తబ్లిఘీ తక్లీఫ్‌!

ABN , First Publish Date - 2020-04-03T08:48:42+05:30 IST

ఢిల్లీలో మార్చి 13-15 మఽధ్య జరిగిన ఇస్లామిక్‌ సమ్మేళనం- తబ్లిఘీ జమాత్‌కు హాజరైన వారి కోసం కేంద్రం దేశమంతటా జల్లెడ పడుతోంది. ఇప్పటిదాకా దీనికి హాజరైన సభ్యులతో పాటు వారితో...

తబ్లిఘీ తక్లీఫ్‌!

  • 9 వేల మంది తబ్లిఘీల స్వీయ నిర్బంధం
  • బ్లాక్‌లి్‌స్టలో 960 మంది విదేశీయులు
  • 9 మంది మతపెద్దలపై యూపీలో కేసులు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 2: ఢిల్లీలో మార్చి 13-15 మఽధ్య జరిగిన ఇస్లామిక్‌ సమ్మేళనం- తబ్లిఘీ జమాత్‌కు హాజరైన వారి కోసం కేంద్రం దేశమంతటా జల్లెడ పడుతోంది. ఇప్పటిదాకా దీనికి హాజరైన సభ్యులతో పాటు వారితో కలిసి తిరిగిన, వారు కాంటాక్ట్‌ చేసిన సుమారు 9000 పైచిలుకు మందిని స్వీయ-నిర్బంధంలోకి పంపామని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వీరిలో 1306 మంది విదేశీయులే కావడం విశేషం. ‘ఈ సంఖ్య 9 వేలతో ఆగదు. ఆ సమావేశానికి వెళ్లొచ్చిన వారితో కలిసిన ఎందరో ఇంకా ఉండే ఉంటారు. వారిని అన్వేషిస్తున్నాం. ఒక్క ఢిల్లీలోనే 2000 మందిని క్వారంటైన్‌ చేశాం. వీరిలో 250 మంది విదేశీయులు. వైరస్‌ లక్షణాలు ఎక్కువగా ఉన్న 334 మందిని ఆసుపత్రుల్లో చేర్చాం’’ అని హోంశాఖ సంయుక్త కార్యదర్శి పున్యా సలీలా శ్రీవాస్తవ చెప్పారు. వీరు తిరిగిన అనేక ప్రదేశాల్లోని 8000 మందికి ఇపుడు పరీక్షలు జరుగుతున్నాయి. ఇందులో ఎంతమందికి పాజిటివ్‌ అని రిపోర్టు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. కరోనా పాజిటివ్‌ అని తేలిన 400 మంది నిజాముదీన్‌ మర్కజ్‌కు హాజరైన వారేనని అటు వైద్య ఆరోగ్యశాఖ కూడా ప్రకటించింది.  తమిళనాడులో వైరస్‌ లక్షణాలున్న దాదాపు 173 మందిలో అత్యధికులు నిజాముదీన్‌ మర్కజ్‌తో సంబంధం ఉన్నవారేనని, ఈ సమావేశానికి హాజరై వివిధ రాష్ట్రాలకు తరలిపోయిన వారందరి స్నేహితులు, బంధువులు, ఆఫీసు సిబ్బంది, సహచరుల కోసం వెతుకులాట సాగుతోందని వైద్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ బుధవారంనాడు తెలిపారు. కాగా, దేశంలో ఉన్న సుమారు 960 మంది విదేశీ తబ్లిఘీలను కేంద్రం బ్లాక్‌లి్‌స్టలో పెట్టింది. వీరంతా టూరిస్ట్‌ వీసాలపై వచ్చినవారు.


ఇలా వచ్చినవారు మత ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. వీసా రూల్స్‌ను ఉల్లంఘించిన వీరందరిపైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఢిల్లీతో పాటు వివిధ రాష్ట్రాల పోలీస్‌ అధికారులను ఆదేశించారు.  ‘వారు ఎక్కడ ఉన్నా పిలిపించండి. విదేశీయుల చట్టం, విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు పెట్టండి’ అని హోంశాఖ మంత్రి కార్యాలయం ట్వీట్‌ చేసింది. లాక్‌డౌన్‌ విధించాక కూడా నిజాముదీన్‌ దర్గాలో 2300 మంది ఒకేచోట ఆవాసం ఉండడం, వారిలో 250 మంది విదేశీయులు కావడం వివాదం రేపింది. ఈ 2300 మందిలో 300 మందికి వైరస్‌ పాజిటివ్‌ అని తేలింది. దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 కేసుల్లో 450 కేసులు, 12 మరణాలు నిజాముదీన్‌ సమావేశంతో లింకులున్నవి కావడంతో ఈ దేశవ్యాప్త వేట మొదలైంది.  


