ట్రంప్‌ డైట్‌కోక్‌ మీట మాయం!

ABN , First Publish Date - 2021-01-23T06:46:24+05:30 IST

ఓవల్‌ ఆఫీసులోని అమెరికా అధ్యక్షుడి టేబుల్‌పై ట్రంప్‌కు ప్రీతిపాత్రమైన ఆ మీట ఇప్పుడు కనిపించడం లేదు.

ట్రంప్‌ డైట్‌కోక్‌ మీట మాయం!

కార్యాలయం టేబుల్‌ నుంచి తొలగించిన బైడెన్‌ 


న్యూఢిల్లీ, జనవరి 22: ఓవల్‌ ఆఫీసులోని అమెరికా అధ్యక్షుడి టేబుల్‌పై ట్రంప్‌కు ప్రీతిపాత్రమైన ఆ మీట ఇప్పుడు కనిపించడం లేదు. దాన్ని కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌ తొలగించేశారు. మునుపు ఆ టేబుల్‌పై చెక్క బాక్సుతో కూడిన ఎర్ర కలర్‌ మీట ఉండేది. డైట్‌ కోక్‌ అంటే ట్రంప్‌కు ఎంతో ఇష్టం. కోక్‌ కావాలనుకున్నప్పుడల్లా ఆ మీటను ట్రంప్‌ నొక్కేవారు. నొక్కిన ప్రతిసారి వెండిపళ్లెంలో ఓ డైట్‌ కోక్‌ను పెట్టుకొని ఓ నౌకరు ఆ గదిలోకి ప్రవేశించి ట్రంప్‌కు అందజేసేవాడు. అయితే ఈ బటన్‌, ట్రంప్‌ అధ్యక్షుడు కాక మునుపు నుంచే ఆ టేబుల్‌ మీద ఉం డేది. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన కూడా ఈ మీటను ఉపయోగించేవారు. ఇప్పుడు కొత్త అధ్యక్షుడిగా బైడెన్‌ టేబుల్‌పై ఈ మీట మాయమైంది. అధ్యక్షుడిగా తొలిరోజు ఆయన టేబుల్‌పై రెండు ఫోన్లు, ఓ కాఫీ కప్పు, ఓ పెన్నుల సెట్టు మాత్రమే కనిపించాయి.


అధ్యక్ష పదవిని చేపట్టినవారిలో చాలామంది తమ అభిరుచులకు అనుగుణంగా కార్యాలయాన్ని మార్పుకోవడం సహజం. బైడన్‌ రావడంతో ఇప్పుడూ ఓవల్‌ ఆఫీసు కొత్తగా కనిపిస్తోంది. ఆఫీసులో అప్పటిదాకా ఉన్న మాజీ అధ్యక్షులు ఆండ్రూ జాక్సన్‌, ఫ్రాంక్లిన్‌ రూజ్‌వెల్డ్‌ చిత్తరువులను బైడన్‌ తొలగించారు. మాజీ అధ్యక్షుడు థామస్‌ జెఫర్‌సన్‌, ప్రగతిశీల వాదులైన రాబర్ట్‌ ఎఫ్‌ కెన్నెడీ, మార్టిన్‌ లూథర్‌కింగ్‌ జూనియర్‌, రోసా పార్క్స్‌ ఎలనోర్‌ రూజ్‌వెల్డ్‌, పౌరహక్కుల కార్యకర్త సీజర్‌ చావేజ్‌ చిత్తరువులను ఉంచారు.

Updated Date - 2021-01-23T06:46:24+05:30 IST