది. అందుకే ఈ సిరీస్‌కు ఆధారమైన విక్రమ్‌ సేథ్‌ రచన ‘ఎ సూటబుల్‌ బాయ్‌’ని చదివాను. అది ఇరవయ్యేడేళ్ళ కిందట ప్రచురితమైన దాదాపు 1,350 పేజీల నవల. అది చదివాక, రచయిత దృక్పథం నుంచీ సైదాబాయి పాత్రనూ, ఆమె భావోద్వేగాలనూ మరింత తెలుసుకోవాలనిపించి, విక్రమ్‌ సేథ్‌ను కలిశాను. సైదాబాయి తెరమీద ఎలా కనిపించాలని మీరనుకుంటున్నారని అడిగాను, ఆయన సూచనలు తీసుకున్నాను. సైదాబాయ్‌ పాత్ర వస్త్రధారణ, ధరించే ఆభరణాలూ కూడా విలక్షణంగా ఉంటాయి. ఆ విషయంలో కూడా ఎంతో శ్రద్ధ తీసుకోవడానికి కొంతమేరకు నా అభిరుచులు కూడా ఉపయోగపడ్డాయి.


భావోద్వేగాలు అందరికీ ఒక్కటే...

‘ఎ సూటబుల్‌ బాయ్‌’ 1950ల కాలంలో జరిగే కథ. ఆ కాలానికి వేశ్యా వృత్తి క్రమేపీ అంతరించిపోతోంది. సైదాకు అది వారసత్వంగా వచ్చిన వృత్తి. అయితే ఆమె జీవితాన్ని సంగీతం, సాహిత్యం, కళలూ సుసంపన్నం చేశాయి. ఆమె తెరమీద వేశ్యలా కాకుండా కళాభిరుచి ఉన్న వ్యక్తిగా కనిపించాలి. ఆ పాత్రకోసం హార్మోనియం, తంబురా వాయించడం నేర్చుకున్నా. హార్మోనియం కాస్త కష్టం అనిపించింది. వాటికి సంబంధించిన దృశ్యాలు చిత్రీకరిస్తున్నప్పుడు తప్పుడు మెట్లు నొక్కడం లాంటి పొరపాట్లు చెయ్యకుండా... షూటింగ్‌ స్పాట్‌లో ఒక ట్యూటర్‌ ఉండేవారు. ఇక, ‘డెబ్భయ్యేళ్ళ కిందటి కథాంశం ప్రాసంగికత ఈ కాలంలో ఉందా?’ అనే ప్రశ్న నాకు ఎదురైంది. దానికి నేను చెప్పే జవాబు ఏమిటంటే... మన జీవితాల్లో ప్రేమ ఉంటుంది, విడిపోవడం ఉంటుంది. మనుషుల భావోద్వేగాలు అన్ని కాలాల్లోనూ, అన్ని ప్రదేశాల్లోనూ ఒకేలా ఉంటాయి. ఇప్పుడు కూడా ఉన్నాయి. మనుషులు భావోద్వేగాల ద్వారానే ఒకరితో ఒకరు ఐడెంటిఫై అవుతారు. అందుకే ఇది ఎన్నో విధాలుగా సార్వకాలికమైన  కథ!ఎప్పుడూ అదే ప్రశ్నా?

‘‘నన్ను ఇంటర్వ్యూ చెయ్యడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కొన్ని ప్రశ్నలు అయ్యాక, ‘మీ పెళ్ళెప్పుడు?’ అని అడుగుతూ ఉంటారు. దాదాపు పాతికేళ్ళ నుంచీ ఇదే ప్రశ్న ప్రతిసారీ అడగడం నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆ విషయం నేను పెద్దగా ఆలోచించను. జరిగినదీ, జరిగేదీ అంతా మంచికే అని భావిస్తాను. ఇక, నేను ప్రేమను మిస్‌ అవుతున్నానేమో నాకు తెలీదు. కానీ జీవితంలో ప్రేమ ఒక అద్భుతమైన అనుభూతి.’’


అందుకే ‘యశోద’నయ్యాను!

