‘తబ్లిగీ’ తీర్పు

ABN , First Publish Date - 2020-08-26T06:16:19+05:30 IST

తబ్లిగీ జమాత్‌కు హాజరయిన విదేశీయులు 29 మందిపై మహారాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసులు చెల్లవని ముంబై హైకోర్టు గత శుక్రవారం నాడు ఇచ్చిన తీర్పు పత్రికలలో మారుమూల ప్రాధాన్యాన్ని...

‘తబ్లిగీ’ తీర్పు

తబ్లిగీ జమాత్‌కు హాజరయిన విదేశీయులు 29 మందిపై మహారాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసులు చెల్లవని ముంబై హైకోర్టు గత శుక్రవారం నాడు ఇచ్చిన తీర్పు పత్రికలలో మారుమూల ప్రాధాన్యాన్ని పొందింది కానీ, వాస్తవానికి అది అత్యంత తీవ్రమైన, సంచలనశీలమైన, సాహసోపేతమైన న్యాయనిర్ణయం. తీర్పులోని ఆచరణాత్మక ఆదేశాలు మహారాష్ట్రలో బాధితులయిన విదేశీ యాత్రికులకే పరిమితంగా కనిపిస్తున్నప్పటికీ, న్యాయమూర్తులు చేసిన అనేక వ్యాఖ్యలు, వ్యక్తం చేసిన అభిప్రాయాలు యావత్ దేశానికి సంబంధించినవి. కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారంటూ మర్కజ్ యాత్రికులను బలిపశువులను చేశారని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. కరోనా నిర్వహణలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ దుష్ప్రచారం జరిగిందని, యాభై ఏళ్లుగా ఏటా జరుగుతున్న తబ్లిగీ సమావేశాలపై లేనిపోని ఆరోపణలు చేశారని తీర్పులో పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులను, కరోనావ్యాప్తి తీవ్రతను దృష్టిలో పెట్టుకుంటే, ఈ ఇరవై తొమ్మిది మందిపై ఎటువంటి చర్యా అవసరం లేదని అర్థం అవుతుందని న్యాయస్థానం పేర్కొన్నది. ఈ కేసులో మహారాష్ట్ర పోలీసులు యాంత్రికంగా వ్యవహరించారని, రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ఒత్తిడులకు లొంగిపోయిందని కూడా తీర్పు వ్యాఖ్యానించింది. 


మార్చి నెల ప్రారంభం నుంచి ఢిల్లీలో ప్రారంభమైన తబ్లిగీ జమాత్ సమావేశాలు మూడు వారాలకు పైగా సాగాయి. కరోనా ముంచుకు వచ్చి లాక్‌డౌన్ విధింపు జరిగేనాటికి అనేకమంది విదేశీ, స్వదేశీ యాత్రికులు ఢిల్లీలోని సమావేశస్థలంలోనే చిక్కుకుపోయారు. మలేసియా, ఇండొనేసియా వంటి దేశాల నుంచి యాత్రికులు ఆ సమావేశాలకు హాజరయ్యారు. ఆ సమావేశాలలో కరోనా వ్యాపించి, యాత్రికులు వారి వారి స్వస్థలాలకు చేరుకుంటున్నప్పుడు అది ఆయా ప్రదేశాలలో కూడా వ్యాపించింది. యాత్రికుల పూర్తి వివరాలు తెలియకపోవడంతో, కొందరి ఆచూకీ కనుగొనడం కష్టమైంది. వైరస్ వ్యాప్తిలో అది తొలిదశ కావడం వల్ల, ఆ సమావేశం ద్వారా వ్యాధి సోకినవారి సంఖ్య అధికంగా కనిపించడం, దానికి తోడు వదంతులు పరిస్థితిని క్లిష్టం చేశాయి. ఒక వర్గం వారి వల్లనే వ్యాప్తి జరుగుతోందన్న అపోహలను తొలగించవలసింది పోయి కేంద్రప్రభుత్వ ప్రతినిధులు సైతం, తమ గణాంకాలలో మర్కజీ యాత్రికుల సంఖ్యను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇక సామాజిక మాధ్యమాలలో జరిగిన విద్వేష ప్రచారం సామాన్యమైనది కాదు. ఉద్దేశ్యపూర్వకంగా వ్యాధిని వ్యాపింపజేశారన్న ప్రచారానికి ఊతం ఇస్తున్నట్టుగా మర్కజ్‌కు హాజరైన 960 మంది విదేశీయులను బ్లాక్‌లిస్ట్ చేసి, వీసా నిబంధనలను ఉల్లంఘించినందుకు, విపత్తుల చట్టం ప్రకారం నేరాలు చేసినందుకు వారిపై కేంద్రం కేసులు పెట్టింది. ఆ 960 మందిలో భాగమే మహారాష్ట్రలోని 29 మంది కూడా. కొంతకాలం మర్కజ్ కరోనా రోగుల సంఖ్య కొనసాగినా, అతి త్వరలోనే వారు కోలుకున్నారు.. కరోనా వ్యాప్తిని అధికం చేసే పరిణామాలు దేశంలో ఆ తరువాత చాలా జరిగాయి. విదేశాల నుంచి తిరిగి వచ్చిన భారతీయులు, కాలినడకన దీర్ఘ ప్రయాణాలు చేయవలసి వచ్చిన వలసకూలీలు- అనివార్యంగా కొంత వ్యాప్తికి కారణమయ్యారు. ప్రభుత్వం వారి విషయంలో సకాలంలో స్పందించి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. ఎన్ని ఆంక్షలున్నా గుంపులు గుంపులుగా మనుషులతో సంచరించిన రాజకీయవాదులు అందరికంటె పెద్ద బాధ్యులు. మొత్తంగా చూస్తే, కరోనా నిర్వహణలో దారుణంగా విఫలమైన ప్రభుత్వాలు దేశంలో ఈనాడు ఇంత పెద్ద సంఖ్యలో కరోనా వ్యాప్తి జరగడానికి మూలకారణం. 


