తబ్లిగ్ జమాత్ చీఫ్‌పై ముస్లిమ్ మతాధికారుల సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-04-06T18:49:25+05:30 IST

దేశంలో కరోనా వైరస్ ప్రబలేందుకు కారణమైన తబ్లిగ్ జమాత్ చీఫ్‌పై ముస్లిమ్ మతాధికారులు సంచలన వ్యాఖ్యలు చేశారు.....

తబ్లిగ్ జమాత్ చీఫ్‌పై ముస్లిమ్ మతాధికారుల సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ ప్రబలేందుకు కారణమైన తబ్లిగ్ జమాత్ చీఫ్‌పై పలువురు ముస్లిమ్ మతాధికారులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో కరోనా వైరస్ ప్రబలుతున్న తరుణంలో మార్చి నెలలో నిజాముద్దీన్ తబ్లిగ్ జమాత్ సమావేశాన్ని రద్దు చేయాలని జమాత్ చీఫ్ మౌలానా ముహమ్మద్ సాద్ కు పలువురు సీనియర్ ముస్లిమ్ మతాధికారులు, మేధావులు, అతని సహాయకులు సలహా ఇచ్చినా వినలేదని వెల్లడైంది. జమాత్ చీఫ్ సాద్ తన మొండివైఖరితో గుడ్డిగా సమావేశం పెట్టి జమాత్ అనుచరులను ప్రమాదంలోకి పడేశాడని పలువురు ఆరోపించారు.


దేశంలో జమాత్ సమావేశం వల్లనే 30 శాతానికి పైగా కరోనా కేసులు బయటపడిన నేపథ్యంలో పరారీలో ఉన్న జమాత్ చీఫ్ పై ముస్లిమ్ మతాధికారులే విమర్శలు కురిపిస్తున్నారు. జమాత్ చీఫ్ తన మొండివైఖరి, అజ్ఞానంతోనే అనుచరులను ప్రమాదంలో పడేశాడని జమాత్ నాయకుడు ముహమ్మద్ ఆలం విమర్శించారు. కరోనా వైరస్ పరీక్షలు చేయించుకోకుండా జమాత్ చీఫ్ అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లారని తబ్లిగ్ సభ్యుడు లియాఖత్ అలీఖాన్  ప్రశ్నించారు.


తాము సమావేశం రద్దు చేయాలని పదే పదే చేసిన అభ్యర్థనలను  తబ్లిగ్ జమాత్ చీఫ్ వినలేదని పలువురు తబ్లిగ్ జమాత్ నేతలు చెప్పారు. ఢిల్లీ సమావేశాన్ని రద్దు చేయాలని తాము ఇచ్చిన సలహాను చీఫ్ పాటించలేదని కాంగ్రెస్ నాయకుడు మీమ్ అప్జల్, మరో ముస్లిమ్ నాయకుడు జాఫర్ సారేశ్వాలాలు వివరించారు. 

Updated Date - 2020-04-06T18:49:25+05:30 IST