వెంకటేష్‌ హీరోగా నటించిన ‘కూలీ నెంబర్‌ 1’తో తెలుగులో నా నట జీవితం మొదలైంది. ఆ తరువాత తెలుగుతోపాటు హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ, ఇంగ్లీష్‌, మలయాళ చిత్రాల్లో నటించాను. చిన్నప్పటి నుంచీ తెలుగు సినిమాలతో ప్రేక్షకురాలిగా నాకు విడదీయలేని బంధం ఉంది. అందుకే తెలుగు సినిమాలో నటించడం అంటే చాలా ఉత్సాహంగా ఉంటుంది. చాలా ఏళ్ళ తరువాత ‘అల వైకుంఠపురములో’ సినిమాలో యశోద పాత్రతో ఈ ఏడాది తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాను. మళ్ళీ సొంత ఇంటికి తిరిగి వచ్చినట్టనిపించింది. యశోద పాత్ర గురించి దర్శకుడు త్రివిక్రమ్‌ చెబుతూ ఒక సన్నివేశాన్ని వివరించారు. తన భార్య బలానికీ, ఐశ్వర్యానికీ సరితూగనని యశోద భర్త పాత్ర (జయరామ్‌) ఒప్పుకొనే సన్నివేశం అది. భార్య ఎదుట భర్త అలా అంగీకరించిన సందర్భాలు భారతీయ సినిమాల్లో చాలా అరుదు. అలాగే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటించాలన్న కోరిక కూడా ఉంది. అందుకే యశోద పాత్రను అంగీకరించాను.’’


పోచంపల్లి మాస్కులు కొన్నా...

బెంగాల్‌, కశ్మీర్‌ ముస్లింలు ధరించే సంప్రదాయికమైన దుస్తులు, జందానీ, చందేరీ తరహా వస్త్రాలతో పాటు నా సొంతూరు హైదరాబాద్‌లో దొరికే హ్యాండ్‌లూమ్స్‌ కూడా నాకు ఇష్టం. మా అమ్మ, అమ్మమ్మల నుంచీ ఆ ఇష్టం వచ్చింది. హైదరాబాద్‌ వచ్చినప్పుడల్లా షాపింగ్‌ చేస్తూనే ఉంటాను. లాక్‌డౌన్‌ సమయంలో తెలంగాణ చేనేత కళాకారులు తయారు చేసిన పోచంపల్లి ఇకాత్‌ మాస్కులు కొనుక్కున్నాను.ఓటీటీల కోసం కథలు వింటున్నా...

నటిగా నాది అద్భుతమైన ప్రయాణం. ఇంతకాలం విజయవంతంగా ఈ రంగంలో కొనసాగుతానని నేనెప్పుడూ అనుకోలేదు. ఈ ప్రయాణంలో ఎత్తు పల్లాలు చూశాను. విజయాలు దక్కాయి. వైఫల్యాలు ఎదురొచ్చాయి. కష్టపడే తత్త్వం, సినిమా మీద ఇష్టం... ఇవే నన్ను ఇంతకాలం నడిపిస్తూ వస్తున్నాయి. నా తరం నటుల్లో... ఎంతో వైవిధ్యం ఉన్న సినిమాల్లో, గొప్ప దర్శకులతో పని చేసే అవకాశం దొరికిన కొద్ది మందిలో నేనొకర్ని. నటిగా నా పరిమితుల్ని అధిగమించడానికి రకరకాల జానర్ల చిత్రాలు ఎంపిక చేసుకున్నాను. అవి నాకు సృజనాత్మకమైన సంతృప్తిని అపారంగా అందించాయి. మంచి పాత్రల్లో నన్ను చూపించిన ఘనత దర్శకులదే. ఎలాంటి పాత్ర చేసినా నన్ను  ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు. ఇప్పుడు ఓటిటీ ప్రాజెక్టుల నుంచి ఆఫర్స్‌ వస్తున్నాయి. కథలు వింటున్నా. నన్ను బాగా ఆకట్టుకొనే కథా, పాత్రా దొరికితే చెయ్యడానికి సిద్ధమే!’’ ప్రత్యేకం మరిన్ని...