బొంబాయి హైకోర్టులో ఔరంగాబాద్ బెంచి ఇటువంటి తీర్పు ఇచ్చిందని కాదు కానీ, తబ్లిగీ జమాత్ కార్యక్రమం విషయంలో మన ప్రభుత్వం, సమాజం ఎట్లా స్పందించాయో ఒకసారి సమీక్షించుకోవలసిన కర్తవ్యం ఉన్నది. అంతేకాదు, ఈ విషయంలో మీడియా పాత్రను కూడా కోర్టు తప్పుపట్టింది. మర్కజీ యాత్రికుల విషయంలో దుష్ప్రచారానికి యాంత్రికమైన ప్రాధాన్యం ఇచ్చి, ప్రభుత్వాల అభీష్టాన్ని నెరవేర్చిన సమాచార, ప్రసార సాధనాలు, ఇప్పుడు ఈ తీర్పుకు ఎందుకు ఇంత తక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు? నిజంగా పొరపాటు జరిగిందేమో ఆత్మవిమర్శ చేసుకుంటే తప్పేమిటి? ఇది మహారాష్ట్రలోని 29 మందికి, దేశం మొత్తం 960 మంది విదేశీయులు సంబంధించిన అంశం కాదు. ఒక ప్రచారం, దేశంలోని స్థానికులైన దేశీయులైన ముస్లిముల విషయంలో ఎట్లా పనిచేసింది, వారిని ఎట్లా మరింత పరాయిని చేసింది- అన్నది ఆలోచించవలసిన విషయం. ఎందుకు మన సమాజం, మీడియా- విద్వేష సందర్భాలు వచ్చినప్పుడు బాధ్యతగా ఉండలేకపోతున్నాయి, గాలివాటంగా కొట్టుకుపోతున్నాయి- అన్న ప్రశ్నలు వేసుకోవాలి? పౌర సమాజం, మీడియా కూడా మెజారిటీవాద ఎజెండాలో భాగమైపోతే, ఈ దేశ భవితవ్యం ఎట్లా ఉండబోతున్నది? కేంద్రప్రభుత్వం ఒక అజెండాతో ముందుకు పోతున్నదనుకుందాము, మరి ప్రతిపక్షాలు ఏమి చేస్తున్నాయి? విషప్రచారానికి విరుగుడు ఎందుకు చేయలేకపోయాయి? కరోనా వ్యాప్తి మొదటి దశలో -ఎన్ని సంఘటనలు మర్కజ్ పై దుష్ప్రచారం ఆధారంగా జరిగాయో ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, ఆ కీలకమయిన సమయంలో కరోనా కట్టడికి అవసరమైన వ్యూహరచన చేయలేకపోయాము కదా బాధపడక తప్పదు.


‘‘జనవరి 2020 కంటె ముందు పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి, వాటిలో అత్యధికంగా ముస్లిములే పాల్గొన్నారు, ఆ చట్టం పక్షపాతంతో కూడినదని వారు భావించారు..’’ తీర్పులోని ఈ వ్యాఖ్యలు, ఆ ఆందోళనలను, మర్కజ్‌పై దుష్ప్రచారానికి నేపథ్యంగా భావిస్తున్నట్టు తోస్తుంది. మత సమావేశాలు మతవ్యాప్తి కోసమే కానక్కరలేదని కూడా న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.. ఈ తీర్పు ప్రభావం ఇతర రాష్ట్రాలలో విదేశీయాత్రికుల కేసులపై ఉండవచ్చు. ప్రభుత్వాలు, మీడియా తమ బాధ్యతను ఎంతవరకు అంగీకరిస్తాయో తెలియదు. కరోనా ఉపద్రవం సృష్టించిన సంక్షోభకాలంలో ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, మీడియా ప్రదర్శించిన అన్ని మంచి, చెడ్డ పోకడలను నిష్కర్షగా చర్చించుకోవలసిన సమయం మాత్రం వచ్చింది. 

Updated Date - 2020-08-26T06:16:19+05:30 IST