Jul 4 2021 @ 20:17PM

ఆ చర్చలపై.. కరీనాకు తాప్సీ సపోర్ట్‌

తెలుగు చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన తాప్సీ ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో నటిస్తూ స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఈ మధ్యకాలంలో ఆమె బాలీవుడ్‌ చిత్రాలకే పరిమితమవుతోంది. అయితే, ఆమె తాజాగా మీడియాకు ఓ ప్రశ్న సంధించారు. హీరోయిన్లు తీసుకునే పారితోషికం మాత్రమే మీడియాకు కనిపిస్తుందా అని ప్రశ్నించారు. సాధారణంగా హీరోయిన్ల కంటే హీరోలు అత్యధికంగా పారితోషికం తీసుకుంటారని, కానీ, హీరోలు ఎంత తీసుకున్నప్పటికీ చర్చ మాత్రం జరగదని, అదే హీరోయిన్‌ ఒక లక్ష రూపాయలు పెంచినా దానిపై చర్చ జరుగుతుందని, ఇదేం పద్దతి అంటూ తాప్సీ ప్రశ్నించింది. 


బాలీవుడ్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ ఇటీవల ఓ చిత్రంలో సీత పాత్ర వేసేందుకు ఏకంగా రూ.12 కోట్లను డిమాండ్‌ చేసింది. ఈ వార్త విన్న సినీ ప్రముఖులతో పాటు.. మీడియా జర్నలిస్టులు ఆశ్చర్యపోయారు. ఒక హీరోయిన్‌కు రూ.12 కోట్లా అంటూ టీవీల్లో ప్రత్యేక చర్చా కార్యక్రమాలు జరిగాయి. ఈ చర్యలను తాప్సీ తీవ్రంగా ఖండించింది. హీరోలు మాత్రం రూ.50 నుంచి రూ.100 కోట్లు తీసుకున్నప్పటికీ నోరు మెదపని మీడియా ఒక హీరోయిన్‌ రూ.12 కోట్లు అడగడాన్ని భూతద్దంలో చూపించడం ఎంతవరకు సబబని ఆమె ప్రశ్నించింది. అంతేకాకుండా, భారతీయ చిత్ర పరిశ్రమలో కరీనా కపూర్‌ ఒక లేడీ సూపర్‌ స్టార్‌ అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని తాప్సీ విఙ్ఞప్తి చేసింది. 

Bollywoodమరిన్ని...