15 దేశాల నుంచి ప్రతినిధులు

మర్కజ్‌కు హాజరైన వారిలో 15 దేశాలకు చెందిన వారున్నట్లు హోంశాఖ అంచనా. వీరిలో ఇద్దరు అమెరికన్లు, ఫ్రాన్స్‌, ఇటలీ, బెల్జియం, ట్యునీషియాల నుంచి ఒక్కొక్కరు, ఇండొనేషియా నుంచి 172 మంది, కిర్గిస్థాన్‌ (36), బంగ్లాదేశ్‌ (21), మలేషియా (12), అల్జీరియా (7), అఫ్గానిస్థాన్‌ (2), ఇరాన్‌, సౌదీ అరేబియాల నుంచి మిగిలినవారు హాజరైనట్లు హోంశాఖ తేల్చింది. ఈ 1306 మందిలో ఎక్కువ మంది (250) ఢిల్లీలో దొరకగా, ఉత్తరప్రదేశ్‌కు 247 మంది, మహారాష్ట్ర- 154, తమిళనాడు-133, తెలంగాణ-96, హరియాణా-86, బెంగాల్‌-70, మఽధ్యప్రదేశ్‌-59, జార్ఖండ్‌-38, ఆంధ్రప్రదేశ్‌-24, ఉత్తరాఖండ్‌-12, కర్ణాటక-24, ఒడిషా-7, రాజస్థాన్‌-5, పంజాబ్‌-3 లకు వెళ్లినట్లు తెలిపింది. వీరిలో కర్ణాటక, పంజాబ్‌లకు వెళ్లిన 27 మంది స్వదేశాలకు వెళ్లిపోయినట్లు కూడా వెల్లడించింది.  వీరి ద్వారా ఎవరెవరికి వైరస్‌ సోకిందన్నది ఆరా తీస్తున్నారు. 


క్వారంటైన్‌ ఇస్లాంకు వ్యతిరేకం కాదు

అజ్ఞాతంలో ఉన్న -ఢిల్లీ సమావేశ ప్రధాన నిర్వాహకుడు, తబ్లిఘీ జమాత్‌ చీఫ్‌ మౌలానా సాద్‌ ఖాంధ్లావీ ... తాను కూడా స్వీయ నిర్బంధంలోనే ఉన్నట్లు తెలిపారు. ఆయనపై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ‘మీరు ఎక్కడున్నా సరే, ఏకాంతంలోకి వెళ్లండి. ఎవరినీ కలవకండి. క్వారంటైన్‌ కావడం ఇస్లామ్‌కు, షరియాకు వ్యతిరేకం కాదు. ప్రభుత్వం చెప్పినట్లు, చట్ట ప్రకారం నడుచుకోవాలి’ అని బుధవారం నాడు తబ్లిఘీ జమాత్‌ యూట్యూబ్‌ చానెల్‌ ద్వారా ఆయన పేరిట, ఆయన గళమని చెప్పే విడుదల అయిన  ఓ ఆడియో సందేశంలో ఉంది. మసీదులు ఖాళీ చేయవద్దని, లాక్‌డౌన్‌ ధిక్కరించండని ఆయన గతంలో పిలుపిచ్చినట్లు వార్తలొచాయి. తాజా ఆడియో సందేశం ఆయన యూ టర్న్‌ తీసుకున్నట్లు వివరిస్తోంది. ‘మానవాళి చేసిన పాపాల వల్లే ఈ కరోనా వైరస్‌ వచ్చింది. అల్లా మానవాళిపై ఆగ్రహంగా ఉన్నారు’ అని ఆయన అన్నట్లు ఆ ఆడియోలో ఉంది. ఖాంధ్లావీ ఆచూకీ కోసం ఢిల్లీ పోలీసులు గాలిస్తున్నారు. 


Updated Date - 2020-04-03T08:48:42+05:30 IST