Sep 15 2021 @ 17:29PM

విజయ్‌ సేతుపతిలో ఉన్న గొప్ప గుణం అదే: తాప్సీ

విజయ్‌ సేతుపతి, తాప్సీ కాంబినేషన్‌లో యోగిబాబు, రాధిక తదితరులు నటించిన చిత్రం ‘అన్నాబెల్లె సేతుపతి’. ఈ చిత్రం ఓటీటీలో ఈ నెల 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. దీపక్‌ సౌందర్‌రాజన్‌ దర్శకత్వం వహించగా.. నిర్మాతలు సుధాన్‌ సుందరం, జి. జయరాం కలిసి నిర్మించారు. కృష్ణకిషోర్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి గౌతమ్‌ జార్జ్‌ కెమెరామెన్‌గా పనిచేశారు. తాజాగా ఈ చిత్ర విశేషాలను నటి తాప్సీ మీడియాకు తెలియజేసింది. 


ఆమె మాట్లాడుతూ.. ‘‘విజయ్‌ సేతుపతితో కలిసి ‘అన్నాబెల్లె సేతుపతి’ చిత్రంలో నటించడం నా జీవితంలో ఓ మధుర స్మృతిలాంటిది. ఇది నాకు ఓ స్పెషల్‌ మూవీ. నిజానికి దెయ్యం కథతో తెరకెక్కే చిత్రాల్లో నటించడం నాకు పెద్దగా ఇష్టంవుండదు. కానీ, చిత్ర దర్శకుడు దీపక్‌ కథను వివరిస్తూ ఇది ఒక ఫాంటసీ మూవీ అని చెప్పారు. అందుకే ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించాను. అదే సమయంలో కేవలం ఒక్కో భాషకు ఒక్కో కథను ఎంపిక చేయడం లేదు. కానీ, కొన్ని సందర్భాల్లో తమిళం, తెలుగు, హిందీ భాషల్లో వేర్వేరు కథా చిత్రాల్లో నటించే అవకాశం లభించింది. ఇపుడు ‘అన్నాబెల్లె సేతుపతి’ తమిళం కోసం తీసిన కథ. దీన్ని తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. ప్రతి యేడాది ఒక సౌత్‌ ఇండియన్‌ మూవీలో నటించాలన్నది నా లక్ష్యం. నిజానికి తమిళం, తెలుగు భాషల్లో నటించాలని కోరుకుంటాను. కానీ, తమిళంలోనే కథలు వస్తున్నాయి. అలా నేను నటించిన చిత్రం ఏక కాలంలో తమిళం, తెలుగు భాషల్లో విడుదలకానుండటం చాలా సంతోషంగా ఉంది. తెలుగులో ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ చేశాను. అలాగే, ‘గేమ్‌ ఓవర్‌’ అనే తమిళ చిత్రంలో కూడా నటించాను. ఇది తెలుగులో కూడా విడుదల కానుంది. వేర్వేరు భాషల్లో వేర్వేరు కథల్లో నటిస్తున్నాననే ఫీలింగ్‌ నా ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకుల మదిలో కలగకూడదు. అందుకే అన్ని భాషల్లో ఒకే తరహా కథను ఎంచుకుంటున్నాను. కామెడీ చిత్రాల కంటే వెరీ సీరియస్‌ కథల్లో నటించాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. నిజానికి ఆన్‌స్ర్కీన్‌, ఆఫ్‌స్ర్కీన్‌లోనే కాకుండా నిజజీవితంలో కూడా హాస్యాన్ని అమితంగా ఇష్టపడతాను. అందువల్ల ఈ చిత్రం విజయవంతమైతే మున్ముందు మరిన్ని హాస్యభరిత చిత్రాల్లో నటించే అవకాశం లభిస్తుంది.


హీరో విజయ్‌ సేతుపతి గురించి చెప్పాలంటే చాలా మంచి వ్యక్తి. ఒక నటుడిగానే కాకుండా, వ్యక్తిగతంగా, వృత్తిపరంగా వెరీగుడ్‌ పర్సన్‌. విజయ్‌ సేతుపతి వంటి స్టార్‌ హీరో.. అమ్మాయి పేరుమీద టైటిల్‌‌తో ఉన్న చిత్రంలో నటించడం అనేది చాలా గొప్పవిషయం. ఇది విజయ్‌ సేతుపతిలో ఉన్న గొప్ప గుణం. అలాగే, బయోపిక్‌ చిత్రాల విషయానికి వస్తే ‘కెప్టెన్‌ మార్వెల్‌’, ‘అవెంజర్స్‌’ వంటి చిత్రాల్లో నటించాలని ఉంది. ముఖ్యంగా మార్వెల్‌ వంటి నిర్మాణ సంస్థ నుంచి ఇండియన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ కలిగిన యువతులకు ఆహ్వానం వస్తే ఖచ్చితంగా నేను అడిషన్స్‌కు వెళ్ళి పాల్గొంటాను’’ అని వెల్లడించింది.